Shocking: తవ్వకాల్లో బయటపడిన 1700 ఏళ్ల నాటి గుడ్డు.. దాని లోపల పరిశీలిస్తే బయటపడిన షాకింగ్ విషయం!
ABN , Publish Date - Feb 16 , 2024 | 06:25 PM
తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు 1700 ఏళ్ల నాటి గుడ్డును వెలికి తీశారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ గుడ్డులోని పచ్చ సొన, తెల్ల సొన ఇప్పటికీ పూర్తి సురక్షితంగా ఉన్నాయి.
గుడ్డును (Egg) ఎంత కాలం నిల్వ చేయగలం? ఎంత ఫ్రిడ్జ్‌లో ఉంచినా ఎంత కాలం అది పాడైపోకుండా ఉంటుంది? మహా అయితే కొన్ని వారాలు మాత్రమే గుడ్డు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. అయితే తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు 1700 ఏళ్ల నాటి గుడ్డును (1700 year old egg) వెలికి తీశారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ గుడ్డులోని పచ్చ సొన, తెల్ల సొన (Yolk) ఇప్పటికీ పూర్తి సురక్షితంగా ఉన్నాయి. ఈ గుడ్డును లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు తరలించనున్నారు (Viral News).
కొన్ని సంవత్సరాలుగా ఐలస్‌బరీలో తవ్వకాలు జరుపుతున్న శాస్త్రవేత్తలకు వందల ఏళ్ల నాటి నాలుగు గుడ్లు లభ్యమయ్యాయి. బయటకు తీస్తుండగా వాటిల్లో మూడు పగిలిపోయి దుర్గంధాన్ని వెదజల్లాయి. నాలుగో గుడ్డును శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా బయటకు తీశారు. నీటితో నిండిన గుంటలో రోమన్లు వాడే పాత్రలో ఈ గుడ్లు కనిపించాయి. ఈ గుడ్డును ల్యాబ్‌కు తీసుకెళ్లి మైక్రోస్కోప్ సహాయంతో పరీక్షించారు. దానిలో పచ్చ సొన, తెల్ల సొన చెక్కు చెదరకుండా ఉన్నట్టు కనిపించడంతో శాస్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
ఆక్స్‌ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడుల్స్ మాట్లాడుతూ.. వేల ఏళ్ల క్రితం వాడుకలో ఉండి తవ్వకాల్లో బయటపడిన తొలి గుడ్డు ఇదేనని ఎడ్వర్డ్ అన్నారు. ఆ గుడ్డులో పచ్చసొన, అల్బుమిన్ వంటివి కనిపించడం చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పారు. ఈ గుడ్డును లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు తరలించనున్నామని, దీనిని సంరక్షించే పద్ధతుల గురించి అక్కడి నిపుణులతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.