Share News

ఆమూలాగ్రం ఆహార ఔషధం

ABN , Publish Date - Sep 29 , 2024 | 09:49 AM

నేతిలో వేగించిన బూడిదగుమ్మడి ముక్కలు, ముల్లంగి ముక్కలు, కీరదోస ముక్కల్ని జ్యూసు తీసుకుని రోజూ రెండు పూటలా తాగుతుంటే సమస్తమైన అనారోగ్యాలనూ తట్టుకునే శక్తి కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి.

ఆమూలాగ్రం ఆహార ఔషధం

‘‘ఘృతభృష్టాని కూష్మాణ్ణమూలకైర్వారుకా....’’

నేతిలో వేగించిన బూడిదగుమ్మడి ముక్కలు, ముల్లంగి ముక్కలు, కీరదోస ముక్కల్ని జ్యూసు తీసుకుని రోజూ రెండు పూటలా తాగుతుంటే సమస్తమైన అనారోగ్యాలనూ తట్టుకునే శక్తి కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఈ మూడింటిలో మూలకం అనే ముల్లంగి (గెనుసుగడ్డ) మనకు క్యారెట్‌, ఆలూ దుంపల్లాగా విదేశీ కాదు. ప్రాచీనకాలం నుంచి ఆహార ద్రవ్యంగా ఉపయోగపడింది.


ముల్లంగి అనగానే షుగరువ్యాధి, స్థూల కాయం, బొల్లి, మూత్రాశయ వ్యాధులు, జన నాంగ వ్యాధులకు ఉత్తమ ఔషధం అనే సంగతి గుర్తు రావాలి. చేదుగా కారంగా ఘాటుగా ఉంటుంది. క్షారస్వభావం వలన ఎసిడిటీని తగ్గిస్తుంది. అన్నహితవు కలిగిస్తుంది. మానసిక శక్తిని పెంచుతుంది. మెదడుకు బలాన్నిస్తుంది. అరికాళ్ళ మంటల్ని, మూత్రంలో మంటనీ తగ్గిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. కడుపునొప్పి తగ్గిస్తుంది. విషదోషాల్నీ, రేచీకటిని, దద్దుర్లు, దురదల్నీ, ఉబ్బసాన్నీ నివారిస్తుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. మొలలవ్యాధిలో రక్తస్రావాన్ని ఆపుతుంది. ముల్లంగి ముక్కల్ని నానవేసిన నీటిని మంచినీళ్ల కోసం వాడుకోవటం ఓ మంచి అలవాటు.


ముల్లంగి మొక్క తన అవసరాలు పోను మిగిలిన ఆహారాన్నంతా తల్లివేరులో దాచుకోవటంతో ఈ వేరు క్రమేణా ఉబ్బి దుంపలా అవుతుంది. అందుకనే ముల్లంగి దుంపతో సమానమైన గుణాలు దాని ఆకులకూ ఉంటాయి. లేత ఆకులు దొరికితే కూర, పప్పు, పులుసుకూర, పచ్చడి వండుకోవచ్చు.

- ఇగురు కూర: తాలింపు గింజలు నూనెలో వేగించి, ఉడికించిన ముల్లంగి ముక్కల్ని అందులో కలిపి కూరకారంతో కొద్దిసేపు వేగనిచ్చిన ఇగురుకూర కమ్మగా ఉంటుంది. వేడిని తగ్గించి శక్తినిస్తుంది.


- ముల్లంగి వేపుడు కూర: సన్నని ముక్కలుగా తరిగి ‘ఆలూ ఫ్రై’ పద్ధతిలో ముల్లంగి వేపుడు కూర చేస్తుంటారు.

- ముల్లంగి పప్పు: ముల్లంగిని సన్నగా తురిమి పెసరపప్పుతో ఉడికించి పప్పు వండుకుంటారు.

- ముల్లంగి పులుసుకూర: తాలింపు గింజలు నూనెలో వేగించి, ముల్లంగి, ఉల్లి ముక్కల్ని, కొద్దిగా చింతపండు రసాన్ని కలిపి మగ్గనిచ్చి పులుసుకూర వండుకుంటారు.


- ముల్లంగి ముక్కల పులుసు: ముల్లంగి ముక్కలతో పాటు ఇతర కూరగాయల ముక్కల్ని కలిపి చిక్కగా కాచిన పులుసుని దప్పళం లేదా ముక్కల పులుసు అంటారు. చారు, పులుసు, సాంబారుల్లో ముల్లంగి ముక్కలు అదనపు రుచినిస్తాయి.

- ముల్లంగి రోటిపచ్చడి: ఉడికించిన ముల్లంగి ముక్కల్ని మెత్తగా గుజ్జులా చేసి తాలింపు పెట్టిన రోటి పచ్చడి కమ్మగా ఉంటుంది.

- ముల్లంగి ఊరుగాయ: ఉప్పులో ఊరవేసి దోసావకాయ పద్ధతిలో గానీ, మాగాయ పద్ధతిలో గానీ ఊరుగాయ పచ్చడి చేస్తారు.


- ముల్లంగి పెరుగు పచ్చడి: ముల్లంగి తురుము, క్యారెట్‌ తురుము, బూడిద గుమ్మడి తురుము వీటిలో పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగుపచ్చడి కమ్మగా ఉంటుంది. చపాతీల్లో నంజుకోవటానికి బావుంటుంది. అమిత శక్తిదాయకం.

- గుజ్జు కూర: ముల్లంగి ఆకుల్ని, ముక్కల్ని, ఉల్లి, టమాటాల్ని మెత్తగా ఉడికించి చిక్కటి రసం తీసుకుని ఇతర సుగంధ ద్రవ్యాల్ని కలిపి గుజ్జులా అయ్యేలా ఉడికించి తాలింపు పెట్టి ‘పాలక్‌ పాలక్‌’ పద్ధతిలో చేసుకుంటే రోటీల్లోకి నంజుడుగా బావుంటుంది.


- వరుగులు: ముల్లంగి ముక్కల్ని ఉప్పులో ఊరవేసి ఎండించిన వరుగుల్ని నీళ్లలో నానించి కూర, పచ్చడి చేసుకుంటారు.

తమిళులు పొరియల్‌, అవియల్‌, కడైయల్‌, మాసియల్‌, తువైయల్‌, వరువల్‌, వత్తక్కల్‌, వత్రాల్‌ ఇలా అనేక రకాలుగా కూరల్ని వండుకుంటారు. ఇవి మనకూ ఉన్నాయి. వాటికి తెలుగు పేర్లు వెదకాలి. ముల్లంగి మహత్తు తెలిసిన కొందరే దీన్ని తింటున్నారు. ఆమూలాగ్రం ఆహార యోగ్యమే ముల్లంగి. ఉష్ణమండలంలో ఉంటూ కాయకష్టం చేసుకునే మనల్ని వేడికీ కష్టానికీ తట్టుకునేలా చేస్తుంది. కందమూలాలు తిని జీవించిన ఒకప్పటి రుషులు ప్రధానంగా తిన్నది ముల్లంగినే!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Sep 29 , 2024 | 09:49 AM