‘పెద్దపల్లి’లో లక్కెవరిదో?
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:46 PM
పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
విజయంపై కన్నేసిన మూడు పార్టీలు
జెండా ఎగురవేస్తామనే ధీమాలో కాంగ్రెస్
హ్యాట్రిక్‌పై కన్నేసిన బీఆర్‌ఎస్ పార్టీ
ఖాతా తెరిచేందుకు బీజేపీ ఉత్సాహం
ప్రచారంలో వేగాన్ని పెంచిన అభ్యర్థులు
త్రిముఖ పోటీతో పార్టీలు ఆగమాగం
పెద్దపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ నెలకొన్నది. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో మూడు రంగుల జెండాను ఎగురవేస్తామని ఆ పారీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందిన బీఆర్‌ఎస్ నాయకులు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు ఇక్కడ ఖాతా తెరవని బీజేపీ దేశవ్యాప్తంగా వీస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ హవాతో గెలుపొందడం ఖాయమని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గొమాసే శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈశ్వర్ ఇటీవల పెద్దపల్లిలో 36 గంటల పాటు రైతులకు అండగా నిరసన దీక్ష చేపట్టారు.
పూర్వవైభవానికి కసరత్తు
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి చివరిసారిగా 2009లో కాంగ్రెస్ నుంచి డాక్టర్ గడ్డం వివేక్ గెలుపొందగా, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా బీఆర్‌ఎస్ నుంచి బాల్క సుమన్, బొర్లకుంట వెంకటేశ్ నేత గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పూర్వ వైభవాన్ని చాటాలని ఈ రెండు పార్టీల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తుండగా, వివేక్ సోదరులు ఇరువురు చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ఇక్కడి నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందడంతో పాటు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్, ఆయన వారసుడిగా వచ్చిన వంశీకృష్ణ గెలుపునకు తండ్రి, తాత పలుకుబడి దోహదపడనున్నదని లెక్కలేస్తున్నారు. ఈ ప్రాంతానికి వాళ్లు సుపరిచితులు కావడం, కాంగ్రెస్ అధికారంలో ఉండడం వారికి కలిసి రానున్నదని భావిస్తున్నారు. పార్టీలో అసంతృప్త వాదులందరినీ తమతో కలిసి వచ్చే విధంగా బుజ్జగించారు.
హ్యాట్రిక్ కోసం బీఆర్‌ఎస్
ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత తనకు ఈసారి టికెట్ రాదని భావించి కాంగ్రె్‌సలో చేరారు. దీంతో పార్టీ సీనియర్ నేత ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి విజయ బావుటా ఎగురవేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మొదటి విడతలోనే కేసీఆర్ టికెట్ ప్రకటించారు. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక మందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరికీ సుపరిచితుడు. ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారనుండడంతో పార్టీ కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దింపింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాతినిఽథ్యం కరువయ్యింది. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చలేక పోయిందని, బీఆర్‌ఎస్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అంటున్న ఆ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమవైపే మొగ్గు చూపుతున్నారని ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థి ఈశ్వర్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రెండు భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఖాతా తెరిచేందుకు బీజేపీ ఆరాటం..
ఎలాగైనా ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాషాయ జెండాను ఎగురవేసి ఖాతా తెరవాలని ఆ పార్టీ నేతలు ఆరాట పడుతున్నారు. ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీజేపీ గట్టి పోటీనివ్వకపోగా, ఈసారి బలమైన నేతను బరిలోకి ఆ పార్టీ దింపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నేతకాని సామాజిక వర్గానికి చెందిన గొమాసే శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ రాదని భావించి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన మూడు రోజులకే ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ పోటీ చేసి 49,031 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జి వివేక్ చేతిలో శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా వర్గాలతో విస్తృతంగా తనకు ఉన్న పరిచయాలకు తోడు భారత ప్రధాని నరేంద్రమోదీ మేనియా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ హవా తనకు తోడై విజయం సాధిస్తామనే ధీమాతో గొమాసే శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. పలు బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు.