ఎంతైనా.. అది చైనా..
ABN , Publish Date - Nov 03 , 2024 | 09:36 AM
అని ఎప్పుడో, ఎక్కడో చదివినట్లు గుర్తు! ఉన్న విస్తీర్ణం చాలదంటూ పొరుగునున్న దేశాల్లో కాలూ వేలూ పెట్టడం చైనా నైజం. అంతటి చైనా ఎలా ఉంటుంది? చరిత్రలో చదివిన ‘గ్రేట్ వాల్’పై కాలు పెట్టి, కళ్లతో చూస్తే వచ్చే అనుభూతి... సోషల్ మీడియాలో కవ్వించే చాంచింగ్ సిటీ మెరుపు కలల మర్మమేమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే చైనా వెళ్లాల్సిందే!
చిన్ని కళ్ల వాడు గిల్లి కజ్జాల వాడు... నవ్వడం తెలియని వాడు ఆ చైనా వాడు!
అని ఎప్పుడో, ఎక్కడో చదివినట్లు గుర్తు! ఉన్న విస్తీర్ణం చాలదంటూ పొరుగునున్న దేశాల్లో కాలూ వేలూ పెట్టడం చైనా నైజం. అంతటి చైనా ఎలా ఉంటుంది? చరిత్రలో చదివిన ‘గ్రేట్ వాల్’పై కాలు పెట్టి, కళ్లతో చూస్తే వచ్చే అనుభూతి... సోషల్ మీడియాలో కవ్వించే చాంచింగ్ సిటీ మెరుపు కలల మర్మమేమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే చైనా వెళ్లాల్సిందే! రానుపోను ప్రయాణాలతో కలిపి 16 రోజుల ప్రణాళిక! ముగ్గురు మిత్రులం... నేనూ, నాగేంద్ర సాయి, విష్ణువర్ధన్ బయలుదేరాం. హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా బీజింగ్‌లో వాలిపోయాం. ఇది చైనా రాజధాని. ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రహదారులు... ఊహించినవే! కానీ... మౌనంగా ప్రవహించే నదిలా ట్రాఫిక్, ఎక్కడా రద్దీలేకుండా నెలకొన్న ప్రశాంతతే ఆశ్చర్యపరిచింది.
మరుసటి రోజు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శన! ఇది 21 వేల కిలోమీటర్ల నిర్మాణం! మంగోలియన్ల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు దశాబ్దాల కొద్దీ ఈ నిర్మాణాన్ని కొనసాగించారు. రద్దీ తక్కువగా, చూడటానికి అందంగా ఉండే ముతియాన్యు సెక్షన్‌ను మేం ఎంచుకున్నాం. బీజింగ్ నుంచి గంటన్నర ప్రయాణం! బస్సులో ఉన్నంతసేపూ గైడ్ చైనా వాల్ విశేషాలను చెబుతూనే ఉంది. అల్లంత ఎత్తున ఉండే చైనా వాల్ దగ్గరికి కేబుల్ కార్‌లో చేరుకున్నాం. ఈ భూమ్మీదే అతి పెద్ద కుఢ్యంపై కాలు పెట్టగానే కలిగిన అనుభూతి వింతగా అనిపించింది.
గ
రిష్ఠంగా 15 మీటర్ల దాకా వెడల్పు, 30 మీటర్ల ఎత్తు, వేల కిలోమీటర్ల నిడివి, ప్రతి వందా రెండొందల మీటర్లకు చైనీస్ నిర్మాణ శైలిలో అందమైన బురుజులు, కొండలపై వంపులు తిరిగిన మహా కుఢ్యం కళ్లనిండుగా కనిపిస్తుంది. ఇది అసమాన్య నిర్మాణం! అందుకే.. ప్రపంచం వింతల్లో ఒకటైంది. మళ్లీ బీజింగ్‌కు వెనుదిరిగాం. ఈ నగరం పేరు చెప్పగానే స్ఫురించే పేరు.. తియానన్మెన్ స్క్వేర్! వందలమంది బలిదానానికి అది ప్రతీక. ఉద్యమాలపై చైనా మార్కు ఉక్కుపాదానికి సాక్షీభూతం. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులీనుతోంది! ఘనమైన చరిత్ర... ఘనమైన నిర్మాణాలు..
బీజింగ్‌లో తప్పక చూడాల్సిన స్థలాలు... టెంపుల్ ఆఫ్ హెవెన్, ఫర్బిడన్ సిటీ, సమ్మర్ ప్యాలెస్! మేం బస చేసిన హోటల్ దగ్గరే ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’! ఎటు చూసినా క్వింగ్, మింగ్ వంశ నామాలే! మంచి వర్షాలు కురవాలని, చక్కటి పంటలు పండాలని రాజు ప్రార్థనలు చేసే మందిరమే ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’! ఇది దాదాపు 500 ఎకరాల్లో విస్తరించిన ఆలయ సముదాయం! 1420లో నిర్మించారు. ప్రధాన ఆలయం వలయాకార పగోడా నిర్మాణ శైలిలో నింగినంటుతోం దన్నంత ఎత్తుగా ఉంది. అందమైన వసారా గుండా నడుచుకుంటూ ఈ మందిరాన్ని చేరుకోవచ్చు.
లోపల దేవుడి విగ్రహాలేవీ లేవు. అక్కడి నుంచి ‘ఫర్బిడన్ సిటీ’కి వెళ్లాం. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా... దీనిదీ ఘనమైన చరిత్ర, ఘనమైన నిర్మాణమే! బీజింగ్ నగర నడిబొడ్డున ఉందీ ప్రదేశం. 1400 శతాబ్దం నుంచి 500 సంవత్సరాలపాటు ఇది చైనా పాలకుల ‘రాజధాని’! చుట్టూ నీటితో నిండిన కందకాలు, భారీ ప్రహరీ మధ్యలో.. ఉద్యానవనాలు, మందిరాలతో ఈ నగరం నిర్మితమైంది. సామాన్యుల సంగతి పక్కనపెడితే.. కొన్ని మందిరాలలోకి రాణులు, మంత్రులకే ప్రవేశం లేదట! ఇలా నిషేధ ప్రాంతాలతో నిండిన నగరం కాబట్టే ‘ఫర్బిడన్ సిటీ’ అనే పేరు వచ్చింది.
‘బుల్లెట్ స్పీడు’తో సియాన్‌కు...
చైనాలో మా తదుపరి మజిలీ... సియాన్! బీజింగ్ నుంచి 1100 కిలోమీటర్లు! మరెక్కడైనా అయితే.. డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాల్సిందే! కానీ.. అది చైనా! అక్కడ బుల్లెట్ ట్రైన్ ఉంది. వీటిని స్పీడ్ ట్రైన్స్ అంటారు. ఉదయం 7 గంటలకు బీజింగ్ వెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరింది. టైమ్ అంటే టైమే! క్షణం కూడా ఆలస్యం కాలేదు. రైలు బయలుదేరింది. గంటకు 351 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అదే గరిష్ఠం! కుదుపుల్లేవు... దడదడా శబ్దాలు లేవు. ఇనుప పట్టాలపై చప్పుడు లేకుండా దూసుకెళుతోంది. సరిగ్గా నాలుగున్నర గంటల్లో.. సియాన్ వచ్చేసింది. సియాన్ కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్న నగరమే! చైనా వాల్‌లాగానే.. ‘సియాన్ వాల్’ చాలా ఫేమస్! 15-17 శతాబ్దం మధ్య 14 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైనదీ భారీ ప్రహరీ. గోడంటే గోడ కాదు! రెండు కార్లు పక్క పక్కనే పోయేంత వెడల్పున్న గోడ! దీని మధ్య.. ఇప్పుడు ఆధునిక నిర్మాణాలు వెలిశాయి. బీజింగ్‌లో మాకు కనిపించని ‘సిటీ లైఫ్’ సందడి సియాన్‌లో కనిపించింది. చౌరస్తాలో ఠీవిగా నిలిచి జిగేల్ మంటున్న ‘బెల్ టవర్’, ఆ పక్కనే ‘డ్రమ్ టవర్’, కాంతులు చిమ్ముతున్న భవనాలు కళ్లు మిరిమిట్లు గొలిపాయి.
యుద్ధానికి సిద్ధం టెర్రకోట సైన్యం
అనగనగా ఒక రాజు! ఆయనకు పునర్జన్మల మీద బలమైన నమ్మకం. ‘నేను మళ్లీ పుట్టాక.. నా రక్షణకు సైన్యం కావాలి కదా! నాతోపాటు వాళ్లూ మళ్లీ జన్మించాలి కదా!’ అనే ఆలోచన నుంచే ‘టెర్ర కోట వారియర్స్’ పుట్టుకొచ్చారు. సియాన్ నుంచి గంట ప్రయాణ దూరంలో ఈ మ్యూజియం ఉంది. దీనికి 2250 సంవత్సరాల చరిత్ర! చైనా తొలి పాలకుడు టెర్రకోట సైన్యాన్ని సృష్టించాడు. ఇదేదో బొమ్మల కొలువులాంటిది కాదు! అచ్చంగా.. మనిషంత ఎత్తైన టెర్రకోట బొమ్మలు! అప్పట్లో నిజమైన సైనికులు, వారి దుస్తులు, వాడిన ఆయుధాలను యథాతథంగా బొమ్మల రూపంలో తయారు చేశారు. 1974లో ఒక రైతు బావి తవ్వుతుండగా ఒక టెర్రకోట బొమ్మ బయటపడింది. చారిత్రక పరిశోధకులు రంగంలోకి దిగారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికి.. 8 వేల సైనికుల బొమ్మలు బయటపడ్డాయి. అశ్వాలు పూనిన రథాలూ దొరికాయి. 40 వేల నిజమైన ఆయుధాలూ బయటపడ్డాయి. ఈ తవ్వకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
చిత్ర విచిత్ర నగరి... చాంచింగ్
అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లే మెట్రో రైలు, ఒకవైపు లిఫ్టు ఎక్కి 22వ అంతస్తుకు వచ్చి.. మరోవైపు పది మెట్లు దిగగానే రోడ్డెక్కే చిత్రమైన భవనం, ఆధునిక నిర్మాణ కౌశలానికి అద్దంపట్టే రఫెల్ సిటీ, చారిత్రక అందాలకు ఆనవాళ్లుగా హోంగ్యా నిర్మాణ సముదాయం, యాంగ్జీ నది అవతల నిలువెల్లా స్ర్కీన్లతో వెలుగులు చిమ్మే ఆకాశ హర్మ్యాలు.. ఒకటా రెండా! ఎన్నెన్నో విచిత్రాలున్న నగరం చాంచింగ్! విస్తీర్ణంలో ఆస్ట్రియాకంటే పెద్దదైన మునిసిపాలిటీ ఇది! చాంచింగ్ జనాభా 3 కోట్లకుపైగానే! ఎటుచూస్తే అటు బహుళ అంతస్తుల భవనాలే! ‘చైనా అంటే ఉక్కు సంకెళ్లు, నిర్బంధపు తెరలు’ అనే అభిప్రాయాలు చాంచింగ్‌లో ముక్కలై పోతాయి. నైట్ క్లబ్బులు, డ్యాన్సు పబ్బులు, లైవ్ మ్యూజిక్‌తో హోరెత్తే బార్లు, ఫుట్‌పాత్‌పై ఈట్‌ఔట్స్.. ఇక్కడ అన్నీ ఉన్నాయి!
భూమి వేగానికి చైనా పగ్గం
చైనా వాడంతే! ఏం చేసినా.. రికార్డుల్లోకి ఎక్కాల్సిందే! త్రీగార్జెస్ డ్యామ్ కూడా అలాంటిదే! ప్రపంచం ఏమన్నా, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ బాదుకున్నా చైనా పట్టించుకోలేదు. యాంగ్జీ నదిపై ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీగార్జెస్ డ్యామ్‌ను నిర్మించింది. భూమి వేగాన్ని 0.06 మైక్రో సెకన్లు తగ్గించిన డ్యామ్ ఇది! 22,500 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి, సరుకు రవాణా, పంట పొలాలకు, పరిశ్రమలకు నీళ్లు... అన్నింటినీ మించి యాంగ్జీ వరదల విధ్వంసానికి శాశ్వత పరిష్కారం. దశాబ్దాల ప్రణాళిక.. 17 ఏళ్లపాటు సాగిన నిర్మాణం.. చివరికి 2000 సంవత్సరంలో త్రీగార్జెస్ డ్యామ్ పూర్తయింది. చాంచింగ్ నుంచి ‘ఈచాంగ్’కు స్పీడ్ ట్రైన్‌లో.. అక్కడి నుంచి క్యాబ్‌లో త్రీగార్జెస్ చేరుకున్నాం. పక్కనే ఉన్న కొండపైకి ఎక్కి మొత్తం డ్యామ్ సైట్ చూడొచ్చు. డ్యామ్ నిర్మాణ విశేషాలను తెలిపేలా అక్కడ భారీ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.
జాంగ్జియాజీలో ప్రకృతి పరవశం
త్రీగార్జెస్ నుంచి ఉలింగ్యాన్‌కు కారులో 4-5 గంటల ప్రయాణం! హైవేపై సాఫీగా సాగిపోయింది. ఉలింగ్యాన్ చేరగానే.. హోటల్ రూమ్‌లో లగేజీ పెట్టేసి, ‘అవతార్ మౌంటెన్స్’కు బయల్దేరాం! ఆకాశంలోకి వెళ్తున్నామా అన్నట్లుగా కేబుల్ కార్‌లో మా ప్రయాణం సాగింది. పైకి వెళ్లాక.. అనేక వ్యూ పాయింట్స్! వాటి ఆకారాలు, అవతరాలను బట్టి రకరకాల పేర్లు పెట్టారు. ఉదయం మొదలుకుని సాయంత్రం దాకా చూసినా తరగనన్ని చిత్రాలు! మొత్తం చైనా ట్రిప్‌లో మేం ఎక్కువ రోజులు బస చేసింది ఇక్కడే! రెండో రోజు ‘తియాన్మెన్ మౌంటెన్ కేవ్ ఓపెనింగ్’కు వెళ్లాం. మరో రకంగా చెప్పాలంటే.. ‘స్వర్గానికి రహదారి’! ఇది.. జాంగ్జియాజీ సిటీలో ఉంటుంది. అల్లంత ఎత్తుకు కేబుల్ కార్‌పై వెళ్లి.. అక్కడి నుంచి 999 మెట్లు ఎక్కితే ఈ బిలం కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే సూది బెజ్జంలా కనిపిస్తుంది. కానీ.. ఈ సొరంగం ఎత్తు 350 మీటర్లకు పైనే! ఇదో భౌగోళిక అద్భుతం. దశలవారీగా ఏర్పాటు చేసిన ఏడు భారీ ఎస్కలేటర్లతో ఈ పర్వతాగ్రం చేరుకోవచ్చు.
గ్రేట్ కాన్యన్‌లో ‘సాహసం చేయరా’...
అవతార్ మౌంటెన్స్, తియాన్మెన్ కేవ్ ఓపెనింగ్ రెండూ వేటికవే ప్రత్యేకం. మూడోది.. చైనా గ్రేట్ కాన్యన్. ఇది మరింత ప్రత్యేకం. మరీ ముఖ్యంగా.. సాహసాన్ని శ్వాసించే వాళ్లకు ప్రత్యేక స్వాగతం. ఉలింగ్యాన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ ‘మహా లోయ. రెండు కొండల అంచులను కలుపుతూ 430 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. అద్దాల పలకపై నడుస్తూ.. కిందికి చూస్తే హమ్మో అనిపించేంత లోయ. ఇదేముంది.. అసలైన మజా క్లిఫ్ వాక్‌లోనే కనిపిస్తుంది. కొండ అంచున ఏర్పాటు చేసిన ‘కాలి బాట’ ఇది! అడుగు వెడల్పున్న ఇనుప పలకపై అలా నడుస్తూ వెళ్లాలి. ఒక్కో చోట ఇనుప కమ్మీ మీద... ఇంకో చోట ఇనుప తీగపైనా.. మరో చోట ఇనుప రింగులు దిగుతూ వెళ్లాలి. నడుస్తుంటే కాళ్లు వణుకుతాయి. కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి! ఇదో సిసలైన సాహసం.
హాయ్ షాంఘై...
షాంఘై.. ఇది ఘన చైనా వాణిజ్య రాజధాని! చైనా పర్యటనలో మా చివరి మజిలీ! జాంగ్జియాజీ నుంచి ఊహాన్(ఎస్.. అదే, కరోనా పుట్టినిల్లు)కు రైలులో వెళ్లాం. అక్కడి నుంచి స్పీడ్ (బుల్లెట్) ట్రెయిన్‌లో షాంఘై చేరుకున్నాం. ఇదో మహా నగరం. హువాంగ్‌పు నదికి అటూ ఇటూ విస్తరించింది. నదికి అటువైపు వెళ్లేందుకు హువాంగ్‌పు జల గర్భంలోనే టన్నెల్ .. అందులో ‘కార్’ ప్రయాణం. అటు చేరుకోగానే మనసును కట్టిపడేసే ఓరియంటల్ పెర్ల్ టవర్ అందం. చిత్ర విచిత్రమైన శైలిలో నిర్మించిన మరెన్నో భవనాలు! పీపుల్స్ స్క్వేర్‌లోని పెడస్ట్రియన్ స్ట్రీట్‌లో సందడి అచ్చం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌ను గుర్తుకు తెస్తుంది.
షాంఘైలో మరో దర్శనీయ ప్రదేశం.. జేడ్ బుద్ధా టెంపుల్! అక్కడికీ వెళ్లాం. చైనాలో మాకు మరెక్కడా కనిపించని భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ కనిపించింది. ప్రపంచ స్థాయి పారిశ్రామిక ప్రదర్శనల(ఎక్స్‌పో)కు షాంఘై పెట్టింది పేరు. చైనా సువిశాల దేశం. ఎన్నెనో నగరాలు, వందల్లో పర్యాటక ప్రాంతాలు. అన్నీ చూడాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఎంతైనా అది చైనా కదా! వైవిధ్యం దాని సొంతం. అందుకే.. నగర జీవనం, గ్రామీణ ప్రాంతం, ప్రకృతి సోయగం, పారిశ్రామిక వికాసం.. ఇలా అన్నీ కలిసొచ్చేలా ఎంపిక చేసుకుని కొన్ని ప్రాంతాల్లో, ప్రధాన ఆకర్షణలు మాత్రం చూశాం.
- తొమ్మండ్రు సురేశ్ కుమార్