గిరిజన ‘టాటూ’ను బతికిస్తోంది!
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:46 AM
గిరిజనుల ముఖం, చేతులు, కాళ్లపై రకరకాల పచ్చబొట్లు అందంగా కనిపిస్తాయి. తరతరాలుగా ఆయా తెగల్లో కొంతమంది అనుభవజ్ఞులు వాటిని వేసేవారు. అయితే అంతరించిపోతున్న ఆ కళను పట్టుకుని, ఆధునిక టాటూలకు దీటుగా... అద్భుత ప్రతిభ కనబరుస్తూ, అంతర్జాతీయ కీర్తిని అందుకోవడం మారావి మంగళబాయికి మాత్రమే సాధ్యమైంది.
గిరిజనుల ముఖం, చేతులు, కాళ్లపై రకరకాల పచ్చబొట్లు అందంగా కనిపిస్తాయి. తరతరాలుగా ఆయా తెగల్లో కొంతమంది అనుభవజ్ఞులు వాటిని వేసేవారు. అయితే అంతరించిపోతున్న ఆ కళను పట్టుకుని, ఆధునిక టాటూలకు దీటుగా... అద్భుత ప్రతిభ కనబరుస్తూ, అంతర్జాతీయ కీర్తిని అందుకోవడం మారావి మంగళబాయికి మాత్రమే సాధ్యమైంది. మధ్యప్రదేశ్‌లోని (లాల్‌పూర్) బైగా తెగకు చెందిన ఈ గిరిజన టాటూ ఆర్టిస్టు ఈ ప్రత్యేకమైన ‘కళ’ గురించి చెబుతున్న విశేషాలివి...
‘
‘అనాదిగా నుదురు, కాళ్లు, చేతులు, పొట్ట మీద, వీపు మీద... ఇలా శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకునే సనాతన సంప్రదాయం మాది. ఆకుపసరుతో పాటు అడవిలో దొరికే రకరకాల మూలికలతో ఈ టాటూలను వేస్తారు. మా పెద్దక్కలకు ఎవరికీ ఈ కళ అబ్బలేదు. అయితే వారి ఒంటి మీద మాత్రం పచ్చబొట్లుండేవి. నాకు చదువు అబ్బలేదు కాబట్టే ఈ విద్య నేర్చుకునే అవకాశం దక్కిందేమో. ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని కావటంతో నన్ను తీసుకుని ఊరిలో మా అమ్మ శాంతిబాయి పచ్చబొట్లు పొడవటానికి వెళ్లేది. నేను ఆమె వేస్తున్న పచ్చబొట్లను జాగ్రత్తగా గమనించేదాన్ని. ఒక్కోసారి పచ్చబొట్లు సరిగా వేసేది కాదు. సాధన లేకపోవటం వల్ల తప్పులు చేసేదని తర్వాత నాకర్థమయ్యింది.
పైగా వయసు కూడా మళ్లటంతో ఆమె చేతులు వణికేవి. దాంతో నెమ్మది నెమ్మదిగా తన బాధ్యతను నేను తీసుకున్నా. తొలిసారిగా ఏడేళ్ల చిన్నారి కాలికి పచ్చబొట్టు వేశా. అలా ఈ కళను నేర్చుకోవడం మొదలెట్టిన. మా తెగలో అబ్బాయిలను ఆకర్షించటానికి అమ్మాయిలు వీపు మీద పచ్చబొట్టు వేయించుకుంటారు. పచ్చబొట్టు వేస్తేనే అమ్మకు ఇంత తిండి పెట్టేదాన్ని. అందుకే ఈ పనిలో నైపుణ్యం సాధిస్తూ వచ్చా. క్రమక్రమంగా పచ్చబొట్టు చిత్రాలను కాగితం, కాన్వాసు, గోడలపై గీయడం అలవాటు చేసుకున్నా. దాంతో ఒక ఆర్టిస్టుగా నాకు ఆహ్వానాలు అందడం మొదలయ్యింది.
వయసును బట్టి..
బైగా తెగకు చెందినవాళ్లు ఏడేళ్ల నుంచి టాటూలతోనే ఐడెంటిఫై అవుతారు. చేతులు, కాళ్లు, నుదుటి మీద... అగ్ని, చేప, నెమలి, పూలు, గింజలు, ఆకులు, పాములు, తేనేటీగలతో పాటు సంస్కృతీ, సంప్రదాయలు, పురాతన చిత్రాలను పచ్చబొట్లుగా వేయించుకుంటారు. వాటిని ఎంతో నేర్పుతో, ఓపికగా ఎలాంటి రసాయనాలు ఉపయోగించ కుండా సూదులతో పచ్చబొట్టుగా వేస్తాను. పిల్లలు, టీనేజ్, మధ్య వయస్కులు, పిల్లలను కన్న తర్వాత మహిళలు వక్షస్థలం మీద కూడా టాటూలు వేయించుకుంటారు. అరవై ఏళ్లు దాటిన వాళ్లు చిన్న చుక్కల్లాంటి డిజైన్లను ఇష్టపడతారు. ఇలా దశలను బట్టి పచ్చబొట్లను ఇష్టంగా పొడిపించుకుంటారు.
నమ్మకానికి ప్రతీకగా..
పచ్చబొట్లను ఆయా వరుసలు, త్రిభుజాకారం, వజ్రాకారం, చుక్కలు, వృత్తాలు రూపంలో వేస్తాను. నెగిటివ్ ఫోర్స్‌తో పాటు దెయ్యాలు బెదిరిపోతాయనే ఆలోచనతోనే మా తెగలో చాలామంది మహిళలు దైవ ప్రతీకల్లాంటి టాటూలను వేయించుకుంటారు. ఆకుపసర్లు, పుల్లలు, సూదులతో పచ్చబొట్లను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. టాటూ వేసేప్పుడు సహజంగానే నొప్పి కలుగుతుంది. నొప్పిని ఓర్చుకోవటం బలానికి ప్రతీకగా మహిళలు భావిస్తారు.
గుంపులో పెద్దగా, నాయకుడిలా ఉండే పురుషులు యోధుల రూపంలో పచ్చబొట్లు కావాలంటారు. మోడ్రన్ ఆర్ట్స్ అనేక ప్రభావాలు, పార్టీలు, ఇజాలతో ఉంటుంది. అయితే మేం అడవితో అనుబంధం ఉండే టాటూలనే వేయించుకుంటాం. అంతరించి పోతున్న ‘బైగా ట్రైబల్ టాటూ ఆర్ట్’ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు చేశా. మా కళను ముందుకు తీసుకెళ్తున్నందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇకపోతే నేను ఈ ట్రైబల్ టాటూలను ఉత్సాహవంతులకు నేర్పిస్తా. ఈ కళను మనదేశంలోనే కాకుండా ఆస్ర్టేలియా, అమెరికా లాంటి దేశాల్లో ప్రమోట్ చేశా. ఈ కళ నాతోనే అంతం కాకుండా ప్రభుత్వ సహకారంతో మా బైగా పచ్చబొట్టు కళను బతికించి.. తద్వారా మా తెగ ఆనవాళ్లను సజీవంగా ఉంచాలన్నదే నా కల. మోడ్రన్ టాటూలు అందంగా కనిపించొచ్చు కానీ నేను వేసే సాంప్రదాయ టాటూలు అర్థవంతంగా ఉంటాయి. ఈ కళ ఒకరకంగా మన మూలాల్లోకి వెళ్లడం లాంటిదే.’’