Share News

ఉండేదెవరు? వీడేదెవరు?

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:41 PM

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత గ్రేటర్‌ బీఆర్‌ఎ్‌సలో అత్యంత గందరగోళం నెలకొన్నది.

ఉండేదెవరు? వీడేదెవరు?

  • ఎన్నికల వేళ బీఆర్‌ఎ్‌సలో ‘అయ్యో’మయం

  • కాంగ్రె్‌సలోకి మరికొందరు ఎమ్మెల్యేలు

  • రోజుకోరకమైన ఊహాగానాలతో గందరగోళం

  • కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’తో అనుమానాలు

  • కారులోనే ఉంటామంటూ రాత్రికిరాత్రే జంప్‌

  • త్వరలో హస్తం గూటికి నగర మాజీ మంత్రి ?

  • కాంగ్రెస్‌ పార్టీలోనూ విభిన్న పరిస్థితి

  • అధికారికంగా ప్రకటించినా పర్యటించని దానం

  • అభ్యర్థిత్వంపై డైలమానే కారణమా ?

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత గ్రేటర్‌ బీఆర్‌ఎ్‌సలో అత్యంత గందరగోళం నెలకొన్నది. అధిష్ఠానమే మాకు ఫైనల్‌ అని మొన్నటివరకు బీరాలు పలికిన వారు నేడు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరిపోతున్నారు. అధికార కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరతీయడంతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు గులాబీ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు, చేవెళ్ల ఎంపీ రజింత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ‘కారు’లో ఎవరుంటారో ? ఎవరు దిగుతారో ? అన్న అయోమయం నెలకొన్నది.

రోజుకో పేరు తెరపైకి..

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ త్వరలో కారు దిగి కాంగ్రె్‌సలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ముందే స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు కాలేరును పార్టీలోకి తీసుకోవద్దని రాష్ట్ర నేతలను గట్టిగా డిమాండ్‌ చేశారు. ఆయన కాంగ్రె్‌సలోకి రావాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని పట్టుబడుతున్నారు. ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఓ మాజీమంత్రి కూడా త్వరలో హస్తం గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది.

బలోపేతమే కాంగ్రెస్‌ లక్ష్యం

గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 24 స్థానాలుండగా బీఆర్‌ఎస్‌-16, ఎంఐఎం-7, బీజేపీ-1 విజయం సాధించాయి. దీంతో మహానగరంలో బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరలేపింది. పార్టీ మారుతారంటూ నగరానికి చెందిన పలువురు గులాబీ శాసనసభ్యుల పేర్లూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మేం బీఆర్‌ఎ్‌సను వీడేది లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నా..ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తన పూర్వాశ్రమం కాంగ్రె్‌సలో తిరిగి చేరుతారని ప్రచారం జరుగతున్న వేళ.. నియోజకవర్గ హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా అంబర్‌పేటలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్ర నిర్వహించడం గమనార్హం. ఈ సమయంలో పార్టీ మారుతారని ప్రచారం జరగడంతో దీంతో పార్టీలో ఉంటారా ? వెళ్తారా ? అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన వేళ ఇలాంటి పరిస్థితి ప్రభావం చూపుతుందని సీనియర్‌ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రె్‌సలోనూ అదే సీన్‌

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు సంబంధించి కాంగ్రె్‌సలోనూ గందరగోళం నెలకొన్నది. అధికారికంగా దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయనను కొనసాగిస్తారా ? లేదా ? అన్న మీమాంస నెలకొన్నది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దానం నిరాసక్తత చూపుతున్నారని, ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చే అవకాశమూ లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం పాదయాత్రలు, సమావేశాలతో పర్యటిస్తున్నారు. నాగేందర్‌ మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు నారాజ్‌ అవుతున్నాయి.

Updated Date - Apr 02 , 2024 | 04:41 PM