‘బుల్లీయింగ్’ బూచోళ్లు..
ABN , Publish Date - Nov 10 , 2024 | 07:49 AM
‘హింస’ అనేది బయట వీధుల్లోనే కాదు.. చదువుకునే బడుల్లోనూ దాగుంటుంది. ‘‘హిహిహి.. నువ్వు హిప్పొపొటమస్‌లాగున్నావు’’ అనే వెక్కిరింతలు.. ‘‘నువ్వు చింపాంజీ కంటే నల్లగున్నావు’’ అనే వర్ణవివక్షలకు తరగతి గదులు వేదికలు అవుతున్నాయి. లేత గుండెల్ని గాయపరుస్తాయి.. ఎగతాళి చేయడం, హేళన చేయడం, ఆట పట్టించడం...
‘హింస’ అనేది బయట వీధుల్లోనే కాదు.. చదువుకునే బడుల్లోనూ దాగుంటుంది. ‘‘హిహిహి.. నువ్వు హిప్పొపొటమస్‌లాగున్నావు’’ అనే వెక్కిరింతలు..
‘‘నువ్వు చింపాంజీ కంటే నల్లగున్నావు’’ అనే వర్ణవివక్షలకు తరగతి గదులు వేదికలు అవుతున్నాయి. లేత గుండెల్ని గాయపరుస్తాయి.. ఎగతాళి చేయడం, హేళన చేయడం, ఆట పట్టించడం... ఇవన్నీ చాలా చిన్న విషయాల్లా కనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారింది. పిల్లల మానసిక ఎదుగుదలను మొగ్గలోనే తుంచివేస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యావరణాల్లో కనిపించే ఈ జాడ్యం పేరు ‘బుల్లీయింగ్’. పసి పిల్లల వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి అవరోధంగా మారుతున్న ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? పిల్లల్ని ఎలా అప్రమత్తం చేయాలి? విశ్లేషించే కథనమే.. ఈ వారం కవర్ స్టోరీ..
‘స్కూల్ టెస్ట్‌లలో ఈసారీ ఫస్ట్ ర్యాంక్ జిరాఫీకే వచ్చిందిరా.. అమెజాన్ అడవుల్లో తింటోందేమో.. అందుకే అంత తెలివి’’
..హారిక ఎప్పుడూ స్కూల్ ఫస్టే!. ఆమెకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా క్లాస్‌రూంలో వెనకబెంచీలో కూర్చున్న గ్యాంగ్ చేసే కామెంట్స్ అవి. హారికకు పుట్టుకతోనే కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఆమె కోరి తెచ్చుకున్నవి కావు. మెడ కాస్త పొడవు. తల కోలగా ఉంటుంది. జన్యు సంబంధిత సమస్యల వల్ల వయసుకు మించిన ఎత్తు పెరిగింది. ఆమె ఆకారాన్ని చాలామంది ఎగతాళి చేస్తుంటారు. ఆ మాటలు విన్నప్పుడల్లా తనకొచ్చిన ర్యాంకు సంగతే మర్చిపోయి.. కుమిలిపోతుంటుందామె.
..ఇలా ఒక్క పాఠశాలలోనే కాదు, దేశవ్యాప్తంగా.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా బడుల్లోనూ, కాలేజీల్లోనూ విద్యార్థుల్ని సూటిపోటి మాటలతో వేధించడం, ఏడిపించడం, ఎగతాళి చేయడం వంటివన్నీ పెరుగుతున్నాయిప్పుడు. నేటితరం హైపర్ పిల్లల్లో కనిపిస్తున్న ఈ జాడ్యమే ‘బుల్లీయింగ్’.
ఇదొక ప్రపంచ సమస్య..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు బుల్లీయింగ్‌ను ఎదుర్కొంటున్నట్టు ‘యునెస్కో’ తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు సంబంధించి, అందుబాటులో ఉన్న డాటా ప్రకారం, 32శాతం మంది విద్యార్థులు, బడుల్లో, కాలేజీల్లో, విద్యా సంస్థల్లో తోటి విద్యార్థుల బుల్లీయింగ్‌కు గురవుతున్నట్టు తేలింది. మన దేశంలో 26శాతం అబ్బాయిలు, 19శాతం అమ్మాయిలు శారీరక వేధింపులకు గురవుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మానసిక వేధింపులకు ఎక్కువగా గురవుతున్నట్టు కూడా నివేదికలు రుజువు చేస్తున్నాయి.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ బుల్లీయింగ్‌ను తీవ్రంగా పరిగణించే పరిస్థితి లేకపోవడం ఆలోచించవలసిన విషయం. ఇందుకు కారణాలు లేకపోలేదు. సరదాగా ఆటపట్టించడం, ఏడిపించడం, హేళన చేయడం లాంటివన్నీ బిడియాన్నీ, భయాన్నీ పోగొట్టి చొరవను పెంచడానికి పిల్లలు ఎంచుకునే మార్గాలుగా సర్వత్రా విశ్వసించే పరిస్థితి. ‘బాల్యంలో ఇవన్నీ మామూలే, వాళ్లే సర్దుకుపోతారు’ అనే ధోరణి తల్లితండ్రులదైతే, ‘ఇలాంటి వాటిని చూసీచూడనట్టు వదిలేయడమే మంచిది’ అనే ధోరణి బడులది. నిజంగానే ఈ ధోరణిని అంత తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదా? బుల్లీయింగ్‌తో పిల్లలకెలాంటి నష్టం జరిగే అవకాశమే లేదా? అసలు బుల్లీయింగ్‌కు నిర్వచనం ఏంటి? వేటిని బుల్లీయింగ్‌గా పరిగణించాలి?
బుల్లీయింగ్ అంటే?
తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న బుల్లీయింగ్ సమస్య బడుల బయటకొచ్చి భౌతిక గాయాలకు మించిన నష్టాన్ని కలుగజేస్తోంది. లెక్కలేనంత మంది పిల్లల మనుసులను లోతుగా, శాశ్వతంగా గాయపరుస్తోంది. కానీ బడుల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలామంది పిల్లలకు వాళ్లు బుల్లీయింగ్‌కు గురవుతున్న విషయమే తెలియని పరిస్థితి. సమస్యను అర్థం చేసుకునే మానసిక పరిణతి లేక, ఇంట్లో తల్లితండ్రుల దృష్టికి తీసుకురావచ్చో లేదో అర్థం అవక, తమలో తామే బాధపడుతూ, కుంగిపోతూ, చివరకు ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. ఈ దుస్థితిలో మార్పు రావాలంటే మొదట ఎలాంటి ప్రవర్తనలు, పనులు బుల్లీయింగ్ కోవలోకొస్తాయో అటు పిల్లలూ, ఇటు పెద్దలూ తెలుసుకోవాలి.
- రూపాన్ని బట్టి ఎగతాళి చేయడం
- మారుపేర్లతో పిలవడం
- ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం
- ఒకరి గురించి అబద్ధాలు ప్రచారం చేయడం
- కావాలనే దూరం పెట్టడం
- వేధింపులకు గురి చేయడం
- పరుషంగా మాట్లాడి అవమానపరచడం
- ఇతరులను భౌతికంగా గాయపరచడం
- ఇష్టం లేని పనులు చేయించడం
- వ్యక్తిగత విషయాలను చాటింపు వేయడం
- ఇబ్బందికరమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం
- తగనివిధంగా తాకడం
- లైంగికంగా ఇబ్బందికి గురి చేయడం
ఎలాంటి ప్రభావం ?
అదే పనిగా బుల్లీయింగ్‌కు గురయ్యే పిల్లల ప్రవర్తన, నడవడిక పూర్తిగా మారిపోతుంది. వాళ్ల మానసిక పరిస్థితి గాడి తప్పుతుంది. బుల్లీయింగ్ ప్రభావం పిల్లల మీద ఏ మేరకు ఉంటుందంటే...
- ఆందోళన, కుంగుబాటు: అదే పనిగా అవమానాలకు గురయ్యే పిల్లల్లో భయాలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితి తీవ్రమైన ఆందోళన, కుంగుబాటుకు దారి తీస్తుంది. దాంతో బాల్యంలోని ఆనందాలకు, సరదాలకు దూరమవుతారు.
- ఆత్మన్యూనత: బుల్లీయింగ్ పిల్లల ఆత్మస్థైర్యాన్ని కుంటుపరుస్తుంది. స్వీయవిలువను కోల్పోయేలా చేస్తుంది.
- ఒంటరితనం: పిల్లలు అందరితో కలవకుండా ఒంటరులుగా మారిపోతారు. హేళనలు, అవమానాలకు దూరంగా ఉండడంకోసం ఏకాంతాన్ని ఆశ్రయిస్తారు.
- చదువులో వెనకబాటు: మానసిక వేదన పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఫలితంగా చదువులో వెనకబడతారు.
- ఈటింగ్ డిజార్డర్: ఎక్కువగా తినడం (బింజ్ ఈటింగ్), లేదా తక్కువగా తినడం (అనరొక్సియా), తిన్నది వాంతి చేసుకోవడం (బులీమియా) ఈ సమస్యలు ప్రత్యేకించి అమ్మాయిల్లో తలెత్తుతూ ఉంటాయి.
- బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్: బాల్యంలో బుల్లీయింగ్ బారిన పడిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఈ డజార్డర్ బారిన పడుతూ ఉంటారు. తమ శరీరంలో ఏదో లోపం ఉందనే ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు.
- స్వీయ హాని: గాయాలు చేసుకోవడం
- ఆత్మహత్య: కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బుల్లీయింగ్‌కు గురయ్యే పిల్లలు స్వీయహానికీ, ఆత్మహత్యకూ ఒడిగడతారు.
సమస్య వాళ్లలోనే...
బుల్లీయింగ్‌ను బడి యాజమాన్యాలు, తల్లితండ్రులు తీవ్రమైన సమస్యగా పరిగణించని సందర్భాలు కోకొల్లలు. ఈ సమస్యను పిల్లలు వాళ్ల దృష్టికి తెచ్చినా, దాన్ని కొట్టిపారేయడమే కాకుండా, దాని గురించి మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టమని మందలిస్తూ ఉంటారు. గరిష్టంగా బుల్లీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని పిలిచి మందలించి వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలతో బడి పేరు దెబ్బ తింటుందనే భయం బడి యాజమాన్యాలకు ఉంటూ ఉంటుంది. కాబట్టే బుల్లీయింగ్‌తో సున్నితంగా వ్యవహరించే ధోరణిని అనుసరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులూ ఇందుకు భిన్నం కాదు.
పిల్లలు ఈ సమస్యను వాళ్ల దృష్టికి తెచ్చినప్పుడు, ‘మా చిన్నతనంలో ఇంతకంటే అవమానాలు, హేళనలూ అనుభవించాం, స్కూల్ డేస్‌లో ఇవన్నీ సహజం కాబట్టి వాటిని పట్టించుకోవద్దు’ అంటూ పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేస్తారే తప్ప, తీవ్రతను విశ్లేషించరు. తరాలతో పాటు సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాలు మారతాయనీ, సమస్య నుంచి తప్పించుకోవడం కోసం పిల్లలు ఎంచుకునే మార్గాలు ప్రమాదకరంగా ఉంటాయనీ తల్లితండ్రులు ఆలోచించలేకపోతున్నారు. ఎలాంటి బుల్లీయింగ్‌ను ఎదుర్కొంటున్నారు? ఎంత ప్రభావానికి గురవుతున్నారు? మానసిక తోడ్పాటు అవసరం ఏ మేరకు ఉంది? లాంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఎలా స్పందించాలి?
పిల్లలు, తమతో విషయాలను పంచుకునే చొరవ తల్లిదండ్రులు కల్పించాలి. ప్రతి రోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతూ, స్కూలు విషయాలు చర్చిస్తూ ఉంటే, బుల్లీయింగ్ గురించి కూడా పిల్లలు పెద్దలతో పంచుకోగలుగుతారు. అయితే ఈ సమస్యను పంచుకున్నప్పుడు, కొందరు పేరెంట్స్, పిల్లల మాటలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండిపోతే, ఇంకొందరు విపరీతంగా ఆందోళన పడిపోయి, సమస్యనెలా పరిష్కరించాలో అర్థం కాక, గందరగోళానికి లోనవుతారు. దాంతో తల్లిదండ్రుల స్పందన చూసి పిల్లలు మరింత ఆందోళన చెందే ప్రమాదం ఉంది. ఇంకొంతమంది బుల్లీయింగ్‌కు పాల్పడిన పిల్లల కుటుంబాలతో, బడి యాజమాన్యాలతో గొడవలకు దిగి కేసులు పెట్టే వరకూ వెళ్లిపోతారు. అరుదుగా కొంతమంది అదే పనిగా పిల్లల బడులు మార్చుతూ బుల్లీయింగ్ నుంచి పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలా అతిగా స్పందించడం, లేదా ఏమాత్రం స్పందించకపోవడం రెండూ సరి కాదు. బుల్లీయింగ్ ప్రభావం పిల్లల మీద ఏ మేరకు పడుతున్నదో తల్లితండ్రులు అర్థం చేసుకుని, ఆ హేళనలకు అడ్డుకట్ట వేసే వ్యూహాలను పిల్లలకు నేర్పాలి. మన శరీరం పరిమాణం, రంగుల గురించి ఆత్మన్యూనతకు గురి కావలసిన అవసరం లేదనీ, ఇతరుల అభిప్రాయాలతో మనకు పని లేదనీ, మన గురించి మనమేం అనుకుంటున్నామన్నదే ముఖ్యమనీ, అందరు పిల్లలూ ఒకేలా ఉండరనీ, మనల్ని మనం ఉన్నదున్నట్టుగా అంగీకరించడం ఎంతో ముఖ్యమనీ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోయాలి. ఎగతాళిని పట్టించుకోకుండా వదిలేయడాన్ని ఎత్తుగడగా ఉపయోగించుకోవచ్చనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా నేర్పాలి. తరచూ అభినందిస్తూ, వాళ్లు సాధించిన చిన్న చిన్న విజయాలను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనులు చేయాలి. అలాగే పరిస్థితి తీవ్రత పెరిగితే బడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడం అవసరమనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాలి.
ఈ లక్షణాల మీద కన్నేసి...
బుల్లీయింగ్‌కు విపరీతంగా స్పందించే పిల్లల్లో డిపెండెన్స్ పర్సనాలిటీ ప్రాబ్లమ్, యాంక్షియస్ పర్సనాలిటీ ప్రాబ్లమ్, అవాయిడెంట్ పర్సనాలిటీ ప్ర్లాబ్లమ్ ఉండే అవకాశముంటుంది. దాంతో ఈ కోవకు చెందిన పిల్లలు హేళనలను, ఎగతాళికి అవసరానికి మించి తీవ్రంగా ప్రభావితమవుతూ ఉంటారు. ఏమాత్రం లక్ష్యపెట్టకపోవడం లేదా మొదటిసారే అడ్డుకోవడం అనే రెండు మార్గాల్లో బుల్లీయింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ఈ తరహా పిల్లలు లోలోపలే మధన పడిపోతూ, కుంగిపోతూ, పదే పదే బుల్లీయింగ్ బారిన పడుతుంటారు. ఈ పరిస్థితికి తోడు తల్లిదండ్రులతో సమస్యను పంచుకునే చొరవ, ధైర్యం లేని పరిస్థితుల్లో స్వీయ హానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. పరిస్థితి పూర్తిగా విషమించకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను కనిపెట్టి, అప్రమత్తం కావాలి. అందుకోసం పిల్లల్లో ఈ లక్షణాలను గమనించాలి.
- కుటుంబసభ్యులతో ముభావంగా ఉండడం
- ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటూ ఉండడం
- శరీరం మీద గాట్లు (స్వీయ హాని)
- ఎక్కువగా ఏడుస్తూ ఉండడం
- చదువులో వెనకబడిపోవడం
పిల్లల ప్రవర్తన వెనక...
బుల్లీయింగ్‌కు పాల్పడే పిల్లల్లో బార్డర్‌లీన్ పర్సనాలిటీ, యాంటీసోషల్ పర్సనాలిటీ, నార్సిసిస్టిక్ డిజార్డర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వ సమస్యలు, బుల్లీయింగ్‌కు పాల్పడే పిల్లల ప్రవర్తనా మూలాలు వాళ్ల తల్లిదండ్రుల్లో, పెరిగే వాతావరణంలో ఉంటాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా లేకపోవడం, పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతూ ఉండడం, తల్లిదండ్రులు తగాదాలు పడుతూ, ఒకర్నొకరు విమర్శించుకుంటూ ఉండడం, తల్లిదండ్రులిద్దరూ ఇతరులను విమర్శించే స్వభావాలను కలిగి ఉండడం, ఇతరులను చూసి అసూయపడే గుణాన్ని కలిగి ఉండడం... ఇవన్నీ పిల్లల ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే ఈ వయసులో పిల్లల మీద వాళ్లు పెరిగే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ప్రవర్తనలను తరచి చూసుకోవాలి. భార్యాభర్తలు గొడవలకు దూరంగా ఉంటూ, ప్రత్యేకించి పిల్లల సమక్షంలో ఆదర్శ దంపతులుగా నడుచుకోవాలి.
మానసిక వైద్యుల తోడ్పాటు ...
కొంతమంది పిల్లల మీద బుల్లీయింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బడిలో కౌన్సిలర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ ప్రభావంతో కుంగిపోయిన పిల్లలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేకపోతారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలను మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లి, థెరపీ ఇప్పించడానికి వెనకాడొద్దు. బుల్లీయింగ్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూనే పరిశీలిస్తుండాలి. సున్నితంగా వ్యవహారాన్ని చక్కదిద్దాలి. అప్పుడే పిల్లలు భద్రంగా ఉంటారు.
- గోగుమళ్ల కవిత
సైబర్ బుల్లీయింగ్
టెక్నాలజీని ఉపయోగిస్తూ వేధింపులకు పాల్పడడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడమే ‘సైబర్ బుల్లీయింగ్’. ప్రత్యక్ష బుల్లీయింగ్ కంటే సైబర్ బుల్లీయింగ్ ఎంతో సంక్లిష్టమైనది. ఈ తరహా బుల్లీయింగ్ ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. అజ్ఞాతంగా కూడా జరగొచ్చు. కొన్ని సందర్భాల్లో సైబర్ బుల్లీయింగ్ పాల్పడేవాళ్లెవరో కూడా తెలియకుండా, ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. ప్రత్యక్ష బుల్లీయింగ్‌లా ఇది బడి వరకే పరిమితం కాదు. ఎక్కడున్నా, ఎప్పుడైనా ఈ బుల్లీయింగ్ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఒక ప్లాట్‌ఫాంలో ఒకర్ని బుల్లీయింగ్ చేస్తే, ఆ విషయం లెక్కలేనంత మందికి తెలిసిపోతుంది. అవి ఫొటోలు కావచ్చు. వ్యక్తిగత సమాచారం, పుకార్లు కావచ్చు. అన్నీ బహిరంగంగా అందరికీ తెలిసిపోతూ ఉంటాయి. అలాగే కొందరు పిల్లలు సైబర్ స్టాకింగ్‌కు పాల్పడుతూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి వాటి ద్వారా మెసేజ్‌లతో ఇతరుల్ని పదే పదే వేధిస్తూ ఉంటారు. అయితే సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్‌లకు కూడా అడ్డుకట్ట వేసే వీలుంది. అదెలాగంటే...
- ఈ తరహా బుల్లీయింగ్స్ ఉంటాయనీ, వాటి బారిన పడితే తమ దృష్టికి తీసుకురావాలనీ తల్లిదండ్రులూ, బడుల యాజమాన్యాలు పిల్లలకు చెప్పాలి.
- ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ లాంటి సామాజిక మాధ్యమాల్లో, ఫిర్యాదు చేయడానికి వీలుండే, ‘రిపోర్ట్ కంటెంట్’ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని పిల్లలకు నేర్పించాలి.
- అన్నిటికంటే ముఖ్యంగా నచ్చని ప్రొఫైల్స్‌ను ‘బ్లాక్’ చేసే సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని పిల్లలకు నేర్పించాలి.
- తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీని పర్యవేక్షిస్తూ ఉండాలి. సామాజిక మాధ్యమాల యాప్‌లకు పాస్‌వర్డ్స్ లేకుండా, ఓపెన్‌గా ఉంచమని పిల్లలకు చెప్పి, వాటిని తనిఖీ చేస్తూ ఉండాలి.
- పిల్లల ఆన్‌లైన్ హిస్టరీని తనిఖీ చేస్తూ, అనుమానాస్పదంగా ఉన్న ఆన్‌లైన్ సెర్చ్‌లను పరిశీలించి, పిల్లలతో మాట్లాడాలి.
- డాక్టర్ జ్యోతిర్మయి,
సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, మనహ క్లినిక్, హైదరాబాద్.