‘ఐస్‌లాండ్’లో వేడినీటి బుగ్గలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 09:39 AM
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ‘ఐస్‌లాండ్’. చుట్టూ నలువైపులా అంతు లేని జలనిధి. ఓ వైపు మంచు పర్వతాలు, మంచు ఖండాల నుంచి ప్రవహించే నదులుంటే... మరో వైపు అగ్ని పర్వతాలు, అవి విరజిమ్మే లావా ఆశ్చర్యపరుస్తాయి. ఆ విశేషాలే ఇవి...
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ‘ఐస్‌లాండ్’. చుట్టూ నలువైపులా అంతు లేని జలనిధి. ఓ వైపు మంచు పర్వతాలు, మంచు ఖండాల నుంచి ప్రవహించే నదులుంటే... మరో వైపు అగ్ని పర్వతాలు, అవి విరజిమ్మే లావా ఆశ్చర్యపరుస్తాయి. ఆ విశేషాలే ఇవి...
మేము అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి నగరవాస్తవ్యులం. ‘ఐస్‌లాండ్’ విశేషాలు చూడాలని ఆసక్తిగా ఉండేది. మావారు, ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ వేశాం. డెట్రాయిట్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 8న రాత్రి 9 గంటలకు విమానం ఎక్కాం. మరుసటి రోజు తెల్లవారుఝామున ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాం. విమానాశ్రయంలోనే రెంటల్ కార్ సదుపాయం ఉంది. ట్రిప్ పూర్తి చేసుకుని కారును అక్కడే ఇచ్చేయాలి.
మానవ నిర్మిత సరస్సు...
ఎయిర్‌పోర్టు నుంచి కొంతదూరం ప్రయాణించాక ‘బ్లూలాగూన్’ అనే వేడి నీటి సరస్సు కనిపిస్తుంది. ఇది మానవ నిర్మిత సరస్సు. నీటిలో వేడిని పుట్టించి జియో థర్మల్ పవర్‌గా తయారుచేశారు. అందులోకి దిగితే శరీర రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందంటారు. అందుకే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు బ్లూలాగూన్‌లోకి దిగి స్విమ్మింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత మార్గమధ్యలో ఉన్న కొన్ని ప్రాంతాలు చూస్తూ ‘హెల్లా’ అనే ఊరిలో రాత్రి బస చేశాం. మరుసటిరోజు ఉదయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూసేందుకు బయలుదేరాం. గోల్డెన్ సర్కిల్ ప్రాంతంలో నేషనల్ పార్క్ ఉంది. అందులో ధింగ్ వెల్లావతన్ అనే సరస్సును చూసి తీరాల్సిందే. ఇక్కడే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అంటే భూమి మీదకు చొచ్చుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లు. దారికి ఇరువైపులా వ్యాపించి ఉన్న వీటిని యురేషియా టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఐస్‌లాండ్ దాకా వ్యాపించి ఉంటాయి. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.
రోడ్డు మార్గాన వెళ్తుంటే అనేక జలపాతాలు కనువిందు చేస్తాయి. వాటిలో గోల్డెన్ ఫాస్, డెట్టి ఫాస్, గోడా ఫాస్ (‘ఫాస్’ అంటే జలపాతం అని అర్థం) ప్రముఖమైనవి. ఎత్తయిన మంచుకొండలపై నుంచి కిందకు జారే జలపాతాల నీటి తుంపర్లపై సూర్యకిరణాలు ప్రతిఫలించి ఏర్పడే ఇంద్రధనుస్సు అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. చుట్టూ మంచు పర్వతాలు ఉండటంతో వాటి నుంచి మంచుగడ్డలు విరిగి చిన్న చిన్న ముక్కలుగా ‘లాగూన్ లేక్’లో పడి, నీటిలో తేలుతూ సాగిపోతుంటాయి. ఆ నీటిలో బోటు షికారు చేయడం సరికొత్త అనుభూతి. అలాగే కొండ మీదకు ఘాట్‌రోడ్ ఉంది. పైకి వెళితే గ్లేసియర్ (మంచు మైదానం) కనిపిస్తుంది. స్నో మొబైల్ అని పిలిచే టూవీలర్ బైక్‌పై మంచు మైదానంలో సర్రున దూసుకుపోవడం మాటలకు అందని మధురానుభూతి.
హాట్‌స్ర్పింగ్స్ అనేకం...
‘ఐస్‌లాండ్’లో అగ్ని పర్వతాలు కూడా ఉండటం ఆశ్చర్యకరం. ఇక్కడి అగ్నిపర్వతాల నుంచి విరజిమ్మే లావా ప్రభావంతో ఏర్పడిన నీటి మడుగులను ‘కెరిడ్‌క్రేటర్లు’ అంటారు. ఈ నీటి మడుగుల లోతు 180 అడుగులు. ఇవి అత్యంత పురాతన మైనవిగా చెబుతారు. వీటితో పాటు ‘గైజర్లు’ అనే వేడి నీటి సరస్సులు (హాట్ స్ర్పింగ్స్) 70 డిగ్రీల నుంచి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఆవిర్లు కక్కుతూ కనిపిస్తాయి. మధ్యమధ్యలో ఫౌంటెన్‌లాగా నీటిని విరజిమ్ముతూ ఉంటాయి. ఇలాంటి గైజర్లు అనేకం దేశమంతటా వ్యాపించి ఉన్నాయి. వీటి దగ్గరకు సందర్శకులను అనుమతించరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం ‘విక్’ దిశగా సాగింది.
విక్‌లో విచిత్రమేమిటంటే... ఇక్కడి సము ద్రపు ఒడ్డున ఇసుక నల్లగా ఉంటుంది. అందుకే దానిని ‘బ్లాక్‌సాండ్ బీచ్’ అంటారు. సముద్ర తీరంలో నల్లటి ఇసుకలో నడవడం గమ్మత్తుగా అనిపించింది. చాలామంది ఈ వింత బీచ్‌ను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు.
ఈ దేశంలో సాగునీటికి, తాగునీటికి మంచు కొండలే ఆధారం. మంచు కరిగిన నీరేఅంతటా ప్రవహిస్తుంది. వేసవికాలంలో వ్యవసాయం ఊపందుకుంటుంది. బార్లీ, బ్రకోలీ, కూర గాయలను అధికంగా పండిస్తారు. ఐస్‌లాండ్ వాసులంతా మాంసాహారులే. సీఫుడ్‌కు ప్రాధాన్యమిస్తారు. స్థానికులకు చేపల వేట ముఖ్య ఆదాయవనరు. ద్వీపదేశమైన ఐస్ లాండ్ పేరుకు మంచు ప్రదేశమైనా అక్కడి హాట్ స్ర్పింగ్స్‌తో పాటు బీచ్‌లు, హార్బర్లు, పర్వతాలు కనువిందు చేస్తాయి. అద్దెకు తీసుకున్న కారును ఎయిర్‌పోర్టులో వదిలి, మనసు నిండా మధురస్మృతులను నింపుకుని తిరుగు ప్రయాణమయ్యాం.
- అయ్యగారి సుజాతరావు,
ఒహాయో, అమెరికా