500 ఏళ్ళనాటి ఆధునిక భోజనం
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:36 AM
1550 నాటి కాకమాని మూర్తి కవి పాంచాలీ పరిణయంలో రాసిన ఈ పద్యం చదివితే ఆనాటి భోజనంలో అత్యాధునికతని గుర్తించగలుగుతారు. ఇంటికొచ్చిన అతిథికి వడ్డించిన భోజనం మెనూ ఇందులో ఉంది.
వడ్డనఁజూపిరంత చెలువల్
తెలియోగిరమొల్పుపప్పు మెం
డొడ్డిన కూరగాయ ఘృత ముక్కెరచక్కెర
తేనెలడ్దువాలిడ్డెన నానవాలు చలియించని
తైరులు మోరుమేరుపై
గిడ్డిదలంచిరోయనఁగ గేస్తులకబ్బె
సమస్తభాగ్యముల్’’
1550 నాటి కాకమాని మూర్తి కవి పాంచాలీ పరిణయంలో రాసిన ఈ పద్యం చదివితే ఆనాటి భోజనంలో అత్యాధునికతని గుర్తించగలుగుతారు. ఇంటికొచ్చిన అతిథికి వడ్డించిన భోజనం మెనూ ఇందులో ఉంది.
వడ్డనఁజూపిరంత చెలువల్: తినేవారికేది కావాలో గుర్తించి చిరునవ్వుతో వడ్డించేందుకు ఎదురు చూస్తారు కాబట్టి వడ్డించేవారిని నలమహారాజు పాకదర్పణంలో ‘పరివేషకులు’ అన్నాడు. ఆంగ్లేయులు ‘వెయిటర్స్’ అన్నారు. ఈ వెయిటర్లు స్మార్ట్‌గా ఉండాలి. అందుకనే మూర్తికవి వాళ్లని చెలువలు అన్నాడు. హోటల్ మేనేజిమెంటు కోర్సుల్లో వడ్డనకళ అనే ‘పరివేశనక్రమాన్ని’ నేర్పిస్తున్నారిప్పుడు.
తెలియోగిరము: శ్రీనాథుడు పల్నాడులో ‘‘జొన్నలు తప్పన్ సన్నన్నము సున్న సుమీ’’ అన్నాడు. ఆయన తరువాతి కాలం వాడైన మూర్తికవి ‘తెలియోగిరం’ అంటే తెల్లన్నాన్ని ప్రస్తావించాడు. రైసుమిల్లులు వచ్చాకే తెల్లబియ్యం (ఎక్కువ పాలిష్ పట్టిన బియ్యం) తెలిశాయని అందాకా మన పూర్వులు ఎర్రని దంపుడు బియ్యమే తినేవాళ్లనేది అపోహ అని ఈ తెల్లన్నం ప్రస్తావన చాటుతోంది.
ఒల్పుపప్పు: పొట్టు వొలిచిన పప్పు. ఆది నుండీ మనకి పెసరపప్పే అలవాటు. పితృకార్యాల్లో పెసరపప్పు తప్ప కందిపప్పు, శనగపప్పు, శనగపిండి వాడరు. వేద, ఉపనిషద్ యుగాల్లో కందులు లేవు. క్రీస్తుశకారంభంలో మన ఆహారంలోకి కందిపప్పు చేరి ఉండాలి. నవ ధాన్యాల్లో కందులు ఉన్నాయి. పెళ్లి భోజనాల్ని కందిపప్పు కారణంగానే పప్పన్నం అన్నారు. ఈ పద్యంలో వొలుపు పప్పు కందిపప్పే!
మెండొడ్డిన కూరగాయ: మెండుగా వడ్డించిన కూరగాయలతో వండిన ఇగురు కూరలు.
ఘృతము: ఘృ-వత్ అంటే, చేతిలో వేసుకొని కంచంలో అన్నం మీద చిలకరిస్తారు కాబట్టి నేతిని ఘృతం అన్నారు. ఇప్పుడు నెయ్యి అంటే విషం అని, చంటి పిల్లలక్కూడా నెయ్యి వెయ్యటానికి భయపడ్తున్నారు. శరీరశ్రమ తగ్గిన రోజులు కదా ఇవి.
ఉక్కెరచక్కెర: ఉక్కెరచక్కెర అనేది జంటపదం. ఆ రోజుల్లో ప్రజలు ఇష్టంగా తిన్న హల్వా.
తేనెలడ్డువాలు: బెల్లం, పంచదార పాకాలతో కాకుండా, తేనెతో కట్టిన లడ్డూలు. ఇప్పటి ప్రజలకు ఈ తేనెలడ్డూల భాగ్యం ఉన్నదా?
ఇడ్డెనలు: భోజనంలో ఇడ్లీలేమిటనే సందేహం కలగవచ్చు. ఉదయం, రాత్రి టిఫిన్ల పేరుతో ఇడ్డెనలు తినే అలవాటు అప్పటివాళ్ళకి లేదు. ఆంధ్రాభోజనం అంటూ చపాతీ లేదా పూరీని అన్నంతో పాటు హోటళ్ళలో వడ్డిస్తున్నారు కదా! అలాగే, అప్పట్లో ఇడ్లీ దోసె తిన్నారు.
ఆనవాలు: ఆన+పాలు-నీరంతా ఇగిరేలా కాచినపాలు. పాలని సన్నసెగన పదేపదే పొంగులొచ్చేలా మరగకాస్తేనే పాలలో ఉండే చెడ్డ బాక్టీరియా పోతుంది. ఇలా పాలు కాయటాన్ని పాశ్చురైజేషన్ అంటారు. ఈ పాశ్చురైజ్డ్ పాలే తెలుగులో ఆనవాలు!
చలియించని తైరులు: తైరు లేదా తయిరు అంటే పెరుగు. అది చలించనిదట. కదలని గట్టి పెరుగు.
మోరు: అంటే బాగా చిలికి వెన్నతీసిన మజ్జిగ
మేరుపైగిడ్డి దలంచిరోయనగ: మేరుపర్వతం అనిపించే పైగిడ్డి అంటే ఎద్దపెద్ద బంగారపు గంగాళాల్లో ఈ వంటకాలున్నాయిట!
గేస్తులకబ్బె సమస్త భాగ్యముల్: గేస్తు లంటే గృహస్థులు. అతిథిని దేవుడిగా భావించే భాగ్యం అబ్బిన గేస్తులు ఆతిథ్యం ఇచ్చారట.
భాగ్యం అనేది పెద్దపెద్ద బంగారు గంగా ళాల్లో లేదు. వాటిలో ఉన్న వంటకాల్లో ఉంది. ఆహారం సర్వ పోషకంగానూ, కాలమాన పరిస్థితులకు తగినదిగానూ ఉండాలి.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642