Viral: ఇది మరీ చిత్రం.. సన్నగా ఉన్నాడని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు.. కారణమేంటంటే..
ABN , Publish Date - Mar 02 , 2024 | 03:19 PM
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి సన్నగా ఉన్నందుకు సమస్యను ఎదుర్కొన్నాడు. బాగా సన్నగా ఉన్నాడనే కారణంతో బ్రిటన్ అధికారులు అతడి లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఊబకాయం (Obesity). ఎంతో మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బ్రిటన్ (Britain)కు చెందిన ఓ వ్యక్తి సన్నగా ఉన్నందుకు సమస్యను ఎదుర్కొన్నాడు. బాగా సన్నగా (Low Body Weight) ఉన్నాడనే కారణంతో బ్రిటన్ అధికారులు అతడి లైసెన్స్‌ను (Driving Licence) క్యాన్సిల్ చేశారు. ఆ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్‌కు చెందిన జో రోజర్స్ అనే వ్యక్తి చాలా సన్నంగా ఉంటాడు. అతడు యుక్త వయసులో ఉన్నప్పట్నుంచే ``అనోరెక్సియా`` అనే ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ రుగ్మత ఉన్న వారు అధికంగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఓ దశలో రోజర్స్ కూడా ఊబకాయంతో బాధపడ్డాడు. తన సమస్యను గుర్తించి వెంటనే తిండిని కంట్రోల్‌లో పెట్టాడు. దాదాపు తినడం మానేశాడు. ఒకవేళ ఏదైనా తిన్నా అది అరగక ముందే వాంతులు చేసుకుంటాడు. దీంతో అతడు బాగా సన్నబడిపోయాడు. రోజర్స్ ఎంత సన్నగా మారిపోయాడంటే అతడు డ్రైవింగ్ చేయడం కూడా కష్టమే అనేంత బక్కగా అయిపోయాడు.
రోజర్స్ వ్యాధి గురించి తెలుసుకున్న అధికారులు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారు. ఏ వాహనాన్నీ రోజర్స్ నడపడానికి వీల్లేని విధంగా నిషేధం విధించారు. ముందు ఆరోగ్యంపై దృష్టి సారించి బాగు పడితే తప్ప లైసెన్స్ రాదని తేల్చి చెప్పారు. దీంతో రోజర్స్ ఆస్పత్రిలో జాయిన్ అయి తన వ్యాధికి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. బరువు కూడా నియంత్రణలోకి వచ్చింది. త్వరలోనే రోజర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయబోతున్నాడు.