‘భద్రత’ ఎందరికో ?
ABN , Publish Date - May 21 , 2024 | 03:50 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు ఇస్తామని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చడం లేదు.
ఆహారభద్రత కార్డుల కోసం ఎదురుచూపులు
ఆరు గ్యారెంటీల అమలుకు కార్డు తప్పనిసరి
అవి లేక పథకాలకు చాలా కుటుంబాలు దూరం
కొత్త వాటి కోసం 5.73 లక్షల మంది దరఖాస్తు
లోక్సభ కోడ్ రావడంతో ఆగిన జారీ ప్రక్రియ
కౌంటింగ్ తర్వాత కొత్త వాటికి మోక్షం
పేర్ల చేరిక, అడ్రస్ మార్పునకు లేని చాన్స్
హైదరాబాద్ సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు ఇస్తామని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారికి సైతం కార్డులు పంపిణీ చేయని పరిస్థితి. దీంతో అర్హులైన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు. చాలా కాలం నుంచి ఏదో ఒక రూపంలో అడుగడుగున ఈ కార్డుల జారీకి బ్రేక్ పడుతోంది. దీంతో రోజుల తరబడి కార్డుల కోసం జనానికి ఎదురుచూపులే మిగిలాయి. చాలా మంది ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు సమర్పించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కార్డులు వస్తాయని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
5,73,609 మంది దరఖాస్తులు
గ్రేటర్ పరిధిలో 27.21 లక్షల వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో రేషన్ కార్డుల కోసం 5,73,609 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి కార్డులను పంపిణీ చేస్తారా? లేక మళ్లీ ఆన్లైన్లో కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారా? తెలియడం లేదు. అయితే నాలుగేళ్లుగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఆన్లైన్ సర్వర్ కూడా పనిచేయడం లేదు. దాదాపు నాలుగేళ్ల క్రితం కొన్ని కార్డులు ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో యాభై శాతం మేరకు కార్డులు ఇచ్చారు. మిగితా వారికి ఇవ్వలేదు. ఏవోసాకులతో వాటిని తిరస్కరించారు. అది కూడా కొన్నింటిని పాతవాటిని తొలగించి కొందరికి మాత్రమే కార్డులు ఇచ్చారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పరిధిలో ప్రస్తుతం 6,39,609 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 30,259, అన్నయోజన అంత్యోదయ కార్డులు 1,290 ఉన్నాయి. దాదాపు 23,64,779 కుటుంబాలు కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కొత్త సభ్యుల చేరికలూ లేవు
ఆహార భద్రత కార్డులో కొత్త సభ్యుల చేర్పులు, తొలగింపు ప్రక్రియ కూడా జరగడం లేదు. చాలా మందికి పెళ్లీలు కావడం, వేరు కాపురాలు పెట్టడం, పిల్లలు పుట్టడంతో వారి పేర్లను చేరాల్చిన అవసరముంది. కొత్త కార్డులు ఇచ్చిన సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఉన్న వారు ప్రస్తుతం పెళ్లీలు అయి వేరు కాపురాలు పెట్టారు. ఇందులో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది చిరునామాలు మారాయి, వారు అడ్రసులను మార్చుకునే సదుపాయం లేకుండా పోయింది.
త్వరలో ప్రక్రియ వేగవంతం
నూతన రేషన్ కార్డుల జారీకి లోక్సభ కోడ్ అడ్డంకిగా మారింది. డిసెంబర్లో స్వీకరించిన దరఖాస్తుల స్ర్కూటినీ చేపట్టారు. అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగియగానే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కానుందని తెలుస్తోంది.