Ganesh Chathurthi: 20 కిలోల బంగారు కిరీటాన్ని అందజేసిన అనంత్ అంబానీ
ABN , Publish Date - Sep 07 , 2024 | 02:03 PM
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్యలు తొలిపూజ అందుకుంటున్నారు. అందరూ విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్యలు తొలిపూజ అందుకుంటున్నారు. అందరూ విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఏటికేడు గణేశ్ ఉత్సవాల జోష్ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణేశ్ చుతుర్థి ఉత్సవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముంబయిలోనూ గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని 69 కిలోల బంగారు నగలతో అలంకరించారు. దీంతోపాటు విగ్రహానికి రూ.400 కోట్ల బీమా కూడా చేయించిన విషయం విదితమే. ఇక.. ముంబయిలోనే ఉన్న లాల్‌బాగ్ రాజు విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. లాల్‌బాగ్ రాజు వినాయకుడు ఏటా విశేష పూజలు అందుకుంటాడు.
అయితే ప్రతీసారిలాగే ఈసారి కూడా అంబానీ కుటుంబం విఘ్నేశ్వరుడికి భారీ విరాళం ఇచ్చింది. లాల్‌బాగ్ రాజు వినాయకుడిని దర్శించుకునేందుకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీవీఐపీలు తరలి వస్తుంటారు. అందులో ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి. ఈసారి వినాయక చవితి అంబానీ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది.
ఎందుకంటే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం జరిగిన తరువాత తొలి గణేశుడి ఉత్సవం కావడంతో లాల్‌బాగ్ గణపతికి అనంత్ అంబానీ భారీ విరాళం ప్రకటించారు. అనంత్ తరఫున 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. ఈ కిరీటం ధర రూ.15 కోట్లు. దీన్ని తయారు చేయడానికి 2 నెలలు పట్టిందని అనంత్ సిబ్బంది తెలిపారు. ఇలా అంబానీ కుటుంబం తమ భక్తిని చాటింది.
For Latest News click here