Share News

Diwali Special: టపాసులు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఈజీగా మోసపోతారు

ABN , Publish Date - Oct 30 , 2024 | 06:21 PM

ప్రతి ఏడాది రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ధరలు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీపావళికి టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు ధరకంటే టపాసుల ధరను అమాంతం పెంచి కొందరు విక్రయిస్తున్నారు. అన్ని దుకాణాల్లో టపాసుల ధరలు..

Diwali Special: టపాసులు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఈజీగా మోసపోతారు
Diwali Crackers

దీపావళి వచ్చిందంటే చాలు టపాసుల కోసం క్యూకడతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు అంతా ఆసక్తి చూపిస్తారు. దీంతో దీపావళికి వారం రోజుల ముందునుంచే టపాసుల దుకాణాలు తెరుస్తారు. ప్రతి ఏడాది రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ధరలు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీపావళికి టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు ధరకంటే టపాసుల ధరను అమాంతం పెంచి కొందరు విక్రయిస్తున్నారు. అన్ని దుకాణాల్లో టపాసుల ధరలు ఒకేలా ఉండవు. ఒక్కో దుకాణంలో ఒకో రకంగా ఉంటాయి. అందుకే టపాసులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా టపాసుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే బ్రాండ్లు కూడా ఉంటాయి. బ్రాండ్ కంటే కూడా టపాసులు ఎప్పుడు తయారుచేశారనేది చాలా ముఖ్యం. అంటే మనం కొనే టపాసులు తాజావా కాదా అనేది చూసుకోవాలి. కొంతమంది రెండు, మూడేళ్ల క్రితం లేదా గత ఏడాది సేల్ కాని టపాసులను ఈ దీపావళికి విక్రయిస్తారు. దీంతో కొన్ని ఇంటికి పట్టికెళ్లిన తర్వాత సరిగ్గా పేలవు. దీంతో అనవసరంగా డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే టపాసులు కొనేటప్పుడు తయారీ సంవత్సరాన్ని తప్పకుండా చూసుకోవాలి. అదే సమయంలో బాక్స్ ఓపెన్ చేసి చూడటం బెటర్. లేదంటే బాక్స్ లోపల టపాసులు పాడై ఉండవచ్చు. అందుకే టపాసులు కొనే సమయంలో తప్పకుండా నాణ్యతను ఓసారి చూడాల్సి ఉంటుంది. లేదంటే నిల్వ టపాసులను విక్రయించే అవకాశం లేకపోలేదు.


ధరల విషయంలో..

టపాసులు కొనేటప్పుడు ఎక్కువమంది ధరల విషయంలో మోసపోతుంటారు. అసలు ధరకంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఎంఆర్‌పిని ముద్రిస్తారనే విషయాన్ని టపాసుల విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోల్సి ఉంటుంది. తయారీ ధర వంద రూపాయిలైతే ఎంఆర్‌పి సాధారణంగా రూ.500 వరకు ఉంటుంది. అందుకే టపాసులను ఎంఆర్‌పికి కొంటే కొనుగోలుదారుడు తప్పనిసరిగా మోసపోయినట్లే.


గిఫ్ట్ ప్యాక్‌ల రూపంలో..

ప్రస్తుతం చాలా దుకాణాల్లో వివిధ రకాల టపాసులను ఒక బాక్సుగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో రూ.వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు టపాసుల ప్యాక్‌లు అందుబాటులో ఉంటున్నాయి. టపాసులను విడిగా కొనుగోలు చేయడం లాభమా.. గిఫ్ట్ ప్యాక్‌లను కొనుగోలు చేయడం లాభమా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఈ సమయంలో ఏది లాభమో మనమే అంచనా వేసుకోవాలి. వాస్తవానికి టపాసులు మనం పిల్లల కోసం కొనాలనుకుంటున్నామా.. పెద్దల కోసం కొనాలనుకుంటున్నామో ఓ అంచనా ఉండాలి. పిల్లల కోసం అయితే ఓ రకమైనవి, పెద్దల కోసం ఎక్కువ శబ్ధం (పేలే) టపాసులు కొంటుంటా. కానీ గిఫ్ట్ ప్యాక్‌లో అన్ని రకాలు కలిపి ఉంటాయి. వాటిని కొనడం వలన మనం పేల్చని టపాసులు అందులో ఉండొచ్చు. కొంతమంది కేవలం పిల్లల కోసమే టపాసులు కొనాలనుకుంటారు. అటువంటి సమయంలో కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, పెన్సిల్స్, తాళ్లు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు వంటివి కొనాలనుకుంటారు. అదే గిఫ్ట్ ప్యాక్‌లో మనకు కావల్సిన టపాసులకంటే ఇతర టపాసులు ఎక్కువుగా ఉంటే ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే గిఫ్ట్ ప్యాక్ కొనేసమయంలో ఎంత ధరకు విక్రయిస్తున్నారు. మనకు అవసరమైనవి అందులో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ గిఫ్ట్ ప్యాక్‌లో మనకు అవసరమైనవి లేకపోతే విడిగా టపాసులు కొనుగోలు చేయడం బెటర్. టపాసులు కొనేసమయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటే మోసపోయే అవకాశాలు తక్కువుగా ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 30 , 2024 | 06:21 PM