ఉద్వేగభరిత క్షణాలు... రెండు యుద్ధ స్మారకాలు...
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:14 AM
విహార ప్రదేశాలంటే అందమైన సరస్సులు, జలపాతాలు, కట్టడాలే కాదు... యుద్ధభేరి మోగిన ప్రాంతాలు, సైనికుల వీరత్వగాధలు, రక్తం ఏరులై పారిన ప్రదేశాలు కూడా... అలాంటి యుద్ధ స్మారకాలను వీక్షిస్తే... ఉద్వేగభరితంగా మారిపోతాం. చరిత్ర ఘటనలను కళ్లకు కట్టేలా లైట్ అండ్ సౌండ్‌షో రూపంలో చూస్తుంటే... ఆనాటి యుద్ధ స్మృతులు మనల్ని చుట్టుముడతాయి.
విహార ప్రదేశాలంటే అందమైన సరస్సులు, జలపాతాలు, కట్టడాలే కాదు... యుద్ధభేరి మోగిన ప్రాంతాలు, సైనికుల వీరత్వగాధలు, రక్తం ఏరులై పారిన ప్రదేశాలు కూడా... అలాంటి యుద్ధ స్మారకాలను వీక్షిస్తే... ఉద్వేగభరితంగా మారిపోతాం. చరిత్ర ఘటనలను కళ్లకు కట్టేలా లైట్ అండ్ సౌండ్‌షో రూపంలో చూస్తుంటే... ఆనాటి యుద్ధ స్మృతులు మనల్ని చుట్టుముడతాయి. అసంకల్పితంగా ఆ కాలంలోకి అసంకల్పితంగా ఆ కాలంలోకి వెళ్లిపోతాం. అలాంటి రెండు యుద్ధ స్మారక విశేషాలే ఇవి...
వెళ్లిపోతాం. అలాంటి రెండు యుద్ధ స్మారక విశేషాలే ఇవి...
అమెరికాలో ఒక స్నేహితుడుంటే రోడ్ ట్రిప్‌లు జీవితకాల అనుభవాన్నిస్తాయి. రెగ్యులర్ పర్యాటక ప్రాంతాలు చూసిన తర్వాత మిత్రుడు వీరేందర్‌రెడ్డి ‘‘చారిత్రక ప్రదేశాలంటే ఇష్టమేనా?’’ అని అడిగాడు. ‘‘ఇష్టమే’’ అనడంతో గెట్టిస్‌బర్గ్‌కు వెళ్లాం. వాషింగ్టన్ డీసీకి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1860-65ల మధ్య అమెరికా అంతటా జరిగిన అంతర్యుద్ధానికి ముగింపు పలికిన యుద్ధభూమి ఇది. బానిసత్వం ఉండాలని, బానిసత్వం రద్దు చేసి అందరికీ స్వేచ్ఛ ఇవ్వాలన్న అంశంపై నాటి అమెరికా రెండుగా విడిపోయింది. దక్షిణాది రాష్ట్రాలు బానిసత్వం ఉండాలని, ఉత్తరాది రాష్ట్రాలు బానిసత్వం ఉండకూడదనే తీవ్రమైన ఘర్షణ వైఖరితో ఉన్నాయి.
3 రోజుల్లో 51 వేల మంది మరణం...
1860లో బానిసత్వం రద్దు అన్న స్పష్టమైన నినాదంతో ఉన్న అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో అసలు బానిసత్వం విషయంలో యూనియన్ (కేంద్రం) ఆదేశాలు పాటించాల్సిన పనిలేదని దక్షిణాది రాష్ట్రాలు భావించాయి. ఏకంగా ఏడు రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించుకుని ‘కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’గా ఏర్పడ్డాయి. జెఫర్సన్ డేవిస్‌ను కాన్ఫెడరేట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో యూనియన్ అధ్యక్షుడు లింకన్... కాన్ఫెడరేట్ రాష్ట్రాల్లో ఉన్న యూనియన్ ఆస్తుల్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
అయితే ఆయన ప్రతిజ్ఞను పట్టించుకోకుండా 1861 ఏప్రిల్ 12న కాన్ఫెడరేట్ సైన్యాలు యూనియన్ ఆధ్వర్యంలో ఉన్న చార్లెస్టర్‌లోని ఫోర్ట్ సమ్మర్‌పై దాడిచేసి స్వాధీనం చేసుకున్నాయి. ఇది అమెరికన్ అంతర్యుద్ధానికి దారితీసింది. ఫోర్ట్ సమ్మర్‌పై విజయం తర్వాత మరో నాలుగు దక్షిణాది రాష్ట్రాలు (వర్జీనియా, అర్కాన్సాస్, టెన్నెస్సీ, నార్త్ కరోలినా)లు కూడా కాన్ఫెడరేట్‌లో కలిసిపోయాయి. ఆ తర్వాత మరికొన్ని యుద్ధాల్లోనూ వారి సైన్యమే విజయాలు సాధించింది. ఈ విజయాలు ఇలాగే కొనసాగి ఉంటే ఇప్పటికీ అమెరికాలో బానిసత్వమే ఉండేదేమో.
అయితే గెట్టిస్‌బర్గ్ యుద్ధం దానికి అడ్డుకట్ట వేసింది. 1863 జూన్ 1 నుంచి మూడు రోజుల (జూన్ 3) పాటు జరిగిన యుద్ధంలో యూనియన్ సైన్యాలు విజయం సాధించాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల సైన్యంలోని సుమారు 51 వేల మంది మరణించారు. మూడో రోజు ఒకే ఒక గంటలో తమ సైన్యం ఐదువేల మంది చనిపోవడంతో కాన్ఫెడరేట్స్ సైన్యానికి సారథ్యం వహించిన జనరల్ లీ వెనుకంజ వేసి వర్జీనియా వైపు తరలిపోయారు. యూనియన్ సైౖన్యాల అధ్యక్షుడు జనరల్ మీడే ఆఽధ్వర్యంలో యూనియన్‌కు విజయం సొంతమైంది.
యుద్ధం... కళ్లముందు సాక్షాత్కారం...
యుద్ధం జరిగిన ప్రదేశాన్ని ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం అలాగే పరిరక్షిస్తోంది. అక్కడే గెట్టిస్‌బర్గ్ హెరిటేజ్ సెంటర్ మ్యూజియంను సందర్శించాం. అక్కడున్న సైక్లోరామా (ఒక దృశ్యాన్ని వృత్తాకారంలో 360 డిగ్రీల కోణంలో చిత్రించడం) యుద్ధం జరిగిన తీరును కళ్లముందు ఆవిష్కరిస్తుంది. 377 అడుగుల వృత్తాకారం, 42 అడుగుల పొడవుతో ఈ సైక్లోరామా ఉంది. నాటి యుద్ధంలో ఫిరంగులు పేలిన ప్రాంతాలు, బాంబుల మోతలు, గుర్రాల పరుగులు, సైనికుల కదలికలు అన్నీ కళ్లముందే కదిలే షోను ఇక్కడ ప్రదర్శించారు. అంతర్యుద్ధం- గెట్టిస్‌బర్గ్ యుద్దానికి సంబంధించిన లఘు చిత్ర ప్రదర్శన కూడా చూశాం. అలనాటి సైన్యాలు వాడిన ఆయుధాలు, జనరల్స్ వాడిన దుస్తులు, ఇతర పరికరాలు, వస్తువులు అన్నీ మ్యూజియంలో ఉన్నాయి.
అంతేకాదు... యుద్ధం జరిగిన ప్రాంతమంతా తిరిగేందుకు కార్, వ్యాన్ టూర్‌లు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సైన్యాలు ఎలా మొహరించాయి? ఎవరిసైన్యం ఎలా ముందుకెళ్లింది? ఫిరంగి దళం, అశ్వ దళం, కాల్బలం ఎలా ముందుకు కదిలాయి? అనే వివరాలు, వాటి గుర్తులు ఆ ప్రాంత మంతటా ఉంటాయి. చెట్లకు తగిలిన ఫిరంగి గుళ్ల దెబ్బలు, తూటాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. వాటి విశేషాలను గైడ్ వివరిస్తుంటే నాటి యుద్ధ కాలంలోకి వెళ్లిపోతాం. యుద్ధం ముగిశాక అక్కడికి వచ్చిన అబ్రహం లింకన్ బస చేసిన విల్స్ గెస్ట్‌హౌస్, సైనికుల కోసం స్థలం సేకరించి నిర్మించిన శ్మశానవాటికలు అన్నింటినీ చూడొచ్చు. అనేక యుద్ధాల్లో కాన్ఫెడరేట్లను గెలిపించిన జనరల్ లీ ఆజాను బాహుడు. గొప్ప పోరాటయోధుడు.
ఆయన ఈ యుద్ధంలో ఓడిపోకపోయుంటే, ఈరోజు అమెరికాలో అనేక దేశాల ప్రజలు వెళ్లి స్వేచ్ఛగా స్థిరపడేందుకు అవకాశం ఉండేది కాదు. బానిసత్వ రద్దు ప్రకటన చేసిన అబ్రహం లింకన్‌ను 1865లో వాషింగ్టన్‌లోని ఒక థియేటర్‌లో కాన్ఫెడరేట్ల అభిమాని అయిన జాన్ విల్కేస్ బూత్ కాల్చి చంపాడు. కానీ గెట్టిస్‌బర్గ్‌లో అబ్రహం లింకన్ ఇచ్చిన రెండు నిమిషాల ప్రసంగం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ‘‘ఇక్కడ సైనికులు చేసిన త్యాగం దేశం నిలబడేందుకు కారణమైంది. ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ భూమిమీద ఎప్పటికీ అంతం కాదు’’ అన్నారాయన. అమెరికాలోని రాష్ట్రాల మఽధ్య జరిగిన అంతర్యుద్ధానికి ఎలాంటి రంగులు పులమకుండా... జరిగింది జరిగినట్లు చరిత్రలో పొందుపరచడం గొప్ప విషయమే.
రెండు కొరియాల మధ్య సైన్యరహిత ప్రాంతం ...
అలాంటి మరో ఉద్విగ్నభరిత యుద్ధ స్మార కాన్ని ఇటీవల దక్షిణ కొరియాను సందర్శించి నప్పుడు చూసే అవకాశం నాకు కలిగింది. అది ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్యనున్న సైన్యరహిత ప్రాంతం (డీ మిలటరైజ్డ్ జోన్- డీఎంజెడ్). 1950-53ల మధ్య మూడేళ్లపాటు కొనసాగిన కొరియా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య సుమారు 30 లక్షలు అనిఅంచనా. దక్షిణ కొరియా సైనికులు 5 లక్షల మంది, ఉత్తర కొరియా సైనికులు 5 లక్షల మందితో పాటు... వారికి మద్ధతు ఇచ్చిన చైనా సైనికులు 1.10 లక్షలు, దక్షిణ కొరియాకు మద్ధతు ఇచ్చిన అమెరికా సైనికులు 37వేల మంది, ఐక్యరాజ్య సమితి సైనికులు 16,500ల మంది ఉన్నారు. అయితే వీరి కన్నా అత్యధికంగా సామాన్య పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ యుద్ధం వల్ల కొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తప్పి పోయారు. మళ్లీ జీవితంలో కలుసు కోలేనంత దూరంగా చెల్లాచెదురైపోయారు. రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాంయుద్ధంలో కూడా ఇంత భారీగా ప్రాణనష్టం జరగలేదు. ఈ యుద్ధం ముగింపులో సైన్యరహిత ప్రాంతం(డీఎంజెడ్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొరియా యుద్ధంలో ముఖాముఖి పోరు జరిగిన ప్రాంతం ఇది.
కొరియా యుద్ధం ఆగేనాటికి ఎదురెదురుగా ఉన్న ఇరుదేశాల సైన్యాలను 1.2 మైళ్ల చొప్పున వెనక్కి వె ళ్లేలా చేసి, సుమారు 2.5 మైళ్ల వెడల్పుతో ‘డీఎంజెడ్’ను ఏర్పాటు చేశారు. 160 మైళ్ల పొడవు, 2.5 మైళ్ల వెడల్పు ఉన్న ప్రాంతమిది. నిరంతరం ఉద్రిక్తతలుండే కొరియాల మధ్య ముఖాముఖి యుద్ధాన్ని కొంతమేర అయినా నిరోధించేందుకు ఈ సైన్యరహిత ప్రాంతాన్ని ఏర్పాటుచేశారు. తమ దేశం వైపు ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు దక్షిణ కొరియా ఒక పర్యాటక ప్రాంతంగా మార్చింది. ఒకవైపు నాటి యుద్ధచరిత్ర, మరోవైపు అక్కడి పచ్చని పర్యావరణ ప్రదేశాల మధ్య మా పర్యటన సాగింది. డీఎంజెడ్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే, వారి బస్సుల్లోనే అన్నీ చూపిస్తారు.
అమ్మో... కిమ్ సొరంగాలు
ఇక్కడ పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునేది ఉత్తర కొరియా తవ్విన రహస్య సొరంగాలు. యుద్ధం ఆగిపోయి, సైన్యరహిత ప్రాంతం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఉత్తరకొరియా తన ప్రయత్నాలు మానలేదు. ఉత్తర కొరియా భూభాగం నుంచి దక్షిణ కొరియా భూభాగం వరకు లోతైన సొరంగాలు తవ్వారు. 1950వ దశకంలో ఉత్తర కొరియాను పాలించిన కిమ్ తు బాంగ్ నుంచి ఆ తర్వాత పాలించిన కిమ్ ఇల్‌సంగ్, చో యాంగ్ గోన్, కిమ్ యోంగ్‌నామ్, ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల దాక సొరంగాల తవ్వకం సాగుతూనే ఉంది. ఈ సొరంగాల గుండా రహస్యంగా సైన్యాలను పంపి, హఠాత్తుగా దక్షిణ కొరియాపై పడి యుద్ధం చేయొచ్చనేది ఆలోచన.
ఏకకాలంలో వేలకొద్ది సైనికులను పంపేలా ఏకంగా మూడు సొరంగాలను మూడు వైపుల నుంచి తవ్వారు. ఈ సొరంగాలన్నీ దక్షిణ కొరియాలోకి రావడమే కాకుండా ఆ దేశ రాజధాని సియోల్‌కు కేవలం రెండు గంటల దూరంలోనే ఉన్నాయి. ఇందులో ఒక సొరంగాన్ని పర్యాటకులు చూసేందుకు అనుమతిస్తున్నారు. 850 మీటర్ల లోతుండే ఈ సొరంగం నిట్టనిలువుగా ఉంటుంది. గుండె జబ్బులు, ఉబ్బసం, శ్వాస సమస్యలు ఉన్న వారు దీనిలోకి వెళ్లేందుకు అనుమతించరు. అందులోకి వెళ్లి తిరిగొచ్చేసరికి చెమటలు పట్టాయి. సొరంగంలో చాలా భాగం ఐదడుగుల ఎత్తుకు మించి ఉండదు. దాంతో ఆరడు గులున్న నాకు దుస్సాహసంగా అనిపించింది.
సొరంగం చివరకు చేరుకున్నాక అక్కడున్న చిన్న కిటికీలాంటి రంధ్రంలోంచి చూస్తే ఉత్తర కొరియా భూభాగం కనిపిస్తుంది. సొరంగానికి అటువైపు చివర ఉత్తర కొరియా బావి లాంటి దాన్ని తవ్వింది. అంటే తమ సైనికులు ఆ బావిలో దిగి అక్కడినుంచి సొరంగంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారన్నమాట. ఒక్క రోజులోనే కొన్ని వేలమంది సైనికులు ఈ సొరంగం గుండా దక్షిణ కొరియాలోకి ప్రవేశించేలా ఉత్తర కొరియా ఈ సొరంగాలను తవ్విందని తెలుసుకుని ఆశ్చర్యమేసింది. సొరంగం లోపలంతా రాతిమయమే. ఏ యంత్రాలు లేని కాలంలో రాతి ప్రదేశంలో సొరంగాలు ఎలా తవ్వారో కదా. అయితే శత్రుదేశం తమపై రహస్యదాడికి తవ్విన సొరంగాన్ని ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యాటక ప్రాంతంగా మార్చి సొమ్ము చేసుకోవడం కొసమెరుపు. అయితే ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఉంటే... ఉత్తర కొరియా దాడులకు పాల్పడదన్న ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు.
- ఉప్పులూరి మురళీకృష్ణ, 99854 33362