ఆశ్చర్యాల ఆరోవిల్
ABN , Publish Date - Sep 29 , 2024 | 07:53 AM
కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా, ప్రకృతి ఒడిలో... కులమతాలకు అతీతంగా... అందరూ ఒకచోట చేరితే... ‘ఆరోవిల్’ జీవన విధానం అచ్చంగా అదే. ఇక్కడ జాతి, లింగ వివక్ష లేనేలేదు. అంతకు మించి డబ్బుకు ప్రాధాన్యం శూన్యం. ఈ అద్భుత టౌన్‌షిప్ ఉన్నది ఎక్కడో కాదు...
కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా, ప్రకృతి ఒడిలో... కులమతాలకు అతీతంగా... అందరూ ఒకచోట చేరితే... ‘ఆరోవిల్’ జీవన విధానం అచ్చంగా అదే. ఇక్కడ జాతి, లింగ వివక్ష లేనేలేదు. అంతకు మించి డబ్బుకు ప్రాధాన్యం శూన్యం. ఈ అద్భుత టౌన్‌షిప్ ఉన్నది ఎక్కడో కాదు... చెన్నైకి 150 కి.మీ దూరంలో విల్లుపురం అనే జిల్లాలో. ఆరోవిల్‌లోకి అడుగుపెడితే అన్నీ ఆశ్చర్యాలే. రాష్ట్రపతి నుంచి ప్రధాని దాకా ఎంతోమంది ప్రముఖులు ఈ ప్రాంగణంలో గడిపి ఆనందించినవారే.
మాత్రి మందిరం...
ఆరోవిల్‌లో ఏ రకమైన మతాచారాలు గానీ, మతపరమైన ప్రార్థనా మందిరాలు గానీ ఉండవు. ఏ దేవుణీ,్ణ దేవతను పూజించరు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘మాత్రి మందిరం’. ఇది టౌన్‌షిప్ మధ్యలో ఉండే ఒక ధ్యాన మందిరం. బంగారు వర్ణంలో, అతి పెద్ద గోళాకారంలో అత్యంత సుందరంగా కనిపి స్తుంది. ఫ్రెంచ్ వాస్తు శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఈ మందిరం శాంతికి ప్రతీక. అయితే దీని గర్భగుడిలోకి కేవలం అక్కడ నివసించే వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంటే సందర్శకులకు ఇందులోకి నో ఎంట్రీ అన్నమాట.
చట్టాలు ఉండవు...
దేశాన్ని నడపడానికి పరిపాలన లేదా ప్రభుత్వం అవసరం. కానీ ఆరోవిల్ టౌన్‌షిప్‌లో అసలు ప్రభుత్వ పాలన ఊసే ఉండదు. అలాగే ఎలాంటి చట్టాలు ఉండవు. పోలీస్‌వ్యవస్థ కూడా. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలకుతావుండదు. అంతర్గత సమస్యలను ఇక్కడి ప్రజలే పరిష్కరించుకుంటారు. ఇక్కడ నివసించేవారు రాజకీయాలు, మత విశ్వాసాలకు అతీతంగా సత్యమార్గాన్ని అను సరిస్తూ జీవిస్తారు. ఒకరి భాష మరొకరికి అర్థం కాకపోయినా, పరస్పర సహకారం, సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారు.
ప్రత్యేక కరెన్సీ...
ఆరోవిల్‌కు ఎవరైనా వెళ్లి నివసించొచ్చు. కానీ ఒక్క షరతు పాటించక తప్పదు. ఎవరైనా సరే ఒక సేవకుడిగానే జీవించాలనేది ఇక్కడి నిబంధన. 50 వేల మంది నివాసం ఉండేలా నిర్మించిన ఈ టౌన్‌షిప్‌లో ప్రస్తుతం 50 దేశాలకు చెందిన సుమారు 2500 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి లింగ వివక్ష ఉండదు. పైస్థాయి అధికారి నుంచి చిరుద్యోగి వరకు అందరూ సమానమే. అందరికీ ఒకే రకమైన వేతన చెల్లింపులు ఉంటాయి. ‘ఆరోవిల్ యూనిట్’ అనే ప్రత్యేక కర్సెన్సీ చలామణిలో ఉంటుంది. పేపర్ కరెన్సీ, నాణేలకు బదులుగా వీరు ఆరో డెబిట్ కార్డు ఉపయోగిస్తారు.
సకల సౌకర్యాలతో...
ఇది ఒక ప్రయోగాత్మక టౌన్‌షిప్. దీన్ని 1968లో ఫ్రెంచ్ ఆధ్యాత్మిక గురువు మీరా అల్ఫాస్సా స్థాపించారు. ఈమె శ్రీ అరబిందోకు ఆథ్యాత్మిక సహచరురాలు. అందుకే ‘అరబిందో’ని స్ఫురించేలా ‘ఆరోవిల్’ అనే పేరు పెట్టారు. దీన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విశాలంగా నిర్మించారు. చిన్న గుడిసెలు నుంచి పెద్ద విల్లాల వరకు అనేకరకాల ఇళ్లు ఇక్కడ చూడొచ్చు. వీటన్నింటిని వెదురు, గడ్డి, మట్టి సాయంతో పూర్తిగా పర్యావరణహితంగా నిర్మించడం విశేషం. అంతేకాదు కాటేజీలు, ట్రీ హౌస్‌లు, రెస్టారెంట్లు, గెస్ట్‌హౌస్‌లు, యూనివర్సిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం, కెఫె, యోగా సెంటర్, వెల్‌నెస్ సెంటర్... ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. వెల్‌నెస్ సెంటర్‌లో సందర్శకులు ఆరోగ్య చికిత్సలు, ఆయుర్వేద మసాజ్‌లు, ఫిజియో థెరపీ... వంటి సౌకర్యాలను పొందవచ్చు.
50 దేశాలకు...
ఆరోవిల్‌లో 500కి పైగా ఉత్పత్తులను సహజసిద్ధమైన పద్ధతుల్లో తయారుచేస్తారు. ఆధ్యాత్మిక పుస్తకాలు, హ్యాండ్‌మేడ్ కాగితాలు, సబ్బులు, సెంట్లు, కొవ్వొత్తులు, షాంపూలు, బాడీ లోషన్‌లు, క్రీమ్‌లు, మసాజ్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్.... ఇలా ఏడాదికి సుమారు 30 వేల ఉత్పత్తులను 40కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వ్యవసాయం కూడా సాగుచేస్తుంటారు. మొత్తానికి రొటీన్ జీవితానికి భిన్నంగా ఉండాలంటే, అన్నింటిని మర్చిపోయి ఆరోవిల్‌లో అడుగుపెడితే ఎన్నో ఆశ్చర్యాలు... మరెన్నో అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు.
ఎలా చేరుకోవాలి?
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు రోజుకు సుమారు 2500 మంది ‘ఆరోవిల్’ను సందర్శిస్తుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు తెరచి ఉంటుంది. ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. చెన్నై లేదా పాండిచ్చేరి దీనికి సమీప విమానాశ్రయాలు. రైలు మార్గంలో విల్లుపురం చేరుకుంటే, అక్కడ నుంచి ఆరోవిల్‌కు బస్సులు, క్యాబ్‌లు ఉంటాయి.