Anand Mahindra: ఏం ట్యాలెంట్ బాస్.. డ్రైవర్ లేకుండా ప్రయాణించిన బొలేరో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ABN , Publish Date - Apr 03 , 2024 | 04:27 PM
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన అనుచరులతో పంచుకుంటారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను తన అనుచరులతో పంచుకుంటారు. వెరైటీ ఐడియాలతో ఆకట్టుకున్న వారిని ప్రశంసిస్తూ పోస్ట్‌లు చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా కంపెనీకే చెందిన బొలేరో (Bolero) వాహనానికి కొత్త టెక్నాలజీ జోడించి నడుపుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను ఆనంద్ షేర్ చేశారు (Viral Video).
ప్రస్తుతం ఆటోమోటివ్ టెక్నాలజీ హవా నడుస్తోంది. డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా నడిచే కార్లకు మంచి డిమాండ్ ఉంది (Driverless vehicle). అమెరికాలో టెస్లా కార్లు ఇదే టెక్నాలజీతో నడుస్తున్నాయి. ఇండియాలోను ఇటువంటి కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. లెవల్-2 అడాస్ ఫీచర్లతో పలు కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా బోపాల్ (Bhopal)కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఆటోమోటివ్ టెక్నాలజీతో (Automotive Technology) అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంజీవ్ శర్మ అనే ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ భోపాల్‌లో ఈ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. కారులో సెన్సార్స్, కెమెరా, రాడార్ సిస్టమ్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల సెంట్రల్ సిస్టమ్‌ను కారులో అమర్చి దానిని సెల్ఫ్ డ్రైవింగ్ కారులా మార్చారు. ఈ వీడియోలోని బొలేరో వాహనం తనంతట తానుగానే బిజీ రోడ్డుపై ప్రయాణం చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఆయన ఆ స్టార్టప్ కంపెనీని ప్రశంసలతో ముంచెత్తారు.