Share News

ప్రచారం అంతంతే!

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:05 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ ప్రచార ఊపు కానరావడం లేదు.

ప్రచారం అంతంతే!

  • ‘లష్కర్‌’ కాంగ్రె్‌సలో కలవరం

  • ఊపందుకోని ప్రచారం.. స్తబ్దుగా శ్రేణులు

  • పూర్తికాని బూత్‌ లెవల్‌ మీటింగ్‌లు

  • సమావేశాల్లో కనిపించని కీలక నేతలు

  • ఒంటరిగానే ముందుకెళ్తున్న ‘దానం’

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ ప్రచార ఊపు కానరావడం లేదు. కీలక నేతలెవరూ కదలట్లేదు. పార్టీకి కీలకమైన నేతలున్నా.. ప్రచారంలో మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అనే చందంగా వ్యవహరిస్తున్నారు. బూత్‌ లేవల్‌ సమావేశాలు ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేయాలని అధిష్ఠానం ఆదేశించిన విషయ తెలిసిందే. అయినా పలువురు నేతలు పెడచెవిన పెడుతున్నారు. ి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లోనే బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి దానం నాగేందర్‌ ఒంటరిగానే తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇంకా నాలుగు నియోజకవర్గాల్లో..

‘సికింద్రాబాద్‌’ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటీ దక్కకపోయినా.. ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థిగా బరిలో నిలిచిన దానం నాగేందర్‌ గెలుపు కోసం నేతలంతా ఐక్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. తొలుత నియోజకవర్గాల వారీగా బూత్‌స్థాయి సమావేశాలు జరుపాలని నిర్ణయించారు. బూత్‌ల వారీగా ప్రతీ ఓటరును కలిసి కాంగ్రె్‌సకు ఓటు పడేవిధంగా విజ్ఞప్తులు చేయాలని సూచించారు. అందుకనుగుణంగానే నాంపల్లి, అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మరో నాలుగు నియోజకవర్గాల సమావేశాలు జరగాల్సి ఉంది.

కానరాని కీలక నేతలు

సీఎం రేవంత్‌తో సమావేశం జరిపిన మరుసటిరోజే నాంపల్లి నియోజకవర్గ బూత్‌ లేవల్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌లోని ముఖ్య నేతలంతా హాజరయ్యారు. పాత నేతలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన నాయకులతో సమావేశమంతా ఐక్యంగా కనిపించింది. అన్నీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఇతర నేతలు హాజరయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన అంబర్‌పేట సమావేశానికి మాత్రం ముఖ్య నేతల్లో వీహెచ్‌, రోహిణ్‌రెడ్డి, దానం నాగేందర్‌, బల్మూర్‌ వెంకట్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక ఇతర నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ఇతర నేతలు చాలా వరకు డుమ్మా కొట్టారు. ఇటీవల ముషీరాబాద్‌ నియోజకవర్గ సమావేశం జరిపితే అభ్యర్థి దానం నాగేందర్‌తో పాటు ఇన్‌చార్జిగా ఉన్న ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, అతడి తమ్ముడు అరవింద్‌యాదవ్‌లే హాజరయ్యారు. ఈ సమావేశానికి గ్రేటర్‌లోని కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా డుమ్మా కొట్టారు. దీంతో దానం నాగేందర్‌ ఒక్కరే సమావేశాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒంటరిగానే ముందుకు

హేమాహేమీ నేతలున్నా ప్రచారంలో ఎవరూ కానరావడం లేదు. వారంత రంగంలో దిగి ప్రచారం చేస్తే శ్రేణుల్లో మరింత ఊపు రావడంతో విజయ తీరాలకు చేరడం సులువు కానుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిందనే ఊపుతో ఉత్సహంగా పని చేయాల్సిన నేతలంతా నిరసపడిపోయారు. దానం ప్రచారంలో సీనియర్‌ నేతలంతా కనిపించడం లేదు. ప్రధానంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌, మాజీ ఎంపీ వీహెచ్‌, సీనియర్‌ నేత కేశవరావు, అజారుద్దీన్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, పలు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులెవరూ ఇంకా ప్రచారంలోకి దిగలేదు. వివిధ కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులను ఆశిస్తున్న నేతలెవరూ ప్రచారం చేయడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థి దానం నాగేందర్‌ ఒంటరిగానే ఎన్నికలను ఈదుతున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 04:05 PM