Share News

చీరలతో సాగుబడి

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:47 AM

- రాయలసీమలోని చిన్న పల్లె. రైతులు అక్కడ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. టమాటా మొక్కలు నాటే ముందు పొలంలో బెడ్స్‌ వేసి, వాటిమీద పాత చీరలు పరుస్తున్నారు! - దంతేవాడ (ఛత్తీస్‌ఘడ్‌) దండ కారణ్యంలో గిరిజన మహిళలు ఇప్ప చెట్ల చుట్టూ చీరలు కడుతున్నారు.

చీరలతో సాగుబడి

- రాయలసీమలోని చిన్న పల్లె. రైతులు అక్కడ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. టమాటా మొక్కలు నాటే ముందు పొలంలో బెడ్స్‌ వేసి, వాటిమీద పాత చీరలు పరుస్తున్నారు!

- దంతేవాడ (ఛత్తీస్‌ఘడ్‌) దండ కారణ్యంలో గిరిజన మహిళలు ఇప్ప చెట్ల చుట్టూ చీరలు కడుతున్నారు.

- ఉత్తరాంధ్రలోని మన్యం ప్రాంతంలో సపోటా, మామిడి మొక్కల చుట్టూ కంచెగా పాత నైటీలను కొందరు రైతులు చుడుతున్నారు!


ప్రకృతికి, నేలకు హాని కలగకుండా వీరంతా సాగులో అనుసరిస్తున్న వైవిధ్య విధానాలు అవి. వాటి వెనుక పర్యావరణహితంతో పాటు, పంట దిగుబడి పెరిగే అవకాశం కూడా ఉంది.

చీరలతో మల్చింగ్‌...

ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేటలో సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగించినట్టు 2019లో ఐ.రా.స సర్వేలో వెల్లడైంది. ఇలా పొలాల్లోని బెడ్స్‌ మీద కాయగూరల సాగుకు 34 లక్షల టన్నుల మల్చింగ్‌ ఫిల్మ్‌ వాడుతున్నారు. కూర గాయల సాగులో కలుపు నివారించే, తేమను కాపాడడానికి ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్స్‌ వాడు తుంటారు. ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి ప్లాస్టిక్‌ షీట్‌ పంట భూముల్లో మిగిలి పోయి, సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలుగా మారి మట్టిలో కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్‌ అవశేషాల వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి నశించి క్రమంగా పంట దిగుబడులు తగ్గిపోతాయి.


ఒక కిలో పల్చటి ప్లాస్టిక్‌ షీట్‌ సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో సాగు భూమిని కలుషితం చేస్తుందని అంచనా. మరి ప్లాస్టిక్‌ మల్చింగ్‌కి ప్రత్యామ్నాయం ఎలా? అని ఆలోచించి ఒక కొత్త విధానం కనిపెట్టారు ‘వాసన్‌ స్వచ్ఛంద సంస్థ’ టెక్నికల్‌ బృందం.

అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో కొందరు రైతుల సమక్షంలో పర్యావరణహిత మల్చింగ్‌ విధానాన్ని అమలు చేశారు. ప్లాస్టిక్‌ ఫిల్మ్‌ బదులు పాత చీరెలతో పొలాల్లో మల్చింగ్‌ చేసి చూపించారు.


nani1.2.jpg

‘ఈ ప్రాంతంలో టమాటా పంటలకు రైతులంతా ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వేస్తున్నారు. దీనివల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి నశించి, సారం కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చీరెలతో మల్చింగ్‌ చేసుకోవచ్చు. అది భూమిలో కలిసిపోతుంది. దీనితో పాటు జనపనార, వరి గడ్డి, మోదుగ ఆకులు కూడా బెడ్‌ల మీద కప్పుకోవచ్చు’ అంటారు వాసన్‌ ప్రతినిధి సుధాకర్‌. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధుల కోసం, పర్యావరణ హిత ఎకోసిస్టమ్‌ల ఏర్పాటుకు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తోంది.


ఇప్పపూల సేకరణకు...

ఛత్తీస్‌ఘఢ్‌లోని దంతేవాడ సమీపంలో మాసూడి అడవిలోకి అడుగుపెడితే, ఇప్పచెట్ల చుట్టూ వివిధ రంగుల చీరలు కనిపిస్తాయి. ప్రతి చెట్టు చుట్టూ చీరలు కట్టడానికి పది మంది ఆదివాసీ మహిళలు పని చేస్తుంటారు. ‘ఇప్పపూలు రాలే సీజన్‌లో రోజుకు 50 నుంచి 60 కిలోల వరకు నేల మీద రాలిపోతుంటాయి. దానివల్ల వాటికి మట్టి అంటుకొని చాలా వరకు చెడిపోయి మహిళల శ్రమ వృఽధా అవుతోంది. అందుకే చౌకగా దొరికే చీరెలను సేకరించి చెట్టు కాండానికి చుట్టూ కడతారు. దీంతో పూలన్నీ చీరల్లోకి రాలి పోతుంటాయి. ఒక్క పువ్వు కూడా దెబ్బతినదు’ అని వివరించారు ‘బస్తర్‌ ఫుడ్‌ ఫర్మ్‌’ అనే సంస్థను నిర్వహిస్తున్న షేక్‌ రజియా. పది మహిళా గ్రూప్‌లను ఏర్పాటు చేసి వారితో ఇప్పపూల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులుగా ఇప్ప చాక్లెట్‌, ఇప్ప లడ్డూలు, మహువా టీ లాంటి వైవిధ్య ఉత్పత్తులను వివిధ ఫ్లేవర్స్‌తో తయారు చేసి సరిహద్దుల్లోని సైనికులకు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు.


చీరలతో కంచెలు

తూరుపు కనుమల్లోని అతిపెద్ద గిరిజన మన్యం కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా). మామిడి, జీడిమామిడి, సపోటా, సీతా ఫలం తోటలు ఎక్కువగా పెంచుతుంటారు. మొక్కలు నాటినపుడు జంతువుల నుంచి రక్షణకు మొక్కల చుట్టూ వెదురు, కలపతో కంచెలు కట్టడం రైతులంతా చేసేదే. కానీ కొయ్యూరు మండలం, లొద్దిపాకల గ్రామంలో గిరిజనులు ఒక కొత్త విధానం అనుసరిస్తున్నారు.

‘పాత చీరలు, నైటీలను కంచెలుగా ఏర్పాటు చేశాడు మాలో ఒక రైతు. పొలంలో రంగుల చీరలు కనిపించడంతో జంతువులు, పక్షులు బెదిరిపోయి, ఇటు వైపు రావడం లేదు. ఇదేదో బాగుందని అందరం ఇదే పద్ధతిలో కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నాం’ అని రైతు సోమరాజు అన్నాడు.

స్ధానిక వనరులతో నేలకు హాని చేయకుండా, ఎకో ఫ్రెండ్లీగా వ్యవసాయం చేస్తున్న ఈ రైతుల ఐడియాలు ఆదర్శనీయం అంటున్నారు వీరిని చూసిన వారంతా.

- శ్యాంమోహన్‌, 94405 95858

ఫొటోలు: సంతోష్‌ ఇస్రం

Updated Date - Oct 20 , 2024 | 06:47 AM