Share News

...‘స్మార్ట్‌హోమ్‌’ వేరయా...

ABN , Publish Date - Nov 24 , 2024 | 08:49 AM

‘ఆఫీసుకు బయలుదేరే కంగారులో ఇంట్లో ఏసీ, లైట్లు ఆఫ్‌ చేయలేదా?’... ఆందోళన అవసరం లేదు. ‘నాలుగు రోజులు ఊరెళుతున్నాం... మొక్కలకు నీళ్లు ఎలా?’... చింతించాల్సిన పనిలేదు.‘ఇంటికి బంధువులొచ్చారు. మీరేమో ఆఫీసులో ఉన్నారు. లాక్‌ తీయడమెలా?’... టెన్షన్‌ పడాల్సిన పని లేదు.

...‘స్మార్ట్‌హోమ్‌’ వేరయా...

‘ఆఫీసుకు బయలుదేరే కంగారులో ఇంట్లో ఏసీ, లైట్లు ఆఫ్‌ చేయలేదా?’... ఆందోళన అవసరం లేదు. ‘నాలుగు రోజులు ఊరెళుతున్నాం... మొక్కలకు నీళ్లు ఎలా?’... చింతించాల్సిన పనిలేదు.‘ఇంటికి బంధువులొచ్చారు. మీరేమో ఆఫీసులో ఉన్నారు. లాక్‌ తీయడమెలా?’... టెన్షన్‌ పడాల్సిన పని లేదు.

మీ ఇల్లు స్మార్ట్‌హోమ్‌ అయితే చాలు. ఆ పనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. అంతెందుకు... మిమ్మల్ని నిద్రలేపేందుకు కిటికీ తెరలు వాటికవే తెరుచుకుంటాయి. ఏసీ అడ్జస్ట్‌ అవుతుంది. మ్యూజిక్‌ ఆన్‌ అవుతుంది. కాఫీ మెషిన్‌ వేడెక్కుతుంది. జీవనవిధానాన్ని మరింత సుఖమయం చేస్తోన్న ఆధునిక టెక్నాలజీ ఇది. ‘హోమ్‌ ఆటోమేషన్‌’... ఇప్పుడొక సెన్సేషన్‌!


ఇంటికి సంబంధించిన అన్ని పనులకు ఈ కాలంలో మీరు ఇంట్లోనే ఉండాల్సిన పనిలేదు. ఆఫీసులో ఉన్నా ఒకే ఒక్క ఫోన్‌ సందేశంతో ఇంట్లో ఏసీ, లైట్లు ఆఫ్‌ చేయవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా, లేకపోయినా కుండీల్లో ఉన్న సెన్సర్లు తేమ శాతాన్ని గుర్తిస్తూ మొక్కలకు అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసేలా చేస్తాయి. మీరు సూపర్‌మార్కెట్‌లో ఉన్నా వైఫై ఎనేబుల్డ్‌ ఫ్రిజ్‌ లోపల ఏమున్నాయో ట్రాక్‌ చేసి మీ ఫోన్‌కి సందేశం పంపుతుంది. ట్యాంకులో నీళ్లు అయిపోతే వెంటనే మోటర్‌ ఆన్‌ అవుతుంది. ట్యాప్‌ల్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే నీటి సరఫరా నిలిచిపోతుంది. గ్యాస్‌ కొద్దిగా లీక్‌ అయినా మీ ఫోన్‌కి అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. మీరు ఇంటికి చేరుకునే సమయానికి ఇంట్లో ఉష్ణ్గోగ్రతలు కోరుకున్న విధంగా ఉంటాయి. మిమ్మల్ని నిద్రలేపేందుకు మ్యూజిక్‌ ఆన్‌ అవుతుంది. కిటికీ తెరలు తెరుచుకుంటాయి. ఇలా ఒకటేమిటి... డోర్‌ లాక్‌, అన్‌లాక్‌, వేడి వేడి కాఫీ సిద్ధం చేయడం, ఇంటి సెక్యూరిటీ... చివరికి ప్లంబింగ్‌ పనులు కూడా స్మార్ట్‌హోమ్‌ ఆటోమేషన్‌ వ్యవస్థతో సులభంగా జరిగిపోతున్నాయి.


స్మార్ట్‌హోమ్‌ ఆటోమేషన్‌ అంటే...

ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్లను, గృహోపకరణాలను స్మార్ట్‌ఫోన్‌ లేక ట్యాబ్‌ సహాయంతో నియంత్రించే వ్యవస్థను ‘స్మార్ట్‌హోమ్‌ ఆటోమేషన్‌ సిస్టమ్‌’ అని పిలుస్తారు. ఇంట్లో ఉన్న రకరకాల ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలన్నీ ఒక నెట్‌వర్క్‌తో అనుసంధానించబడతాయి. ఆ నెట్‌వర్క్‌ సహాయంతో రిమోట్‌గా ఆపరేట్‌ చేస్తూ నియంత్రించే వీలుంటుంది. లైటింగ్‌, సెక్యూరిటీ, ఉష్ణోగ్రత, ఎంటర్‌టైన్‌మెంట్‌, గీజర్‌, ఏసీ, వాషింగ్‌ మెషీన్‌... వంటివన్నీ రిమోట్‌గా నియంత్రించడం సాధ్యమవుతుంది. అంటే స్మార్ట్‌ఫోన్‌ లేక ట్యాబ్‌తో వీటన్నింటినీ ఆపరేట్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ కంట్రోల్డ్‌ హోమ్‌ ఆటోమేషన్‌ వ్యవస్థని ఎంచుకుంటే వాయిస్‌ ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుంది.

sun5.2.jpg


పక్కా సెక్యూరిటీ మీకు తెలియకుండా ఈగ కూడా మీ ఇంట్లోకి ప్రవేశించకూడదనుకుంటే ... స్మార్ట్‌హోమ్‌ ఆటోమేషన్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ సహాయంతో 24/7 ఇంటిని రిమోట్‌గా మానిటర్‌ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో తలుపులు, కిటికీలను వర్చువల్‌గా నియంత్రించవచ్చు. ఈ సిస్టమ్‌లో సెక్యూరిటీ కెమెరాలు, మోషన్‌ డిటెక్టర్లు, తలుపులు, కిటికీల దగ్గర బ్యాటరీ ఆపరేటెడ్‌ సెన్సర్లు ఉంటాయి. ఇవన్నీ సెంట్రల్‌ నెట్‌వర్క్‌ కంట్రోలర్‌తో అనుసంధానపరచి ఉంటాయి. ఎవరైనా అపరిచితుడు ఇంట్లోకి ప్రవేశించాలని చూస్తే సిస్టమ్‌ అలర్ట్‌ నోటిఫికేషన్‌ను పంపిస్తుంది. సిస్టమ్‌ రికార్డింగ్‌ను బ్యాకప్‌గా పెట్టుకోవచ్చు. ఈ సిస్టమ్‌ని ప్రత్యేకమైన సమయంలో ఆఫ్‌ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.


లైటింగ్‌ మీ ఇష్టం

సూర్యాస్తమయం కాగానే ఇంటి ఆవరణలో లైట్లు వేస్తాం. ఇంట్లో ఉంటే ఫరవాలేదు. ఇంట్లో లేకపోతే... అంతా చీకటే. అయితే ఆటోమేషన్‌ వ్యవస్థ ఉంటే సూర్యాస్తమయం కాగానే ఆటోమెటిక్‌గా లైట్లు వెలిగేలా సెట్‌ చేసుకోవచ్చు. ఇది మీ ఇంటిని ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంచుతుంది. టీవీ చూస్తున్నట్లయితే ఆటోమెటిక్‌గా లైట్లు డిమ్‌ అయ్యేలా చేసుకోవచ్చు. ఇది రిలాక్సింగ్‌ అనుభూతిని అందించడంతో పాటు వాతావరణాన్ని కంఫర్టబుల్‌గా ఉంచేందుకు దోహదం చేస్తుంది. రిమోట్‌గా ఇంట్లో ఉన్న లైట్లను ఆన్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన సమయంలో ఆఫ్‌ అయ్యేలా టైమర్‌ సెట్‌ చేసుకోవచ్చు. బెడ్‌ టైమ్‌లో లైట్స్‌ని డిమ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. విద్యుత్‌ బిల్లును తగ్గించుకోవడంలో స్మార్ట్‌హోమ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లైటింగ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీ సిస్టమ్‌తో సింక్రనైజ్‌ అయి పనిచేస్తుంది. మీరు ఇంటికి చేరుకుని డోర్‌ తెరవగానే లైట్స్‌ ఆటోమేటిగ్గా ఆన్‌ అవుతాయి. ఇంటికి లాక్‌ చేసి బయటకు వెళితే ఇంట్లో లైట్స్‌ అన్నీ ఆఫ్‌ అవుతాయి. ఒకవేళ సెక్యూరిటీ సిస్టమ్‌ బ్రేక్‌ ఇన్‌ను గుర్తించినట్టయితే వాటంతట అవే ఇంట్లో లైట్లన్నీ వెలుగుతాయి.

sun5.3.jpg


నీళ్ల చిక్కులకు చెక్‌...

ట్యాంకులో నీళ్లు ఉన్నాయా లేదా అని చెక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. మోటర్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోతే ట్యాంక్‌ నిండిపోతుందన్న ఆందోళన లేదు. ఎందుకంటే సెన్సర్లు గుర్తించి ఆ పనిని చురుగ్గా చేసి పెడతాయి. ట్యాంకులో నీటి లెవెల్స్‌ తగ్గిపోగానే ఆటోమెటిక్‌గా మోటర్‌ ఆన్‌ అవుతుంది. అలాగే ట్యాంక్‌ పై వరకు నీళ్లు నిండగానే మోటర్‌ దానికదే ఆఫ్‌ అవుతుంది. పైపుల్లో ఎక్కడైనా నీటి లీకేజీ జరిగినా కూడా వెంటనే నీటి సరఫరా ఆగిపోతుంది. అంతేకాదు ఆ విషయం గురించి ఫోన్‌కి అలర్ట్‌ రూపంలో సందేశం వస్తుంది. ప్లంబింగ్‌లో ఆటోమేషన్‌ అనేది నీటి ఆదాతో పాటు విద్యుత్‌ బిల్లును ఆదా చేస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించేలా చేస్తుంది.


మొక్కల సంరక్షణలో కూడా...

మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ వాటికి నీళ్లు పోసేందుకు సమయం ఉండదు. అలాంటి వారు ఆటోమేషన్‌ సిస్టమ్‌ని ఎంచుకుంటే చాలు. ఇండోర్‌ మొక్కలైనా, అవుట్‌డోర్‌ మొక్కలైనా వాటి నీటి బాధ్యతను ఈ సిస్టమ్‌ తీసుకుంటుంది. మొక్క పాదు దగ్గర మట్టిలో సెన్సర్లు అమర్చడం ద్వారా అవసరమైనప్పుడు నీటి సరఫరా జరిగేలా సిస్టమ్‌ చూస్తుంది. మట్టి కాస్త ఎండగానే సిస్టమ్‌ సిగ్నల్స్‌ను పంపి నీటి సరఫరాను ఆన్‌ చేస్తుంది.

sun5.4.jpg

గది వాతావరణం నచ్చినట్టుగా...

బయట వాతావరణం ఎలా ఉన్నా మీకు సంబంధం లేదు. మే నెలలో వీచే వడగాలులైనా, డిసెంబరులో వణికించే చలైనా మీ గదిలో మాత్రం ఏ మార్పు ఉండదు. గదిలో మీకు నచ్చే విధంగా వాతావరణాన్ని క్రియేట్‌ చేసుకోవచ్చు. ‘క్లైమెట్‌ కంట్రోల్‌’ సిస్టమ్‌ ఇందుకు ఉపకరిస్తుంది. సీజన్‌కు అనుగుణంగా గది వాతావరణం ఉండేలా సెట్‌ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో ఫోన్‌లో నుంచే సిస్టమ్‌ ఆఫ్‌ చేయవచ్చు. ఆఫీసు నుంచి బయలుదేరే ముందు సిస్టమ్‌ని ఆన్‌ చేయడం ద్వారా ఇంటికి చేరుకోగానే రిలాక్స్‌ అవ్వొచ్చు. హీటర్స్‌, ఫ్యాన్స్‌, ఏసీ, ఎయిర్‌ ప్యూరిఫైర్లు.... ఇలా అన్నీ ఈ సిస్టమ్‌లో నియంత్రించబడతాయి. థర్మోస్టాట్స్‌ సహాయంతో ఇంట్లో ఎప్పుడూ ఉష్ణోగ్రత అనుగుణంగా, హాయిగా ఉంటుంది. ఇంట్లో లేనప్పుడు ఆఫ్‌ చేసుకోవడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది.


వంటగదిలో...

ఉదయం బెడ్‌పై నుంచి నిద్ర లేవగానే ఎవరైనా కాఫీ రెడీ చేస్తే బాగుండు అనుకుంటాం. మరి ఆ పని చేసి పెడుతుంది ఇంటెలింజెంట్‌ కిచెన్‌. ఉదయం మీరు నిద్ర లేచే సమయానికి కెటిల్స్‌, కాఫీ మెషీన్‌ వాటికవే ఆన్‌ అవుతాయి. ఆటోమేటిక్‌ ఎయిర్‌ ఫ్రైయర్లు, ఫుడ్‌ ప్రాసెసర్లు, టోస్టర్లు... ఇలా అన్నీ ఉపకరణాలు ఆటోమేషన్‌ వ్యవస్థను కలిగి ఉంటాయి. గిన్నెలు శుభ్రం చేసే డిష్‌ వాషర్లు సైతం ఆటోమెటెడ్‌ హోమ్‌ సిస్టమ్‌తో అనుసంధానమై అలర్ట్‌ సందేశం పంపిస్తాయి. వైఫై ఎనేబుల్డ్‌ ఫ్రిజ్‌ లోపల ఉన్న ఆహారపదార్థాలను ట్రాక్‌ చేస్తూ నోటిఫికేషన్లు పంపిస్తుంది. షాపింగ్‌ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

స్మోక్‌, ఫైర్‌ డిటెక్టర్‌

ఇంట్లో కూడా కొన్నిసార్లు అగ్నిప్రమాదాలు సంభవించొచ్చు. అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఉపయోగపడే వ్యవస్థ ఇది. ఇంట్లో తప్పక ఉండాల్సిన సెక్యూరిటీ సిస్టమ్‌. ‘స్మోక్‌ అండ్‌ ఫైర్‌ డిటెక్టర్లు’ ఇంట్లో వాతావరణాన్ని 24 గంటలూ మానిటర్‌ చేస్తూ ఉంటాయి. పొగను గుర్తిస్తే వెంటనే ఫోన్‌కి అలర్ట్‌ సందేశాన్ని పంపిస్తాయి. దీనివల్ల తక్షణమే స్పందించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటెలింజెంట్‌ స్మోక్‌ డిటెక్లర్లు గ్యాస్‌ లీకేజీని సైతం గుర్తిస్తాయి.


వినోదం మరింత ఆనందమయంగా...

టీవీ, హోమ్‌ థియేటర్‌, మ్యూజిక్‌ సిస్టమ్స్‌, ఎక్సర్‌సైజు పరికరాలు అన్నీ ప్రోగ్రామ్‌ చేయబడి ఉంటాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్‌ చేయడం సులువు. మీకునచ్చిన సమయంలో మ్యూజిక్‌ అన్‌ అయ్యేలా సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. కావాల్సినవి ముందే లిస్ట్‌ చేసుకోవచ్చు. ఏ రోజు, ఏ సినిమా చూడాలనేది కూడా ముందే లిస్టవుట్‌ చేసుకుంటే ఆ సమయానికి ఎంజాయ్‌ చేయడమే.

sun5.5.jpg

కిటికీ తెరలు సైతం...

అలారం మాత్రమే కాదు... గదిలో పడే వెలుతురు కూడా నిద్రలేపుతుంది. ఉదయం ఆరు కాగానే కిటికీ తెరలు కాస్త తెరుచుకుంటాయి. మరో అరగంట తరువాత కిటికీ తెరలు పూర్తిగా తెరుచుకుంటాయి. దీనివల్ల గదిలో వెలుతురు పూర్తిగా వచ్చేస్తుంది. సాయంత్రం గదిలోకి ఎండ పడకుండా కిటికీ తెరలు మూసుకుంటాయి. ఈ పనంతా ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. స్మార్ట్‌ మోటరైజ్డ్‌ బ్లైండ్స్‌ని అమర్చుకుంటే చాలు. కిటికీ తెరలు ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు మూసుకోవాలి అనేది మీరు సెట్‌ చేసుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది. వీకెండ్స్‌లో నిద్ర డిస్టర్బ్‌ కాకుండా ఉండేలా కూడా సెట్‌ చేసుకోవచ్చు.


వాయిస్‌తోనే అన్నీ...

హోమ్‌ అటోమేషన్‌కు సంబంధించి ఎలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా దాన్ని వాయిస్‌ కమాండ్స్‌తో నియంత్రించుకోవడం ఇప్పుడు సాధ్యమవుతోంది. టెక్నాలజీ రంగంలో ఇది గొప్ప మార్పుగా నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో ఫోన్‌ ఉపయోగించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయంగా వాయిస్‌ కంట్రోల్‌ సిస్టం పనికొస్తుంది. మొత్తానికి రెగ్యులర్‌ హోమ్‌ స్మార్ట్‌ హోమ్‌గా మారితే... పనులన్నీ చూపుడువేలితో, నోటిమాటతోనే చిటికెలో జరిగిపోతాయి. పైగా భద్రతతో పాటు మానసిక ప్రశాంతతకు ‘స్మార్ట్‌హోమ్స్‌’ నిలయాలుగా మారుతున్నాయి.

- సండేడెస్క్‌


ఎన్నెన్నో ప్రయోజనాలు

సౌలభ్యం : స్మార్ట్‌హోమ్‌ వ్యవస్థ వల్ల రోజు వారి పనులు సులువుగా పూర్తి చేసుకోవచ్చు. సమయం ఆదా అవుతుంది. కష్టపడాల్సిన అవసరం లేదు.

విద్యుత్‌ ఆదా: థర్మోస్టాట్స్‌, లైటింగ్‌, ఎలక్ర్టానిక్‌ ఉపకరణాల అనుసంధానం వల్ల విద్యుత్‌ వాడకం తగ్గిపోతుంది. ఫలితంగా బిల్లు ఆదా అవుతుంది.

సెక్యూరిటీ : ఇంటిని రిమోట్‌గా గమనించవచ్చు. స్మార్ట్‌లాక్స్‌, సెక్యూరిటీ కెమెరాలతో పూర్తి భద్రత లభిస్తుంది. ఇంటి యజమానికి ప్రశాంతత దొరుకుతుంది.

సౌకర్యం : అభిరుచి, మూడ్‌కు తగినట్టుగా ఇంట్లో ఉష్ణోగ్రతలు సెట్‌ చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్‌ సెట్టింగ్స్‌తో సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.


కొన్ని ఆటోమేషన్‌ సిస్టమ్స్‌ ఇవి...

అమెజాన్‌ ఎకో విత్‌ అలెక్సా

స్మార్ట్‌హోమ్‌కు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. వాయిస్‌ యాక్టివేటెడ్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ సహాయంతో స్మార్ట్‌ డివైజ్‌లను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్‌, వాతావరణ సమాచారం, రిమైండర్స్‌ పెట్టుకోవచ్చు. అలెక్సాను అడిగి గదిలో లైట్స్‌ని డిమ్‌గా మార్చుకోవచ్చు. అమెజాన్‌ ఎకో రకరకాల స్మార్ట్‌ డివైజ్‌లతో అనుసంధానం అవుతుంది.

గూగుల్‌ నెస్ట్‌ హబ్‌

వాయిస్‌ యాక్టివేటెడ్‌ అసిస్టెంట్‌తో పాటు స్మార్ట్‌ డిస్‌ప్లే ఉన్న ఆటోమేషన్‌ సిస్టమ్‌ ఇది. దీని సహాయంతో స్మార్ట్‌ డివైజ్‌లను సులభంగా కంట్రోల్‌ చేయవచ్చు. సెక్యూరిటీ కెమెరా ఫీడ్‌ని చెక్‌ చేసుకోవచ్చు. థర్మోస్టాట్‌ని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ టీవీని స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు.


యాపిల్‌ హోమ్‌ కిట్‌

ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌లో నుంచి స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌లను నియంత్రించేందుకు వీలు కల్పిస్తుంది. మల్టిపుల్‌ డివైజ్‌లతో అనుసంధానం అవుతుంది. లైట్స్‌, డోర్‌ లాక్స్‌, టెంపరేచర్‌ అడ్జస్ట్‌మెంట్‌ వంటివన్నీ ‘సిరి’కి వాయిస్‌ కమాండ్‌ ఇవ్వడం ద్వారా చేసుకోవచ్చు. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది.

సామ్‌సంగ్‌ స్మార్ట్‌థింగ్స్‌

ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న అన్ని డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్‌ చేసుకోవచ్చు. లైట్స్‌, థర్మోస్టాట్స్‌, కెమెరాలను నియంత్రించవచ్చు. ఉదాహరణకి నిద్ర లేచే 6 గంటల సమయానికి ‘గుడ్‌మార్నింగ్‌’ పేరుతో ఒక దినచర్యను క్రియేట్‌ చేసి, ఆ సమయానికి లైట్స్‌ ఆన్‌ కావడం, థర్మోస్టాట్‌ అడ్జస్ట్‌మెంట్‌, ఇష్టమైన మ్యూజిక్‌ ప్లే కావడం వంటివన్నీ జరిగేలా సెట్‌ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు నిద్రలేచే సమయానికి లైట్స్‌ వెలగడం, మ్యూజిక్‌ ఆన్‌ కావడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.


ఫిలిప్స్‌ హ్యూ లైటింగ్‌

ఇంట్లో స్మార్ట్‌లైటింగ్‌ సిస్టమ్‌ని నియంత్రించడానికి ఫిలిప్స్‌ హ్యూ యాప్‌ పనికొస్తుంది. మీ అభిరుచికి, మూడ్‌కి తగిన విధంగా లైట్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకి ‘మూవీనైట్‌’ పేరుతో ఒక దినచర్య క్రియేట్‌ చేసుకుని లైట్స్‌ డిమ్‌లోకి మారేలా పెట్టుకోవచ్చు.

ఎకోబీ స్మార్ట్‌ థర్మోస్టాట్‌

విద్యుత్‌ ఆదా చేయడంలో గేమ్‌ ఛేంజర్‌గా దీన్ని అభివర్ణిస్తారు. అడ్వాన్స్‌డ్‌ సెన్సర్ల సహాయంతో గది ఆక్యుపెన్సీని గుర్తించి అందుకు తగిన ఉష్ణోగ్రతలను అడ్జస్ట్‌ చేస్తుంది. ఎకోబీ యాప్‌ సహాయంతో రిమోట్‌గా ఉపయోగించవచ్చు.

ఆగస్ట్‌ స్మార్ట్‌ లాక్‌ ప్రో

ఇంటి డోర్స్‌ని రిమోట్‌గా లాక్‌, అన్‌లాక్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు ఆఫీసులో ఉన్న సమయంలో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే రిమోట్‌గా యాక్సెస్‌ను ఇచ్చే వీలు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగించవచ్చు.

Updated Date - Nov 24 , 2024 | 08:49 AM