Share News

Harbhajan Singh: మంకీ గేట్ వివాదం.. సైమండ్స్‌తో దిగిన ఆ ఫొటో చాలా మందిని ఆశ్చర్యపరిచింది: హర్భజన్ సింగ్

ABN , Publish Date - Dec 21 , 2024 | 08:47 PM

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 2008 మంకీ గేట్ వివాదంలో పాత్రధారులు. జాతి విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిన ఈ వివాదం ఇద్దరి కెరీర్‌లోనూ మాయని మచ్చగా నిలిచింది. మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు. హర్భజన్, సైమండ్స్ శత్రువులుగా మారిపోయారు.

Harbhajan Singh: మంకీ గేట్ వివాదం.. సైమండ్స్‌తో దిగిన ఆ ఫొటో చాలా మందిని ఆశ్చర్యపరిచింది: హర్భజన్ సింగ్
Harbhajan Singh with Andrew Symonds

అనిల్ కుంబ్లే నేతృత్వంలో 2008లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా (TeamIndia)కు చేదు అనుభవాలను మిగిల్చింది. సిరీస్ ఓటమి మాత్రమే కాకుండా.. ఎన్నో వివాదాలు కూడా రేకెత్తాయి. ముఖ్యంగా మంకీ గేట్ (Monkeygate) వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh), ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) ఈ వివాదంలో పాత్రధారులు. జాతి విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిన ఈ వివాదం ఇద్దరి కెరీర్‌లోనూ మాయని మచ్చగా నిలిచింది. మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు. హర్భజన్, సైమండ్స్ శత్రువులుగా మారిపోయారు.


కొన్నాళ్ల తర్వాత హర్భజన్, సైమండ్స్ ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున కలిసి ఆడారు. ఆ సమయంలో ఆ ఇద్దరూ ఎంతో పరిణితితో వ్యవహరించి శుత్రుత్వానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. స్నేహితులుగా మారిపోయారు. ఇక, 2022లో ఓ కారు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైమండ్స్‌తో స్నేహం గురించి హర్భజన్ మాట్లాడాడు. ``ఒకే జట్టుకు ఆడాల్సిన సమయంలో మేమిద్దరం ఆ వివాదం గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం లేచి కౌగిలించుకున్నాం. అప్పటి ఫొటో బాగా వైరల్ అయి చాలా మందిని ఆశ్చర్యపరిచింద``ని హర్భజన్ చెప్పాడు.


``మా ఇద్దరికీ సంబంధించిన ఆ వివాదాన్ని అందరూ మర్చిపోయేలా మా స్నేహం కొనసాగింది. సైమండ్స్ చనిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. అది నాకు షాకింగ్ వార్త. గత వారం నేను బ్రిస్బేన్‌లో ఉన్నా. ఒకవేళ సైమండ్స్ బతికి ఉండి ఉంటే కచ్చితంగా నేను అతడి ఇంటికి వెళ్లేవాడిని. మా మధ్య అంత అనుబంధం పెరిగింద``ని హర్భజన్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2024 | 08:47 PM