Share News

గ్రేటర్‌ నాడి పట్టేదెలా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:56 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో హాట్‌ ఫైట్‌ కొనసాగుతోంది.

గ్రేటర్‌ నాడి పట్టేదెలా?

  • ఉత్కంఠగా లోక్‌సభ ఎన్నికలు

  • 2019లో నాలుగు పార్టీలకు తలా ఒక సీటు

  • అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో కాంగ్రెస్‌ విజయభేరి

  • గ్రేటర్‌లో గులాబీ గుబాళింపు

  • 4 నెలల్లోనే పట్టు కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ

  • నగరంలో బలపడాలన్న కసితో కాంగ్రెస్‌

  • మోదీ నినాదంతో కమలనాథుల దూకుడు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో హాట్‌ ఫైట్‌ కొనసాగుతోంది. సిట్టింగ్‌ స్థానాలతోపాటు ఇతర సెగ్మెంట్లను కూడా దక్కించుకుని తమ సత్తాచాటేందుకు ప్రధాన పార్టీల అగ్ర నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓటర్లు తీర్పు ఇవ్వడంతో నాయకులు కలవరపడ్డారు. అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్‌ ఓటర్ల మనోగతం ఎలా ఉంటుందో తెలియక అభ్యర్థులతోపాటు వారి పార్టీల నేతలు కూడా ఆందోళనగా ఉన్నారు. గ్రేటర్‌ ఓటర్లు నాటి తీర్పునే పునరావృతం చేస్తారా.. లేకుంటే ఏదైనా ఒక పార్టీకి మెజార్టీ సీట్లు అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లను దక్కించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరో వైపు మోదీ నినాదంతో బీజేపీ నాయకులు దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో తామే క్లీన్‌ స్వీప్‌ చేస్తామని చెబుతున్నారు. కాగా,. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎమ్మెల్యే సీట్లను బీఆర్‌ఎస్‌ గెలిచినందున లోక్‌సభ సీట్లు కూడా తమవే అనే ధీమాలో ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు.

గత ఎన్నికల్లో విలక్షణ తీర్పు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో (2018 డిసెంబర్‌ 7న జరిగాయి) అప్పటి టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే అదే సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. గ్రేటర్‌లోని నాలుగు స్థానాల్లో చేవెళ్లను మాత్రమే దక్కించుకోగా మిగతా స్థానాల్లో పట్టుకోల్పోయింది. అయితే ఇదే తరహాలో ఇతర పార్టీలు కూడా కేవలం ఒక్కో సీటుకే పరిమితం కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్‌ను బీజేపీ, మల్కాజిగిరిని కాంగ్రెస్‌, హైదరాబాద్‌ ను ఎంఐఎం గెలుచుకున్నాయి. ఎవరినీ నిరాశకు గురిచేయకుండా అన్ని పార్టీలకూ ఓటర్లు సమన్యాయం చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని ఆయా పార్టీల నాయకులు టెన్షన్‌ పడుతున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకులు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తమను ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని, నాలుగు సీట్లలో మూడింటిని తప్పకుండా గెలుచుకుంటామని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా గ్రేటర్‌లోని ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా తప్పకుండా ఎగురవేస్తామని పేర్కొంటున్నారు. కాగా, కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారని, రానున్న రోజుల్లో బీజేపీకే భవిష్యత్‌ ఉందని చెబుతూ ఆ పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లతోపాటు ఈసారి హైదరాబాద్‌ స్థానాన్ని కూడా తప్పకుండా గెలుచుకుంటామని ఢంకా బజాయిస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 24 సీట్లలో ఏకంగా 16 సీట్లను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ తాజా ఎన్నికల్లో కూడా తామే మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని సభలు, సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 04:56 PM