Share News

90 లక్షల ఇళ్లు ఖాళీ..

ABN , Publish Date - Dec 01 , 2024 | 10:39 AM

అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌ను గుర్తిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల తాకిడిని తట్టుకుని, టెక్నాలజీలో ప్రపంచానికే సవాల్‌ విసిరింది. అలాంటి దేశంలో ప్రస్తుతం అబాండెడ్‌ హౌస్‌లు (వదిలేసిన ఇళ్లు) 90 లక్షలున్నాయి.

90 లక్షల ఇళ్లు ఖాళీ..

అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌ను గుర్తిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల తాకిడిని తట్టుకుని, టెక్నాలజీలో ప్రపంచానికే సవాల్‌ విసిరింది. అలాంటి దేశంలో ప్రస్తుతం అబాండెడ్‌ హౌస్‌లు (వదిలేసిన ఇళ్లు) 90 లక్షలున్నాయి.

తూర్పు ఆసియా దేశాల్లో జనాభాలేమి కారణంగా వదిలేసిన ఇళ్లతో ఇబ్బందిపడుతోంది జపాన్‌. వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారక్కడ. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనపడుతోంది. టోక్యో, క్యోటో నగరాలకు దగ్గరగా ఉండే పల్లెల్లో ‘అకియా’ సమస్య వెంటాడుతోంది. ‘ఇక్కడ ఇళ్లు ఎక్కువగా ఉండటం కాదు సమస్య. అసలు అందులో నివసించటానికి జనాలు లేకపోవటమే అతి పెద్ద సమస్య’ అంటున్నారు చారిత్రక పరిశోధకులు. అధికారిక లెక్కల ప్రకారం అలా ఇళ్లను వదిలేసిపోయిన వారి సంఖ్య 14 శాతం ఉంది.


భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తుల దృష్ట్యా జనాలు వీటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో మనకంటే ఎంతో ముందుండే జపాన్‌లో వృద్ధుల సంఖ్య కూడా అధికం. అదిగాక వారి జీవనకాలమూ ఎక్కువే. కెరీర్‌లో పడి పిల్లలను కనకపోవటం వల్ల సదరు ఇంటివాళ్లు చనిపోతే ఆ ఇల్లు అనాథే. పిల్లలు ఇతర నగరాలకు, దేశాలకు వెళ్లిపోవటం వల్ల కూడా ఈ సమస్య ఉంది. ఇకపోతే జపాన్‌లో పన్నుల భారం వల్ల పాత ఇంటిని పునరుద్ధరించటం కన్నా కొత్త ఇల్లు కట్టుకోవటమే మేలు అనుకుంటారు. అందుకే కొన్ని ఇళ్లకు యజమానులు ఎవరో కూడా తెలియదట.


book8.jpg

అంటే ప్రభుత్వం యజమానుల వివరాలను రికార్డు చేయలేదు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టుకు ఆ ఇళ్లు దూరంగా ఉండటం లాంటి కారణాల వల్ల జపాన్‌ పల్లెల్లో గత ఇరవై ఏళ్ల నుంచి ఇలాంటి ఇళ్ల సంఖ్య పెరిగిపోయింది.

ఇప్పటిదాకా సుమారు 30 లక్షల మంది విదేశీయులు జపాన్‌లోని ఈ పల్లెలను సందర్శించారట. ప్రస్తుతం ఇదోరకం టూరిజంలా మారింది. వాస్తవానికి ఇక్కడ ఇల్లు కొంటే తర్వాత అమ్మటం కష్టం. అందువల్లే ఈ సమస్య అంటున్నారు స్థానిక బిల్డర్లు. హషిమా ఐల్యాండ్‌, టోక్యోకు దగ్గరగా ఉండే కిజోజీ, నారా డ్రీమ్‌ ల్యాండ్‌, ర్యాబిట్‌ ఐల్యాండ్‌, కవాగుచి సిటీ.. లాంటి ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.


ఇతర దేశాల్లోనూ..

బతుకుదెరువు కోసం పల్లెల నుంచి నగరాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. అత్యధిక జనాభా ఉండే మనదేశంలో ఇలాంటి స్థితి లేదు. జనసంఖ్య తక్కువ ఉండే దేశాల్లో వదిలేసిన ఇళ్లున్నాయి. అమెరికాలోని మిస్సోరి, మిచిగాన్‌, ఇండియానా, దక్షిణ డకోటా, డెట్రాయిట్‌, చికాగో, పెన్సిలేన్వియా లాంటి నగర శివార్లలో ఈ సమస్య ఉంది. వలసలు, పన్నుల వల్ల ఇటలీలోనూ అబాండెడ్‌ హౌస్‌లు పెరిగిపోతున్నాయి. సోవియట్‌ యూనియన్‌ విడిపోయాక రష్యాలో ఈ సమస్య ఉత్పన్నమైంది. తూర్పు జర్మనీలో అయితే అపార్ట్‌మెంట్స్‌లో కూడా నివసించేవాళ్లు లేరు. స్పెయిన్‌, కెనడా, ఫ్రాన్స్‌, చైనా దేశాల్లో కూడా నగరీకరణ పెరగటం వల్ల రిమోట్‌ ఏరియాల్లో నానాటికీ ఖాళీ ఇళ్ల సంఖ్య పెరిగిపోతోంది.

Updated Date - Dec 01 , 2024 | 10:39 AM