Share News

మద్దతివ్వండి..

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:02 PM

రాష్ట్రంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరిలో పోరు రసవత్తరంగా మారుతోంది.

మద్దతివ్వండి..

  • కిందిస్థాయి నాయకులకు అభ్యర్థుల వినతి

  • రేపు గెలిచాక అండగా ఉంటామని హామీ

  • మద్దతు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థుల వేడుకోలు

  • ప్రతిష్ఠాత్మకంగా మారిన మల్కాజిగిరి పోరు

  • గెలుపునకు చెమటోడుస్తున్న మూడు పార్టీలు

  • సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో బిజీ

అల్వాల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరిలో పోరు రసవత్తరంగా మారుతోంది. ఎలాగైనా జెండా ఎగురేసేందుకు మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా కదనరంగంలో పోరాడుతున్నాయి. సీఎం రేవంత్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అధికార కాంగ్రెస్‌ ఈ సీటును సవాల్‌గా తీసుకొని పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలతో బిజిబిజీగా మారాయి. పార్టమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను, ముఖ్యనేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నాయి. పార్టీలపై అలక వహించిన వారి ఇళ్లకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నాయి.

పక్కా వ్యూహంతో కాంగ్రెస్‌

ఈ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. బలమైన నాయకుడైన పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డిని పార్టీ అధిష్ఠానం బరిలోకి దింపింది. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , ఇతర సీనియర్‌ నాయకులతో కలిసి ఆమె లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

మోదీ చరిష్మాతో ముందుకు..

బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అభ్యర్ధిత్వం ఖరారు కాగానే నియోజకవర్గాల వారీగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను కలుస్తూ బీజేపీ గెలుపునకు శ్రమించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టడంతోపాటు అయోధ్యలో రామాలయం మందిర నిర్మాణం, ఇంటింటికి అక్షింతలు, కేంద్ర పథకాలును ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రధానంగా ప్రధాని మోదీ చరిష్మాను నమ్ముకొని ముందుకు సాగుతున్నారు.

పట్టు కోసం బీఆర్‌ఎస్‌

అధికార కాంగ్రె్‌సను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేస్తోంది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతూ స్ధానిక ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని మల్కాజిగిరి, మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధించడంతో లోక్‌సభలోనూ సులువుగా గట్టెక్కుతానని పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 04:02 PM