Share News

Diwali 2024: పిల్లిని లక్ష్మీ దేవిగా కొలిచే సంప్రదాయం.. దీపావళి పండుగ వెనక కథ తెలుసా

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:55 PM

వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న దీపావళి పండగ జరగనుంది.

Diwali 2024: పిల్లిని లక్ష్మీ దేవిగా కొలిచే సంప్రదాయం.. దీపావళి పండుగ వెనక కథ తెలుసా

హైదరాబాద్: వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న దీపావళి పండగ జరగనుంది. ఉత్తరాదిన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 1న పండుగ జరుపుకోనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పండుగను అట్టహసంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యమైనా జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. దీప కాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా కొలుస్తారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి. దీపావళి ప్రపంచాన్ని కాంతిమయం చేస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో దైవం ప్రాముఖ్యతను దీపావళి చాటుతుంది. ఇళ్ల ముంగిట, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రకారాల్లో, గోశాల, వీధుల వెంబడి దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి పూజలను నిర్వహించడానికి వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వేర్వేరు పేర్లతో..

దీపావళి పండుగను తెలంగాణ, ఏపీతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. అసోం, పశ్చిమ బెంగాల్‌లో జగదాత్రి పూజగా, ఒడిశాలో కూమార పూర్ణిమగా జరిపి దీపావళి వరకు కన్యలు ఆనంద దీపోత్సవాలతో ఆటాపాటలతో కాలక్షేపం చేస్తారు. దక్షిణ భారతంలో బలి చక్రవర్తిని అణచిన మహావిష్ణువు విజయంగా కొందరు, నరకాసుర వధ చేసిన శ్రీకృష్ణ విజయంగా మరికొందరు పండుగను జరుపుకుంటారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన విజయోత్సవంగా, తమిళనాడులో తెల్లవారుజామున లేచి నరక చతుర్దశి జరుపుకుంటారు.


కర్ణాటకలో మూడు రోజులపాటు పండుగ జరుపుకుంటే రాజస్థాన్‌లో దన్‌ తెరాస్‌గా నిర్వహిస్తారు. మహిళలు ఆ రోజు నగలను నదిలో శుభ్రం చేసి పిల్లిని లక్ష్మీదేవిగా పూజిస్తారు. అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. గుజరాత్‌లో పిండివంటలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. మహారాష్ట్రలో లక్ష్మీపూజ, గణేష్‌ పూజ జరుపుతారు. మార్వాడిలు దీపావళి రోజునుంచే కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు. ఉత్తర భారతంలో మహాలక్ష్మికి, దక్షిణాదిలోని కేరళలో పాతాళం నుంచి బలిమహారాజు భూమిపైకి వచ్చి దర్శనమిస్తాడని భావిస్తారు.

ప్రాచుర్యంలో ఉన్న కథలివే...

పండుగల్లో దీపావళి ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ దీపావళి వెనక ఎన్నెన్నో కథలు ఉన్నాయి. తండ్రి ఆజ్ఞా ప్రకారం శ్రీరాముడు 14సంవత్సరాలు అరణ్య వాసానికి వెళ్తాడు. అక్కడ లంకాదిపతి రావణుడు రాముడు లేని సమయం చూసి సీతమ్మవారిని ఎత్తుకుపోయి లంకలో బంధిస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో వెళ్లి రావణాసురుడిని ఓడించి సీతమ్మను తీసుకొస్తాడు. అరణ్యవాసం పూర్తి కావడంతో అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన సందర్భంలో నగర ప్రజలు సంతోషంగా ఇళ్లలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదిలా ఉంటే చిరకాలం జీవించాలనే ఆశతో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతుంటారు. అమృతంకంటే ముందుగా సముద్రం నుంచి లక్షీదేవి ఉద్బవిస్తుంది.


అమ్మవారు జన్మించిన ఈ రోజు ఇంటి నిండా దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని దీపావళి ప్రారంభించుకుంటారు. దాపరయుగంలో రాక్షస రాజు నరకాసురుడు వర గర్వంతో ముల్లోకాలను దేవతలను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతాడు. శ్రీకృష్ణుడు రంగంలోకి దిగి నరకాసురుడిని వధిస్తాడు. దీంతో ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగిస్తారు. ఇది దీపావళిగా మారిందని మరోకథనం. పాండవులు కౌరవులతో జూదం ఆడి ఓడిపోవడంతో 12 సంవత్సరాల అరణ్య వాసం, ఏడాది అజ్ఞాత వాసానికి వెళ్లాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలం తారువాత పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకోవడంతో ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు. ఇదే దీపావళి అయ్యిందని మరి కొందరు చెబుతుంటారు.

Diwali 2024: దీపావళి పరమార్థం తెలుసా.. పండుగ 5 రోజులెందుకు

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా


For Latest News and National News click here...

Updated Date - Oct 24 , 2024 | 03:55 PM