Viral Video: అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడిన గ్రామ సర్పంచ్.. షాక్ అయిన ఐఏఎస్ ఆఫీసర్
ABN , Publish Date - Sep 17 , 2024 | 02:16 PM
భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చక్కటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయని మెచ్చుకుంటుంటారు. ఉన్నత చదువులు చదువుకున్నవారిలో కూడా కొందరు ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేరు.
భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చక్కటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయని మెచ్చుకుంటుంటారు. ఉన్నత చదువులు చదువుకున్న కొందరు ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేరు. చాలా ఇబ్బందిపడుతుంటారు. ఇక గ్రామీణ స్థాయిలో ఉండే ఒక సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడతారని ఊహించలేం. ఓ సర్పంచ్ ఇంగ్లిష్ మాట్లాడిన తీరుతో ఐఏఎస్ టాపర్ టీనా దాబీ ఆశ్చర్యపోయారు.
రాజస్థాన్ బార్మర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టీనా దాబీ గౌరవ అతిథిగా వెళ్లారు. సభావేదికపై ఆహ్వానించిన మహిళా సర్పంచ్ సోను కన్వర్ అంతా ఆంగ్లంలోనే మాట్లాడారు. రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి వేదికపై చక్కగా ఆంగ్లం మాట్లాడుతున్న సర్పంచ్‌ను టీనా దాబి చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు.
‘‘ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్‌కి స్వాగతం పలుకుతాను. ఒక మహిళగా టీనా మేడమ్‌ని స్వాగతించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ఇంగ్లిష్‌లో సోను కన్వర్ మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నీటి సంరక్షణపై ఇంగ్లిష్‌లో మాట్లాడారు. సర్పంచ్ ఇంగ్లిష్ మాట తీరు అందరినీ కట్టిపడేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
టీనా దాబీ 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) సివిల్స్ టాపర్‌గా నిలిచారు. తొలి ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఐఏఎస్‌గా కెరీర్ అజ్మీర్‌లో ప్రారంభమైంది. అక్కడ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఈ నెల ప్రారంభంలో బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇదివరకు జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. టీనా దాబీ చెల్లెలు రియా దాబీ కూడా 2020లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించారు.