Viral: విమానం ఇంటిపై నుంచి వెళుతుండగా చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం! వెళ్లి చూస్తే..
ABN , Publish Date - May 11 , 2024 | 05:08 PM
విమానం నుంచి మంచు ముక్క పడటంతో నేలమీద ఉన్న ఓ మహిళకు చెందిన మేక చనిపోయిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఈ ఘటనతో మేకలను పెంచుకుంటున్న ఆ మహిళకు భారీ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టుకు సమీపంలో నివసిస్తున్న ఓ మహిళకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానం తన ఇంటిపై నుంచి వెళుతుండగా ఏదో కింద పడినట్టు శబ్దం రావడంతో ఆమె వెళ్లి చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. అమెరికాలోని (USA) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
కెసిడీ అనే మహిళ యూటా రాష్ట్రంలో నివసిస్తుంటుంది. ఆమె మేకలను పెంచుతుంటుంది. ఇటీవల ఓ రోజు ఎప్పటిలాగే విమానం ఆమె ఇంటిపై నుంచి వెళుతుండగా పెద్ద శబ్దం అయ్యింది. భారీ శబ్దంతో భూమి కంపించినట్టు అనిపించడంతో ఆమె భయభ్రాంతులకు గురైంది. ఏం జరిగిందోనని గాబరా పడుతూ గబగబా బయటకు వచ్చి చూసింది (Huge Chunk Of Ice Falls From Passing Aeroplane And Crushes Goat To Death).
Viral: ఆవలిస్తే ఇలాక్కూడా జరుగుతుందా? యువతికి ఊహించని షాక్!
బయట మేకలను పెట్టేందుకు వేసిన షెడ్డుకు పెద్ద చిల్లు కనిపించింది. దీంతో, ఆమె అక్కడికి వెళ్లి చూడగా ఓ మేక తీవ్రగాయాలతో చచ్చి కనిపించింది. మేక పక్కనే ఓ భారీ మంచు ముక్క కూడా కనిపించింది. దాదాపు ఫుట్ బాల్ బంతి సైజులో ఉన్న ఐస్ ముక్క కనిపించింది. దీంతో, మంచుగడ్డ విమానం నుంచి పడిందని నిర్ధారించుకున్న మహిళ పౌర విమానయాన శాఖ అధికారులకు విషయం చెప్పింది.
ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు విమానం నుంచే మంచుముక్క పడినట్టు నిర్ధారించారు. దీంతో, మహిళ అప్పటి నుంచి విమానం శబ్దం వినిపిస్తేనే చాలు ఉలిక్కిపడే స్థితికి చేరుకుంది. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలీక భయపడిపోతున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది.