Viral: 80 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 23 ఏళ్ల యువతి! ఆయనలో ఆమెకు నచ్చింది ఇదే!
ABN , Publish Date - Jun 14 , 2024 | 07:42 PM
చైనాలో ఓ ప్రేమ జంటను చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఓల్డేజ్ హోంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడిని 23 ఏళ్ల యువతి ఏరికోరి మరీ మనువాడింది.
ఇంటర్నెట్ డెస్క్: మనసులో ప్రేమ ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు కానీ కొన్ని జంటలను చూస్తే నోరెళ్లబెట్టేస్తాం. ఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయా? అని అవాక్కవుతాము. అచ్చు అలాంటి వింత ప్రేమ కథ చైనాలో వెలుగు చూసింది. ఓల్డేజ్ హోంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు అక్కడే పనిచేస్తు్న్న ఓ 23 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా, వారిద్దరూ కుటుంబసభ్యులను ఎదరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
చైనాలోని హీబే ప్రావిన్స్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఓల్డేజ్ హోంలో ఉంటున్న లీకి అక్కడే పనిచేసే జయోఫాంగ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. చూస్తుండగానే వారి పరిచయం స్నేహంగా మారి చివరకు ప్రేమకు బాటలు వేసింది. అయితే, ఈ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్న వారు చివరకు వివాహబంధంలో ఒక్కటయ్యారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, జయోఫాంగ్ లీ తెలివితేటలు, మానసిక పరపక్వత చూసి మనసు పారేసుకుందట. ఇక యవ్వనం, తుళ్లిపడే ఉత్సాహంతో ఉన్న జయోఫాంగ్‌ను చూడగానే లీ గుండె కూడా లయతప్పిందట (Chinese man 80 Marries 23 year old Woman He Met At An Old Age Home).
Viral: మాతృదేశాన్ని కాదని ఇండియాలో సెటిలైన ఫ్రెంచ్ జాతీయుడు! ఎందుకంటే..
కానీ, వారి ప్రేమను ఇరు కుటుంబాల వారూ అంగీకరించలేదు. ఇదంతా లెక్క చేయని ఆ జంట ఇటీవల నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అంతేకాదు, ఈ జంట రోమాంటిక్‌గా కొన్ని ఫొటోలు కూడా దిగి నెట్టింట పంచుకున్నారు. ఇవి చైనాలో పెను కలకలానికే దారి తీశాయి.
తన కుటుంబానికి జయోఫాంగ్‌యే జీవనాధారమని స్థానిక మీడియా పేర్కొంది. ఇక లీకి కూడా పెన్షన్ డబ్బులే ఆధారం. కానీ, అందరినీ ఎదిరించి జయోఫాంగ్ లీని మనువాడింది. లీ తన పక్కన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని కూడా మురిసిపోయిందట. ఇక వీరీ ప్రేమపై నెట్టింట కామెంట్స్‌కు అంతేలేకుండా పోయింది. కొందరు యువతిది నిజమైన ప్రేమ అంటే మరికొందరు మాత్రం డబ్బు కోసం వృద్ధుడిని మనువాడిందని మండిపడ్డారు. కాగా, భారత్‌లోనూ కొంత కాలం క్రితం ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. ఫన్నీ ఇన్‌స్టా వీడియోలు చేసుకునే 80 ఏళ్ల వృద్ధుడిని చూసి మనసు పారేసుకున్న ఓ 34 ఏళ్ల మహిళ చివరకు ఆయననే వివాహమాడింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.