Share News

అన్నిట్లోనూ అసాధ్యుడే..

ABN , Publish Date - Nov 24 , 2024 | 07:49 AM

‘మీకు ఆడేందుకు టైమ్‌ ఉంటుందా? చదివేందుకు తీరిక దొరుకుతుందా..? అసలు తినేందుకూ..?’ అనంటే డోనాల్డ్‌ ట్రంప్‌ ఒప్పుకోడు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నాసరే.. గోల్ఫ్‌ ఆడందే రోజు గడవదు. పుస్తకం తిరగేయందే నిద్రపట్టదు. పిల్లలతో ఆటలాడకుంటే మనసొప్పు కోదు... ట్రంప్‌ అన్నిట్లోనూ అసాధ్యుడే!

అన్నిట్లోనూ అసాధ్యుడే..

‘మీకు ఆడేందుకు టైమ్‌ ఉంటుందా? చదివేందుకు తీరిక దొరుకుతుందా..? అసలు తినేందుకూ..?’ అనంటే డోనాల్డ్‌ ట్రంప్‌ ఒప్పుకోడు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నాసరే.. గోల్ఫ్‌ ఆడందే రోజు గడవదు. పుస్తకం తిరగేయందే నిద్రపట్టదు. పిల్లలతో ఆటలాడకుంటే మనసొప్పు కోదు...

ట్రంప్‌ అన్నిట్లోనూ అసాధ్యుడే!

- గోల్‌లోనే కాదు.. గోల్ఫ్‌లోనూ..

ట్రంప్‌ వ్యాపారం.. ప్రపంచమంత సువిశాలమైనది!. అందుకే ఆటస్థలం కూడా అంతే విశాలంగా ఉండాలని కోరుకునే విలాస పురుషుడాయన. వందల ఎకరాల్లోని పచ్చిక బయళ్లలో గోల్ఫ్‌ ఆడటం ట్రంప్‌కు చాలా ఇష్టం. ఎన్నికల ప్రచారం, కంపెనీల మీటింగులప్పుడు తప్ప.. ప్రతి రోజూ గోల్ఫ్‌ ఆడందే నిద్రపట్టదట. కుబేరుడు కాబట్టి ఏదో కాలక్షేపానికి ఆడతారనుకుంటే పొరబాటు. ఆయన చాలాసార్లు క్లబ్‌ ఛాంపియన్‌షిప్స్‌ గెలిచారు. ఎన్నికలప్పుడు స్వయంగా ఆయనే ‘‘నాకు గోల్ఫ్‌ పెద్ద తలనొప్పిగా మారిందే..’’ అంటూ తన ఆసక్తిని బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించాక ఆదివారం పూట తన మనవరాళ్లు కై ట్రంప్‌, చోలే ట్రంప్‌లతో కలసి గోల్ఫ్‌ ఆడారు ట్రంప్‌. ఈ విషయాన్ని గోల్ఫర్‌ అయిన కై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అన్నట్లు ట్రంప్‌కు సొంతంగా మూడు ఖండాల్లో 18 గోల్ఫ్‌ మైదానాలున్నాయ్‌!.


పిల్లలతో పిల్లాడై..

ట్రంప్‌ది జగమంత కుటుంబం. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఐదు మంది పిల్లలు. పదిమంది మనవళ్లు, మనవరాళ్లు. ఇంతమంది పిల్లల్లో చిన్నపిల్లాడైపోయి హాయిగా ఆడుకుంటారు ట్రంప్‌. ‘‘నన్ను జస్ట్‌ తాతయ్యగా మాత్రమే చూసేవాళ్లు వీళ్లే కదా..’’ అంటూ తన మీద తనే ఛలోక్తి విసురుకునే హాస్య చతురత ఆయన సొంతం. ఖాళీ సమయాల్లో ‘‘రండి.. రండి..’’ అంటూ పిల్లలకు ప్రేమతో క్యాండీలు ఇస్తారు. సోడాలు తాగిస్తారు. ‘‘ఇంట్లో మాతో ఆడుకోవడమే కాదు.. పాఠశాలల్లో ఎలా చదువుతున్నామో కూడా ఆరాతీస్తారు తాతయ్య. మాకు మంచి మార్కులొచ్చినా.. ఆటల్లో గెలిచినా ఉప్పొంగిపోతాడాయన. నోటీసుబోర్డుల్లో అంటించిన కాగితాలను ఫొటోలు తీసుకుని.. తన స్నేహితులకు మా గురించి మురిపెంగా చెబుతారు..’’ అంటారు పిల్లలు.

sun4.2.jpg


- చదవడం ఆయన బలం..

ఒకవైపు వ్యాపారం... మరో వైపు రాజకీయం.. సమయం ఎక్కడుంటుంది? అనంటే ట్రంప్‌కు చాలా కోపం. ఎందుకంటే ఆయన మనందరికంటే బిజీ.... అయినా సరే పుస్తకాలు చదవటానికి మాత్రం సమయం కేటాయిస్తారు. ట్రంప్‌ పుస్తకాలపురుగు. ‘‘నాలో పఠనాభిలాషను పెంపొందించింది ‘హోలి బైబిల్‌’. మీరు కూడా తప్పక చదవండి’’ అంటూ అమెరికన్లకు పదేపదే చెబుతుంటారు. అప్పట్లో ఆయన చదివిన ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ (రచయిత : సన్‌ట్జు) గురించి చెబుతూ.. ‘ఈ పుస్తకంలోని యుద్ధ వ్యూహాలను మన వ్యక్తి గత జీవితాలకు కూడా అన్వయించుకోవచ్చు. మీ కెరీర్‌ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంద’ని సూచించారాయన. నికొలో మాకియవెల్లి ‘ది ప్రిన్స్‌’, రెబెక్కా డి కోస్టా ‘ది వాచ్‌మన్‌ రాటిల్‌’, జాఫ్రి కోల్విన్‌ ‘టాలెంట్‌ ఈజ్‌ ఓవర్‌ రేటెడ్‌’ వంటి అద్భుత పుస్తకాలను తాను చదివినట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు ట్రంప్‌.

sun4.3.jpg


- పిజ్జా.. కోక్‌.. ఏదైనా సై...

ఆరవై ఏళ్లు దాటితే చాలు.. చిన్న స్వీటు ముక్క తినాలంటే వెయ్యి లెక్కలు వేస్తారు మధుమేహులు. ట్రంప్‌ అవేమీ పట్టించుకోరు. తిండి విషయంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ.. తినాలనిపించింది మాత్రం తినేస్తారు. నోటిని కట్టుకోరు. ఈ వయసులో కూడా ఆయన ఫాస్ట్‌ఫుడ్‌ ప్రియుడే! మెక్‌డొనాల్డ్‌ బర్గర్‌, కెఎఫ్‌సీ చికెన్‌ వేపుళ్లు, పిజ్జా, డైట్‌కోక్‌ లంటే అమితంగా ఇష్టపడతారు. ‘‘పేరున్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఎక్కడికెళ్లినా ఒకే రుచి, ఒకే నాణ్యత, శుభ్రత ఉంటుంది. వీరు పాటించే ఆహార ప్రమాణాల వల్లే నేను వాటిలో తింటుంటాను..’’ అంటారు ట్రంప్‌. పిజ్జా మధ్యలోని స్లైస్‌ తినేసి చివర్ల ఉండే పదార్థాన్ని వదిలేయడం ఆయనకు అలవాటు.

Updated Date - Nov 24 , 2024 | 07:49 AM