Share News

వందేళ్లు దాటినా నడక మానలేదు

ABN , Publish Date - Dec 01 , 2024 | 07:43 AM

సాధారణంగా 70 ఏళ్లు దాటితే ‘కృష్ణా, రామా’ అనుకుంటూ శేష జీవితాన్ని గడుపుతారు చాలామంది. విశాఖకు చెందిన 102 ఏళ్ల వల్లభజోస్యుల శ్రీరాములు మాత్రం ఇందుకు భిన్నం. వందేళ్లు దాటినా వెటరన్‌ అథ్లెట్‌గా... అనేక దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటూ మెడల్స్‌ సాధిస్తున్నారు. తన ఆరోగ్య చిట్కాలు, రోజువారీ జీవన విధానం ఆయన మాటల్లోనే...

వందేళ్లు దాటినా నడక మానలేదు

సాధారణంగా 70 ఏళ్లు దాటితే ‘కృష్ణా, రామా’ అనుకుంటూ శేష జీవితాన్ని గడుపుతారు చాలామంది. విశాఖకు చెందిన 102 ఏళ్ల వల్లభజోస్యుల శ్రీరాములు మాత్రం ఇందుకు భిన్నం. వందేళ్లు దాటినా వెటరన్‌ అథ్లెట్‌గా... అనేక దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటూ మెడల్స్‌ సాధిస్తున్నారు. తన ఆరోగ్య చిట్కాలు, రోజువారీ జీవన విధానం ఆయన మాటల్లోనే...

‘‘నా సొంతూరు విశాఖ అనే చెబుతాను. ఎందుకంటే నాన్న వెంకటరాయుడు ఆర్‌అండ్‌బీ డిపార్టుమెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. ఎక్కడా కొన్నాళ్లపాటు స్థిరంగా ఉండలేని పరిస్థితి. బందరులో నా డిగ్రీ పూర్తయిన తరువాత 1945లో ఇండియన్‌ నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాలో చేరా. 35 ఏళ్లపాటు పనిచేసి కమాండర్‌ హోదాలో 1979లో పదవీ విరమణ చేశా. ఆ తరువాత ఎనిమిదేళ్లపాటు (1988 వరకు) డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేశా. అనంతరం విశాఖలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నా.


మితాహారం, వ్యాయామం ...

ఆరోగ్యం విషయంలో తొలి నుంచి ముందుచూపుతో వ్యవహరిస్తూ వచ్చా. ఏదైనా అతి అయితే అనర్థమే అని బలంగా నమ్ముతా. పదవీ విరమణ తరువాత డైట్‌ విషయంలో ఆంక్షలు పెట్టుకున్నా. తక్కువ తినడం, వ్యాయామం చేయడం... ఇదే నా ఆరోగ్య రహస్యం. మనవాళ్లు ఎంత ఎక్కువ తింటే అంత బలం అని నమ్ముతుంటారు. కానీ, ఇది కరెక్ట్‌ కాదు. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందుకోసం 45 ఏళ్ల వయసు నుంచే ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకుంటూ వస్తున్నా. రాత్రిపూట భోజనం పూర్తిగా మానేశా. ఇప్పటికీ 57 ఏళ్ల నుంచి రాత్రిపూట తినడమే తెలియదు. ఇదే అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తాను.


రోజువారీ డైట్‌ ఇదే...

గత 50 ఏళ్లుగా బయట ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నా. అథ్లెటిక్స్‌ పోటీలకు వెళ్లేటప్పుడు కూడా మితాహారం, అందులోనూ రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌ ఉండేలా చూసుకుంటా. ప్రతిరోజూ తెల్లవారుజామున రెండు గంటలకు నిద్రలేస్తా. గత 40 ఏళ్లుగా ఇదే అలవాటు కొనసాగిస్తున్నా. కాలకృత్యాలు తీర్చుకుని ఒక కాఫీ తాగుతా. ఒక అరటి పండు తిని వాకింగ్‌కు వెళతా. అప్పట్లో కనీసం 15 కిలోమీటర్లు రన్నింగ్‌, ఫాస్ట్‌ వాకింగ్‌ చేసేవాడిని. ప్రస్తుతం ఫాస్ట్‌ వాకింగ్‌ మాత్రమే చేస్తున్నా. ఇంటి దగ్గర (విశాఖ మ్యూజియం పక్కన) నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు రెండుసార్లు వెళ్లి వస్తా.

book3.3.jpg


ఈ దూరం ఏడెనిమిది కిలోమీటర్లు మేర ఉంటుంది. ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్యలో ఒక దోసె, ఉడకబెట్టిన గుడ్డు తింటా. మధ్యాహ్నం లంచ్‌ 12 గంటల్లోపు పూర్తి చేస్తా. అన్నం, కూర, పప్పు, పెరుగు తింటాను. రాత్రిపూట పూర్తిగా తిండి ఉండదు. గ్లాసు మజ్జిగ మాత్రమే తీసుకుంటా. గతంలో కొన్నాళ్లపాటు పాలు తీసుకునేవాడిని. కొన్ని ఇబ్బందులు రావడంతో మానేశా. రాత్రిపూట తీసుకునే ఆహారం వల్ల శరీరంలో ఫ్యాట్‌ పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదని బలంగా నమ్మి, భోజనం పూర్తిగా మానేశా. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఎనిమిది గంటలకు నిద్రపోతా.


ఆస్పత్రికి వెళ్లింది లేదు...

సాధారణంగా 60 ఏళ్లు దాటిన తరువాత అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఆరోగ్యకరమైన అలవాట్లతో నాకు ఇప్పటివరకూ ఆస్పత్రికి వెళ్లే అవసరం రాలేదు. ఆ మధ్య ఒకసారి కాలికి చిన్న ఫ్యాక్చర్‌ అయితే చూపించుకున్నా. అంతకుమించిన అనారోగ్య సమస్యలేవీ లేవు.షుగర్‌, బీపీ అస్సలు లేవు. టెన్షన్స్‌ పెట్టుకోను. ఎటువంటి విపత్తు వచ్చినా ప్రశాంతంగా ఉంటా. ఎటువంటి పరిణామాన్నైనా సానుకూలంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నా. ఆదివారం పూర్తిగా రిలాక్స్‌ అవుతా. పుస్తకాలు చదువుతా. అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వార్తలు యూట్యూబ్‌లో చూస్తుంటా. ఇంట్లో వ్యాయామం చేసే పరికరాలు ఉన్నాయి. రెండు రోజులకు ఒకసారి వ్యాయామం చేస్తుంటా.

book3.2.jpg


వాకింగ్‌ స్టిక్‌ ... అటకపైనే...

1948లో సత్యవతితో నా వివాహం జరిగింది. ఇప్పుడు ఆమెకు 92 ఏళ్లు. ఆమె కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. నా మాదిరిగానే డైట్‌ పాటిస్తారు. వ్యాయామం వంటివి చేయకపోయినా ఆరోగ్యంగా కొనసాగుతున్నారు. కుమారుడు డాక్టర్‌ సాగర్‌ విహారి అమెరికాలో ఉంటున్నాడు. కుమార్తె పద్మ బెంగళూరులో ఉంటోంది. మరో కుమార్తె జయ యూకేలో గైనకాలజి్‌స్టగా చేస్తోంది. నేను పదవీ విరమణ చేసిన సమయంలో నా కుమారుడు అమెరికా నుంచి వాకింగ్‌ స్టిక్‌ తీసుకువచ్చాడు. వాడు తెచ్చినప్పుడే చెప్పా... దాంతో నాకు పనేంటని. ఆ కర్ర గడిచిన 30 ఏళ్లుగా అటకపైనే ఉంది.


అంతర్జాతీయ పోటీలకు...

కాలేజీ చదువుతున్న రోజుల్లో రన్నింగ్‌, షార్ట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో పట్ల ఆసక్తి ఉండేది. పదవీ విరమణ తరువాత వాటిపై దృష్టి సారించాను. నా గురించి తెలిసిన కొందరు వెటరన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనాలని కోరడంతో 2010లో జిల్లాస్థాయిపోటీల్లో పాల్గొన్నా. ఆ తరువాత రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి అదే ఏడాది మలేషియాలో జరిగిన ‘ఏషియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షి్‌ప’ పోటీలకు వెళ్లాను. 5 కి.మీ రేస్‌ వాక్‌, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గోల్డ్‌ మెడల్స్‌ సాధించా. ఇప్పటిదాకా ఐదు వరల్డ్‌ ఛాంపియన్‌షి్‌పలలో పాల్గొని ఐదు గోల్డ్‌ మెడల్స్‌, మూడు సిల్వర్‌ మెడల్స్‌ సాఽధించాను. ఆరు ఏషియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షి్‌పలలో పాల్గొని 15 గోల్డ్‌మెడల్స్‌, ఐదు సిల్వర్‌, రెండు కాంస్య పతకాలు సాధించా. రెండు నెలల కిందట స్వీడన్‌లో జరిగిన ‘వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌’లో పాల్గొని డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో, షార్ట్‌పుట్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించా. 79 ఏళ్ల వయసు (2002)లో కుమారుడితో కలిసి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించా. ఇదీ నా ట్రాక్‌ రికార్డు’’.

- బూటు శ్రీనివాసరావు, విశాఖపట్టణం

ఫొటోలు: వై.రామకృష్ణ

Updated Date - Dec 01 , 2024 | 07:43 AM