సువాసనల రాజభోగం
ABN , Publish Date - Aug 18 , 2024 | 10:04 AM
కుక్కల పెంపకం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వాటి తిండి, సొగసు కోసం వేలల్లోనే కాదు... లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా మార్కెట్ పుట్టుకొచ్చింది. ఆహారపదార్థాలే కాకుండా, షాంపులు, సోపులు, చైన్‌లు, ఆడుకునే వస్తువులు... వీటికి లెక్కే లేదు.
కుక్కల పెంపకం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వాటి తిండి, సొగసు కోసం వేలల్లోనే కాదు... లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా మార్కెట్ పుట్టుకొచ్చింది. ఆహారపదార్థాలే కాకుండా, షాంపులు, సోపులు, చైన్‌లు, ఆడుకునే వస్తువులు... వీటికి లెక్కే లేదు. పెంపుడు కుక్కల సొగసులో భాగంగా ఖరీదైన షాంపూలతో కుక్కలను స్నానం చేయించే వారిని చూసే ఉంటారు. వాటి పాదాల సంరక్షణ కోసం పెడిక్యూర్ చేయించడమూ తెలుసు. ఇక ముందు కుక్కలకు కూడా సువాసనలు వెదజల్లే పెర్‌ఫ్యూమ్ కొట్టి వాకింగ్ తీసుకెళ్లడాన్ని చూడనున్నాం.
ఎందుకంటే ఇటలీకి చెందిన ఒక కంపెనీ కుక్కల కోసం ప్రత్యేకంగా ఒక పెర్‌ఫ్యూమ్‌ను తయారుచేసింది. ఇటాలియన్ ఫ్యాషన్ లేబుల్ ‘డాల్సీ అండ్ గబ్బానా’ అనే సంస్థ ‘ఫెఫె’ పేరుతో ఈ పెర్‌ఫ్యూమ్‌ను విడుదల చేసింది. మధ్యతరగతి వాళ్లు ఐదు వందలు పెట్టి పెర్‌ఫ్యూమ్ కొనాలంటేనే పదిసార్లు ఆలోచిస్తారు. కానీ విలాసవంతమైన ఇళ్లలో ఖరీదైన శునకాలకు రాజభోగాలు దక్కుతుంటాయి. డాగ్ గ్రూమింగ్ కోసం స్పా సెంటర్లకు తీసుకెళ్లి... పెడిక్యూర్, బాడీ మసాజ్ చేయిస్తుంటారు.
ఇప్పుడిక పెర్‌ఫ్యూమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆకుపచ్చ రంగు సీసాలో 100 ఎంఎల్ పరిమాణంలో ఈ పెర్‌ఫ్యూమ్ అందుబాటులోకి తెచ్చారు. దీని ధర సుమారు రూ. 9వేలకు పైనే ఉంది. గంధపు చెక్కల సువాసన వెదజల్లే ఈ పెర్‌ఫ్యూమ్‌ని స్ర్పే చేయడం ద్వారా కుక్కలు యజమానితో మరింత ప్రేమగా వ్యవహరిస్తాయని, ఉల్లాసంగా ఉంటాయని తయారీదారులు అంటున్నారు. అయితే కుక్కలకు పెర్‌ఫ్యూమ్‌పై వెటర్నరీ డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.