Viral: కామవాంఛలపై కంట్రోల్ కోసం బ్యాడ్మింటన్ ఆడాలి! హాంగ్‌కాంగ్ అధికారుల సూచన
ABN , Publish Date - Aug 27 , 2024 | 05:51 PM
కామవాంఛలపై అదుపు కోసం టీనేజర్లకు హాంగ్‌కాంగ్ అధికారులు తాజాగా చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి. లైంగిక విద్యకు సంబంధించి మార్గదర్శకాల పేరిట అక్కడి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నె్ట్ డెస్క్: కామవాంఛలపై అదుపు కోసం టీనేజర్లకు హాంగ్‌కాంగ్ అధికారులు తాజాగా చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి (Viral). లైంగిక విద్యకు సంబంధించి మార్గదర్శకాల పేరిట అక్కడి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మొత్తం 70 పేజీల డాక్యుమెంట్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రేమలో పడటం, నచ్చిన వారికి శారీరకంగా దగ్గరవడం వంటి విషయాలకు టీనేజర్లు దూరంగా ఉండాలని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, టీనేజ్ జంటలు తమ బంధానికి సంబంధించి కచ్చితమైన సరిహద్దులు నిర్దేశించుకోవాలని సూచించారు.
Viral: హోటల్ లాబీలో మూత్రవిసర్జన చేశాడని ఊస్టింగ్! కోర్టుకెక్కిన ఉద్యోగి!
టీనేజర్లు తమ లైంగిక వాంఛలు అదుపులో పెట్టుకోవాలని, కామోద్రేకం కలిగించే మీడియా, మేగజీన్ల కంటెంట్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ విషయాల నుంచి దృష్టి మళ్లేలా ఎక్సర్‌సైజులు, బ్యాడ్మింటన్ వంటి హాబీల చేపట్టాలని పేర్కొంది. ప్రేమ, కామం మధ్య సంబంధం, టీనేజ్ జంటలు దాటకూడని సరిహద్దులు, లైంగిక ఊహలు, కోరికలకు కళ్లెం వేసే విధానాలు, టీనేజ్‌లో సన్నిహిత సంబంధాలతో కలిగే అనర్థాలపై ఈ మార్గదర్శకాలు వెలువరించింది.
పెళ్లికి ముందే శృంగారం, అవాంఛిత గర్భధారణ, న్యాయపరమైన చిక్కులు, మనసుకు తగిలే గాయాలు వంటి పరిణామాలను టీనేజర్లు తట్టుకోలేరని అధికారులు తమ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాబట్టి, పెళ్లికి ముందు శృంగారానికి దూరంగా ఉండాలని సూచించారు. అవతలి వారిని ఆకర్షించే దస్తులు వేసుకోకూడదని కూడా పేర్కొన్నారు.
కాగా, ఈ మార్గదర్శకాలపై హాంగ్‌కాంగ్‌లోనే విమర్శలు వెల్లువెత్తాయి. పాతకాలం నాటి తిరోగమన సూచనలు చేశారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. టీనేజర్ల లైంగిక వాంఛలను అవమానకరంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న వ్యాఖ్యలు వినబడ్డాయి. ఆరోగ్యకర జీవితానికి కావాల్సిన సూచనలు చేసే బదులు ఇలాంటి మార్గదర్శకాలు విడుదల చేయడం సరికాదని పేర్కొన్నారు. లైంగిక భావాలు కంట్రోల్ చేసుకోవాలని సూచించే బదులు వాటితో ఎలా డీల్ చేయాలో చెప్పుంటే బాగుండేదని ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ ప్రొఫెసర్ డయానా క్వాక్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగూణంగా ఈ సూచనలు లేవని పెదవి విరిచారు.