ఐదు నెలల్లో రెండుసార్లు
ABN , Publish Date - May 10 , 2024 | 03:57 PM
ఎన్నికలంటే సాధారణ విషయం కాదు. పార్టీలో టికెట్ దక్కించుకోవడం మొదలు,పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది.
అధిష్ఠానాల ఆదేశాలతో పోటీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు
వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే
తలకు మించిన భారంగా ఖర్చు
అయినా సత్తా చాటుతామంటున్న అభ్యర్థులు
హైదరాబాద్ సిటీ, మే 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికలంటే సాధారణ విషయం కాదు. పార్టీలో టికెట్ దక్కించుకోవడం మొదలు,పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. పార్టీలోని ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ముందుకుసాగాలి. అలాగే అగ్రనేతలతో నిర్వహించే సభలు, సమావేశాలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అడిగినవన్నీ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నగదు, మద్యం తదితరాలు సమాకూర్చాల్సి ఉంటుంది. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ధైర్యంతో వెళ్తేనే విజయావకాశాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి పోటీ చేయడమే గగనం. అలాంటిది కొంతమంది అభ్యర్థులు వరుస ఎన్నికలను ఎదుర్కొవడం గమనార్హం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల రణరంగంలో దూకాల్సిన పరిస్థితి. ఎన్నిక ఏదైనా సత్తా నిరూపిస్తామంటూ ఓటర్ల వద్దకు వెళ్తూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
5 నెలలు.. రెండు ఎన్నికలు..!
గ్రేటర్‌లోని సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు 5 నెలల వ్యవధిలో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి అధికార కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి దానం నాగేందర్. ఆయన 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. కొద్ది రోజుల క్రితం ఆయన బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఆయనను సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిపింది. అలాగే సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీచేస్తున్న మరో అభ్యర్థి తిగుళ్ల పద్మారావు గౌడ్. ఈయన కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఆయన కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు కేవలం ఐదు నెలల్లోనే రెండు ఎన్నికల్లో పోటీ చేస్తూ కదనరంగంలో దూసుకుపోతున్నారు.
ఖర్చులు తడిసి మోపెడు..!
ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో ఆయా అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చుచేశారు. పార్టీ ఫండ్ కంటే సొంతంగా కోట్లాది రూపాయలు వెచ్చించారు. అయితే ఆ ఖర్చు నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ఫండ్‌తోపాటు బంధువులు, స్నేహితుల నుంచి డబ్బును సమకూర్చుకుంటున్నారు. మరికొందరు సొంతంగానే భరిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే తమ మార్కు మరింత పెరుగుతోందన్న భావనతో ఖర్చుకు వెనకాడడం లేదని తెలుస్తోంది.
గత ఎన్నికల్లోనూ ఇద్దరు నేతలు
గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇద్దరు నేతలు వరుస ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీచేసి ఓటమి చెందారు. అయితే ఆ వెంటనే 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి, కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో కీలకనేతలుగా ఎదిగారు. కాగా, వీరిద్దరు కూడా 5 నెలల్లోనే రెండు ఎన్నికల్లో పోటీచేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.