పాత కాపులే!
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:49 PM
జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.
‘జహీరాబాద్’లో ఢీ అంటున్న అభ్యర్థులు
బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్, కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్
బీఆర్‌ఎస్ తరఫున గాలి అనిల్‌కుమార్
ప్రచారంలో బిజీబిజీగా ముగ్గురు అభ్యర్థులు
విజయం కోసం చెమటోడుస్తున్న ప్రధాన పార్టీలు
సమావేశాలతో ప్రజలకు చేరువ
కామారెడ్డి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. అభ్యర్థులు పార్టీలు మారినప్పటికీ పాత కాపులనే బరిలో దింపాయి. అధికార కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్‌ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఇటీవల బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బలమైన నేతలే కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
నాలుగోసారి పోటీలో షెట్కార్
కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సురేశ్ షెట్కార్ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. కాగా, 2014లో ఓటమి పాలయ్యారు. దీంతో 2019లో పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలో 2019లో మదన్‌మోహన్‌రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ఓటమి చెందారు. మళ్లీ ఈ ఎన్నికల్లో షెట్కార్‌కు టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి ఆయన నాలుగోసారి బరిలో దిగుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో జహీరాబాద్ టికెట్‌కై పోటీ పెరిగింది. గెలిచే అభ్యర్థినే బరిలో దింపాలని నిర్ణయించిన అధిష్ఠానం సీనియర్ నాయకుడైన సురేశ్ షెట్కార్‌ను బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ విజయం సాధిస్తారా లేదా చూడాలి.
హ్యాట్రిక్‌పై బీబీ పాటిల్ కన్ను
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పోటీకి దిగారు. హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆయన ప్రచారంలో వేగం పెంచారు. మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన పాటిల్ బడా వ్యాపారవేత్త. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనతో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన బీబీపాటిల్‌కు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ నుంచి స్వల్ప ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌పై గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ అధికారాన్ని కోల్పోవడం.. ఈ సెగ్మెంట్ పరిధిలో కేవలం బీఆర్‌ఎ్‌సకు రెండు సీట్లే వచ్చాయి. దీంతో ఆయన బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మరుసటి రోజే ఆయనను బీజేపీ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పార్లమెంట్ సెగ్మెంట్‌లో అనుకున్న మేర అభివృద్ధి పనులు చేయకపోవడం ఆయనపై స్వల్ప వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది.
‘గాలి’పైనే బీఆర్‌ఎస్ ఆశలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎంపీ పాటిల్ బీజేపీలో చేరడంతో బీఆర్‌ఎ్‌సకు కొలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఎవరిని బరిలో దింపాలనేది బీఆర్‌ఎస్ అధిష్ఠానం సమాలోచనలో పడింది. ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, గాలి అనిల్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో గాలి అనిల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. అనిల్‌కుమార్ 2019లో మెదక్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నర్సాపూర్ టికెట్ ఆశించి రాకపోవడంతో మళ్లీ బీఆర్‌ఎ్‌సలో చేరారు. తాజాగా జహీరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన రెండోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.