Share News

బెడ్డింగ్‌... భేషుగ్గా...

ABN , Publish Date - Dec 01 , 2024 | 10:08 AM

కచ్చితంగా వారానికోసారి బెడ్‌షీట్స్‌ను ఉతకాల్సిందే. బెడ్‌ మీదనే కూర్చుని ఆహారం తినటం, మన చర్మం మీద ఉండే మృతకణాలు, బయట తిరిగి అదే కాళ్లతో పిల్లలు బెడ్‌ మీద ఆడుకోవటం వల్ల బెడ్‌షీట్స్‌ త్వరగా మాసిపోతాయి. వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది.

బెడ్డింగ్‌... భేషుగ్గా...

కంటి నిండా కునుకు రావాలంటే... కుదురైన బెడ్‌ కూడా ముఖ్యమే. చాలామంది బెడ్‌ మీద ఎలాగోలా నిద్రపోవాలనుకుంటారు కానీ దిండ్లు, దుప్పట్లు ఎలా ఉన్నాయో చూసుకోరు. మాసిపోయినా, ముతక వాసనేసినా పట్టించుకోరు. ఒక్కమాటలో చెప్పాలంటే బెడ్‌ ఎలా ఉండాలో అవగాహన ఉండదు. మరి బెడ్డింగ్‌ భేషుగ్గా ఉండాలంటే ఏం చేయాలి?

అపరిశుభ్రమైన పరిసరాలే కాదు... అపరిశుభ్రమైన మంచం మీద నిద్ర పట్టడం గగనమే. ‘... నిద్ర సుఖమెరగదు’ అంటారు కానీ, సుఖవంతమైన నిద్ర కోసం సౌకర్యవంతమైన బెడ్డింగ్‌ ఉండాల్సిందే. అందుకోసం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. బెడ్‌షీట్‌, దిండ్లు, కప్పుకునే దుప్పట్ల శుభ్రత అనేది నాణ్యమైన నిద్రపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. అయితే వాటిని ఎన్నిరోజులకు ఉతకాలి? ఎన్ని రోజులకు మార్చాలి? అనే సందేహాలు సహజంగానే చాలామందికి ఉంటాయి.


- కనిపించని బ్యాక్టీరియా

కచ్చితంగా వారానికోసారి బెడ్‌షీట్స్‌ను ఉతకాల్సిందే. బెడ్‌ మీదనే కూర్చుని ఆహారం తినటం, మన చర్మం మీద ఉండే మృతకణాలు, బయట తిరిగి అదే కాళ్లతో పిల్లలు బెడ్‌ మీద ఆడుకోవటం వల్ల బెడ్‌షీట్స్‌ త్వరగా మాసిపోతాయి. వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. కొన్ని సార్లు ఇబ్బంది పెట్టే వాసన వస్తుంది. ఇక ఇంట్లో పెట్స్‌ ఉంటే.. అవి బెడ్‌ మీద తిరుగుతాయి. అందుకే బెడ్‌షీట్స్‌ను కనీసం నాలుగు రోజులకోసారయినా శుభ్రం చేయాలి. పిల్లలు, పెట్స్‌ లేకుంటే వారానికి ఒకసారైనా వాటిని మార్చాలి. బెడ్‌షీట్స్‌ను చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిలో నానబెట్టి బట్టల సబ్బుతో శుభ్రం చేయవచ్చు. వాషింగ్‌ మిషన్‌లో అయితే నాన్‌ క్లోరిన్‌ బ్లీచ్‌ వేసి వాష్‌ చేయాలి. పరిమళం కోసం ఫ్యాబ్రిక్‌ కండిషనర్లను వాడాలి. ఎండలో వీటిని ఆరవేస్తే ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉంటాయి.


- దిండ్లు మార్చాల్సిందే...

మంచంపై వేగంగా పాడయ్యేది దిండు కవర్లు. తలకు పట్టించిన కొబ్బరినూనె, ఇతర హెయిర్‌ ప్యాక్స్‌ వల్ల దిండ్లు మాసిపోతాయి. వీటితో పాటు బయట తిరిగి రావడం వల్ల తలలో పేరుకు పోయిన మట్టి, ధూళి కణాలు తెలియకుండానే దిండుపైకి చేరతాయి. చుండ్రు, ఇతర మలినాలు కలిసిన దుర్వాసన నిద్రకు ఉపక్రమించగానే ఇబ్బంది పెడతాయి. ఒకవేళ ఇంట్లో పెట్స్‌ ఉంటే, అవి ఆడుకోవడం వల్ల డర్టీగా తయారవుతాయి. అందుకే కనీసం మూడు నుంచి నాలుగు రోజులకోసారి దిండ్లను తప్పకుండా శుభ్రపరచాలి. లేదంటే దిండుపై తల వాల్చగానే దుర్వాసన ముక్కుపుటాలకు సోకి నిద్ర పట్టదు.


- దుప్పట్లతో ఇక్కట్లు

శరీరంపై కప్పుకునేవే కదా అని దుప్పట్లను నెలకో, రెండు నెలలకో ఉతుకుతుంటారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్య నిపుణులు. ఎండాకాలంలో చెమట అయినా, చలికాలంలో జలుబు చేసినా, తుమ్మినా దుప్పట్ల మీదకు బ్యాక్టీరియా చేరుతుంది. అలాంటి వాటిని నిండుగా కప్పుకోవడం వల్ల అపరిశుభ్రతను ఆహ్వానించిట్టే అవుతుంది. అందుకే దుప్పట్లు, కంఫర్టర్లను పదిహేను రోజులకోసారయినా శుభ్రం చేయాలి. వాటిని వాషింగ్‌మెషిన్‌లో వేయటం, డ్రై చేయటం మూమూలే. అయితే ఎప్పుడైనా మైల్డ్‌ డిటర్జెంట్‌ సోప్‌నే ఉపయోగించాలి. గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, ఎండలో ఆరేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది.


- పరుపు మెరుపులు

పరుపుల మీద బెడ్‌షీట్స్‌ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే మార్చితే చాలదు. మన కళ్లకు కనిపించిన దుమ్ము, ధూళి ఇంట్లో చాలా ఉంటుంది. అది పరుపులపై పరుచుకు పోతుంది. అందుకే బెడ్‌షీట్స్‌, దుప్పట్లు, దిండ్లు శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, బెడ్‌ మీద పరుపులను శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ మధ్య మార్కెట్లో డస్ట్‌ ప్రూఫ్‌, వాటర్‌ ప్రూఫ్‌ కవర్లు దొరుకుతున్నాయి. వాటిని పరుపులకు తొడగడం కొంత మేలు అయినప్పటికీ నెలకోసారి అయినా వాటిని ఎండలో పెట్టడం, వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రపరచడం మరవొద్దు. లేదంటే బెడ్‌ మీద బేకింగ్‌ సోడాను చల్లి బట్టతో తుడవాలి. సుఖవంతమైన నిద్ర కావాలంటే బెడ్‌రూమ్‌తో పాటు బెడ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే సాధ్యమవుతుందనే విషయాన్ని మరవొద్దు.

Updated Date - Dec 01 , 2024 | 10:08 AM