Share News

పదండి పోదాం.. పల్లె పర్యాటకానికి..!

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:33 AM

‘టూర్‌... అంటే ఏమిటి?’.. ఎత్తయిన కొండలు.. లోతైన కోనలు.. చెట్లు పుట్టలు.. అరణ్యాలు.. పచ్చటిపొలాలు.. గలగలాపారే సెలయేర్లు, కిలకిలమనే పక్షులు.. అబ్బురపరిచే జంతువులు.. ఇవేగా!.

పదండి పోదాం.. పల్లె పర్యాటకానికి..!

‘టూర్‌... అంటే ఏమిటి?’..

ఎత్తయిన కొండలు.. లోతైన కోనలు.. చెట్లు పుట్టలు.. అరణ్యాలు.. పచ్చటిపొలాలు.. గలగలాపారే సెలయేర్లు, కిలకిలమనే పక్షులు.. అబ్బురపరిచే జంతువులు.. ఇవేగా!.

మరివన్నీ మీ ఊర్లోనే పెట్టుకుని మళ్లీ ఎక్కడికెక్కడికో వెళ్లడం ఎందుకు?... నగరజీవితంలో ఉక్కపోతను అనుభవిస్తున్న వలసజీవికి ఇప్పుడీ కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అందుకే మళ్లీ పల్లె పిలుస్తోందంటూ గ్రామాల్లో వాలిపోతున్నారు ఆధునికులు. ఫలితంగా ‘రూరల్‌ టూరిజం’ కొత్తపుంతలు తొక్కుతోంది..


‘రూరల్‌ టూరిజం’ అంటే పల్లె పర్యాటకం అని అర్థం. సాధారణంగా మనం ఒక రాష్ర్టానికో, దేశానికో వెళ్తే అక్కడి ప్రధాన ముఖ్య పట్టణాల్లోనో, నగరాల్లోనో లేదంటే ప్రాచుర్యం పొందిన ప్రదేశాల్లోనో వాలిపోతాం. అంటే మనందరి దృష్టిలో పర్యాటకం అంటేనే- ప్రసిద్ధ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, సముద్రతీరాలు, జంతుప్రదర్శన శాలలు, మ్యూజియంలు, భారీకట్టడాలు, సాహసయాత్రలు, హోటళ్లు, మాల్స్‌ ఇవే అనుకుంటాం! పైకి కనువిందు చేసేవన్నీ.. ఆ ప్రాంత సంస్కృతిఅనే భ్రమలో ఉండిపోతాం. అది పొరపాటు. ఒక ప్రాంత స్వభావాన్ని తెలుసుకోవాలంటే.. పల్లె మూలాల్లోకి వెళ్లాలి. అలా మనల్ని అసలుసిసలు లోకంలోకి తీసుకెళ్లేదే ‘రూరల్‌ టూరిజం’. పల్లెల్లోకి వెళ్లడం అంటే.. భారతీయ మూలాల్లోకి ప్రవేశించడం. దేశ అంతరాత్మను అర్థం చేసుకోవడం.. అక్కడున్న వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానం.. గ్రామీణులు అవలంభించే పద్ధతులను తెలుసుకోవడం.. పల్లె చరిత్ర.. అక్కడి తిండి.. పండుగలు.. ముఖ్యంగా పల్లె అందాలు.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవటం.. ఒక్కమాటలో ‘బ్యాక్‌ టు రూట్స్‌..’

అన్నమాట. అలా పల్లె మూలాల్లోకి వెళ్లి మట్టి పరిమళాన్ని ఆస్వాదించే నయా ట్రెండ్‌ రూరల్‌ టూరిజం..!.


అలా వచ్చిందీ ఐడియా...

‘అరణ్యం’.. మనందరి పురాతన ఆవాసం. ఆదిమకాలంలో అక్కడి నుంచే బయలుదేరాం. అందుకే అడవిలోకి వెళుతూనే మన పుట్టింటికి వచ్చామన్న ఆనందంతో ఉప్పొంగిపోతాం. ఒత్తిడినంతా మరిచిపోతాం. మనిషి మనుగడ ఆ అడవిలోని పల్లె నుంచే.. పచ్చని చెట్ల మధ్య నుంచే మొదలైంది. మనమెంత నాగరీకులమైనా పల్లె పదాలు, పల్లెతనం లోలోపల అలాగే ఉండిపోయింది. మన జీవనవిధానంలో అడుగడుగునా ఆ పల్లె సహజత్వం తొణికిసలాడుతుంది. ట్రాఫిక్‌ రొణగొణ ధ్వనులు, భరించలేని కాలుష్యం, బతుకు పోరాటంలోని సమస్యల నుంచి కాస్త దూరంగా వెళ్లి సేద తీరాలంటే పల్లె ఒక్కటే స్వర్గధామం. అక్కడున్న స్వచ్ఛమైన వాతావరణమే అసలైన ప్రాణవాయువు. మన దేశంలో పట్టణాలు, నగరాలు అభివృద్ధి జరుగుతున్న సమయంలోనే (1980,1990) రూరల్‌ టూరిజం మొదలైంది. అయితే ఈ ఐడియా మాత్రం ‘అగ్రి టూరిజం’తో ప్రారంభమైందని చెప్పవచ్చు. పల్లెకు వెళ్లి అక్కడ వ్యవసాయం చేస్తుంటే చూడటం.. ఆ పనిలో దిగి ఆనందించడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉండేది. అలా అగ్రి టూరిజం కాస్త యూటర్న్‌ తీసుకుని రూరల్‌ టూరిజంగా రూపాంతరం చెందింది. కొత్త అవతారంతో ఆకర్షిస్తోందిప్పుడు.

book4.2.jpg


మూలాలను మరవొద్దనే..

‘పల్లెలే ఈ దేశానికి పట్టుగొమ్మలు’ అన్నారు మహాత్మాగాంధీ. పల్లెటూర్ల నుంచి పట్నానికి ఉద్యోగం, డబ్బు సంపాదన కోసం పయనమయ్యే వారు అధికశాతం ఉన్నారు. అయితే సంక్రాంతి, ఉగాది, దసరా లాంటి పండుగలకు ఊరుబాట పట్టేవారెందరో. ఇక బడి సెలవులు వచ్చినప్పుడు మాత్రం పల్లెలో సేదతీరటానికి నగరజీవులు కుటుంబంతో కలిసి గ్రామాలకు వెళుతుంటారు. ఇలాంటి సందర్భంలో పల్లె వారసత్వాన్ని కాపాడటం కోసం.. పల్లె సంస్కృతీ సంప్రదాయలను మరింత పదిలంగా ఉంచటం కోసం.. పల్లెజీవనాడిని పట్టుకుంది కేంద్రప్రభుత్వం. ‘రూరల్‌ టూరిజం’ అంటూ గ్రామాలను పట్టించుకుంటూనే.. స్థానికులకు ఉపాధి కల్పన చేయటమే ప్రభుత్వ లక్ష్యం. తద్వారా కొంతైనా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చన్నది సర్కారు ఆలోచన. అందుకే స్వచ్ఛందసంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీలు వంటివన్నీ పల్లెకు వెళ్లి సేవ చేయాలని కేంద్ర పర్యాటక శాఖ పిలుపునిచ్చింది.


ప్రతి గ్రామం.. వైవిధ్యభరితం..

కేంద్రప్రభుత్వం పల్లెకు పోదామనే నినాదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ క్రతువులో భాగం కావాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో రూరల్‌ టూరిజం ఉంది. అండమాన్‌ నికోబార్‌, పాండిచ్చేరి, గోవా లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ ధోరణి విస్తరించింది. రాజస్థాన్‌లోని ఎడారిలో ఒంటెలు కాసే వ్యక్తితో మాట్లాడటం.. అస్సాంలోని గిరిజన జీవితాలను తిలకించటం.. కేరళలోని పల్లెల్లోకి చిన్న బోట్‌లో వెళ్లి అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించటం.. దేశ సరిహద్దులోని బెంగాళీ పల్లెలకు వెళ్లి అక్కడి పండుగలను చేసుకోవటం.. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లికి వెళ్లి బొమ్మలు చేసే కళాకారులను పలకరించటం.. మహబూబ్‌నగర్‌లో మేకలు కాసుకునే అమ్మాయిని మాట్లాడించటం.. రూరల్‌ టూరిజంలో భాగమే. పట్టణాల్లో, నగరాల్లో తిరిగే జనాలు తమ జీవన విధానం బోర్‌కొట్టి పల్లెల్లో నేచర్‌వాక్‌ చేయటం.. అక్కడి స్పైసీఫుడ్‌ను తింటూ కళ్లెంబడి నీళ్లు దిగటం.. అక్కడి జానపదాలను ఆస్వాదించటం.. పల్లెలో ఉండే ఒక నిశ్శబ్దాన్ని గుండెలోకి నింపుకోవడం వంటి అనుభవాలను కొంతమంది ఎంజాయ్‌ చేస్తారు. అలాంటి వారికి మంచి అనుభవం అయితే ఇక పల్లెలోని కల్చర్‌ను చూపించే యువతకు ఇదో మంచి ఉపాధి అవకాశం.

book4.3.jpg


ఉభయ రాష్ర్టాల్లో ఉవ్వెత్తున..

నాగాలాండ్‌లోని ‘ఖొనమా’ పల్లె దేశంలోనే తొలి ‘గ్రీన్‌ విలేజ్‌’గా ఎంపికైంది. అక్కడి అంగామి గిరిజన తెగ వ్యవసాయ పద్ధతులు, సంస్కృతి చూడటానికి టూరిస్టులు కదిలారు కాబట్టే ఆ రికార్డు అందుకుంది. అస్సోంలోని ‘మజులి’, ఒడిశాలోని ‘పిపిలి’, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ‘జీరో వ్యాలీ’, గుజరాత్‌ రాష్ట్రంలోని ‘కచ్‌’ ప్రాంతాల్లో రూరల్‌ టూరిజం బాగా ప్రాచుర్యం పొందింది. పల్లె ప్రయాణాలకు ప్రాణవాయువుగా నిలిచే రాష్ట్రం కేరళ. వయనాడ్‌, కోజికోడ్‌, మున్నార్‌, మలప్పురం, కొట్టాయం.. ఇలా ఎక్కడ చూసినా రూరల్‌ టూరిజానికి మంచి రూట్‌ మ్యాప్‌ వేసింది కేరళీయులే. ఇందుకూ కారణముంది. దేశస్వర్గధామంగా పేరుగాంచిన కేరళలో టూరిజం అనే పదం పురాతనమైనది. ‘రూరల్‌ టూరిజం’ అనే పదం వైరల్‌ కాకముందే పల్లెలోకి టూరిస్టులను నడిపించిన సారధులు వీళ్లు.


ఇక మన ఉభయ రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని తాళ్లపాక (కడప), గండికోట (కడప), చెక్కబొమ్మలకు ప్రసిద్ధి అయిన ఏటికొప్పాక (అనకాపల్లి జిల్లా), అనంతగిరి (అరకు), అల్లికలకు పేరుగాంచిన నరసాపురం (పశ్చిమ గోదావరి), లేపాక్షి, లంబసింగి, పుత్తూరు, బాపట్ల ఈస్ట్‌.. ఇలా రూరల్‌ టూరిజానికి డెస్టినేషన్స్‌. ఇక తెలంగాణలో పోచంపల్లి (యాదాద్రి జిల్లా), వెంకటాపూర్‌ రామప్ప దేవాలయం (ములుగు), గుంజేడు(వరంగల్‌), భద్రాద్రి, కీసరగుట్ట, మేడారం .. ఇలా దాదాపు డెబ్భయ్‌ పైనే రూరల్‌ టూరిజం స్పాట్స్‌ ఉన్నాయి. పల్లె పర్యాటకంలో భాగంగా విడిది చేసేందుకు హోమ్‌స్టేలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మూడు చోట్ల, తెలంగాణలో కొండగట్టు హరిత హోటల్‌, యాదాద్రి భువనగిరిలో కూడా హోమ్‌ స్టేలు ఉన్నాయి. ఇలా హోమ్‌స్టే ఇవ్వటం వల్ల ఆ ఇంటి యజమానులకు కొత్త సంపాదన మార్గం అవుతుంది. త్వరలో ఈ హోమ్‌స్టేల సంఖ్యను మరింత పెంచనుంది కేంద్రప్రభుత్వం.

book4.4.jpg


వర్కవుట్‌ అవుతుందా?

రూరల్‌ టూరిజం వల్ల రాత్రికి రాత్రే పర్యాటక స్వరూపం మారిపోదు. అయితే కొత్తచూపు మొదలవుతుంది. పర్యాటకం పట్ల చూసే కోణం మారుతుంది. పల్లెల్లో ఉపాధికల్పన మెరుగవుతుంది. ఫలానా ఊరికి టూరిస్టులు వస్తారంటే అక్కడ నీళ్లు, తిండి, కొన్ని రకాల వస్తువులు అమ్మే చిన్న దుకాణాలు వస్తాయి. దీనివల్ల ఆ పల్లె సంపద పెరుగుతుంది. సాంస్కృతిక చరిత్రను కాపాడటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా చేయటం వల్ల ఎకో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుంది. ప్రకృతిని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తారు స్థానికులు. పర్యావరణ జీవసమతుల్యం దెబ్బతినదు. ఇదేదో బావుందేనని పట్టణాల్లోని కొందరు పల్లెబాట పడతారు. దీనివల్ల అక్కడ సదుపాయాలు తప్పక పెరుగుతాయని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇక సమస్యల విషయానికి వస్తే.. పల్లెల్లో టూరిస్టుల సంఖ్య ఎక్కువయితే వసతుల సమస్యలు ఎదురవుతాయి. రూరల్‌ టూరిజాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించటమే కాదు.. కేరళ, నాగాలాండ్‌, జమ్మూ కశ్మీర్‌ లాంటి రాష్ర్టాల్లోలాగ స్థానికుల సహకారం అవసరం. పల్లె ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తేనే.. రూరల్‌ టూరిజం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడిప్పుడే మనదేశంలో కేరళ, నాగాలాండ్‌, జమ్మూ కశ్మీర్‌ లాంటి రాష్ర్టాల్లో విదేశీ యాత్రీకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎకో టూరిజం, వైల్డ్‌ టూరిజం, రూరల్‌ టూరిజం.. పేరు ఏదైనా మనిషి తన మూలాల్ని వెతుక్కుంటూ.. మళ్లీ పల్లె బాట పడుతున్నాడన్నది అక్షరసత్యం. దీనిని బట్టి చూస్తే వలసలు పల్లె నుంచి నగరాలకే కాదు.. నగరాల నుంచి పల్లెలకు కూడా వెళ్లే రోజులు మళ్లీ వస్తున్నాయని మాత్రం చెప్పవచ్చు. రానున్న రోజుల్లో పల్లెలు కూడా ‘స్టార్‌’ వసతులతో మెరిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

- సండే డెస్క్‌


- మనదేశంలో 400 పైగా రూరల్‌ టూరిజం పల్లెలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 220కి పైచిలుకు హోమ్‌స్టేలు ఆయా గ్రామాల్లో ఉన్నాయి. వీటిలో పర్యాటకులు బస చేయొచ్చు. కేంద్రం ఏటా బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ ప్రాంతాలను ప్రకటిస్తోంది. అవార్డులనూ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో హంపి, లేపాక్షి.. తెలంగాణలో చండ్లపూర్‌, పెంబర్తి గ్రామాలు గతేడాది ప్రకటించిన జాబితాలో చోటు సంపాదించాయి.

book4.5.jpg

- ప్రాచీన రోమ్‌, గ్రీక్‌లోని ధనికులకు నగర జీవితం బోర్‌ కొట్టి పల్లెల్లోని తమ సొంత ఎస్టేట్స్‌కు వెళ్లేవారు. అక్కడ వ్యవసాయమే వారికి కాలక్షేపం. దాంతో చక్కటి విశ్రాంతి లభించేది. పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక నగర జీవితం నుంచి కాసేపు అయినా తప్పించుకుని ..


విశ్రాంతి పొందడానికి ఇంగ్లండ్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌లలో రూరల్‌ టూరిజం పేరుతో అక్కడి జనం పల్లెబాట పట్టారు. 1950 నుంచి 1960 సంవత్సరాల మధ్యలో ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్‌ దేశ ప్రజలు అగ్రి టూరిజం పేరుతో కూడా పల్లెల్లోకి వెళ్లేవారు. సెలవులొచ్చినా, వేడుకలు జరిగినా పల్లెకు పయనమయ్యేవారట. అంటే రూరల్‌ టూరిజం ఇప్పుడొచ్చింది కాదు.. కొన్నేళ్ల కిందటి నుంచి ఉన్నదేనన్న మాట!.

- రూరల్‌ టూరిజాన్ని అర్థవంతమైన పర్యాటకంగా మార్చేసిన దేశాల్లో ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇండియా, చైనా, జపాన్‌, బ్రెజిల్‌, అమెరికా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పోర్చుగల్‌, ఆస్ర్టేలియా, టర్కీ, థాయ్‌లాండ్‌ ముఖ్యమైనవి.


భలే ఆదాయం..

‘‘సంప్రదాయ పర్యాటకం కంటే పల్లె పర్యాటకం బాగా విస్తరిస్తున్నది’’ అంటోంది యూరోపియన్‌ యూనియన్‌. ఇక్కడ పన్నెండు శాతం రూరల్‌ టూరిజానిదే హవా. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల్లో పల్లె పర్యాటకం ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్క ఫిన్‌లాండ్‌ దేశం రూరల్‌ టూరిజంతో ఏడాదికి 1.4 బిలియన్‌ యూరో డాలర్లను సంపాదిస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌, కాలిఫోర్నియాల్లో వైన్‌ టూరిజం ఎక్కువ. అక్కడ ఫామ్‌ల్యాండ్స్‌లోనే పర్యాటకులు విడిది ఏర్పాటు చేసుకుంటారు. అమెరికాలోని వ్యవసాయశాఖ.. ‘ఏడాదికి 8 బిలియన్‌ డాలర్లు పల్లెటూరిజం నుంచే వస్తోంద’ంటోంది. కెన్యా, వియత్నాం, చైనాతో పాటు మనదేశంలోనూ భవిష్యత్‌లో రూరల్‌ టూరిజం బాగా వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాతనే దాదాపు అన్ని దేశాల్లోని నగరజీవులు పల్లెలకు వెళ్లడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. నగరాలకు దూరంగా ఉండే పల్లెల్లోనూ నివసిస్తున్నారు. రూరల్‌ టూరిజానికి ప్రాధాన్యం ఉంది కాబట్టే దాదాపు అన్ని దేశాలు వీటికి ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయిస్తుండటం విశేషం.


పర్యాటకం పలు రకాలు...

ఎకో టూరిజం.. ప్రకృతి ఒడిలో సేద తీరడం, విడిది చేయటం.. ఎకో టూరిజం. ప్రకృతి పట్ల అవగాహన పెంచటం, పర్యావరణాన్ని కాపాడుకోవటం వీటి లక్ష్యాలు. కెన్యా, న్యూజిలాండ్‌, టాంజానియా, అమెరికా.. ఇలా పలు దేశాలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి. అభయారణ్యాలను తిలకించడం, అమెజాన్‌ లాంటి వర్షారణ్యాలలో పర్యటించడం.. టాంజానియాలోని దట్టమైన అడవులు, విశాలమైన మైదానాల్లో నివసించే జంతువులను చూడటం.. జాతీయ ఉద్యానవనాల్లో విహరించడం వంటివన్నీ చేస్తుంటారు ఎకో టూరిస్టులు.

డార్క్‌ టూరిజం..

చరిత్రలోని చీకటి కోణాలను... అంటే యుద్ధక్షేత్రాలు.. మరణాలు, ప్రకృతి ప్రకోపాలు, విషాదాలకు నెలవైన మరుభూమిని చూడటమే ఈ టూరిజం ఉద్దేశ్యం. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి, న్యూయార్క్‌ సిటీలోని ట్విన్‌ టవర్స్‌, గ్యాస్‌ దుర్ఘటన జరిగిన భోపాల్‌లను చూడటం... ఆ చారిత్రక విషాదాలను తెలుసుకోవడం. సిరియా, ఇరాన్‌, ఆప్ఘనిస్తాన్‌, ఉక్రెయిన్‌ వంటి కల్లోల దేశాల్లో పర్యటించటం.. డార్క్‌ టూరిజం కోవలోకే వస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం కొంత రిస్క్‌తో కూడుకున్నదే అయినా వెళ్లే వాళ్లు ఉన్నారు.


మెడికల్‌ టూరిజం

ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో మెరుగైన వైద్యం లభించడం లేదు. పాకిస్తాన్‌, శ్రీలంక వంటి దేశాల పరిస్థితీ ఇంతే! అందుకే వైద్య చికిత్స కోసం ఆ దేశాల వారు ఇండియాకు వస్తుంటారు. ఇక్కడ చౌకధరల్లో చికిత్సలు చేయించుకుని వెళతారు. ఇలా ఆరోగ్యరీత్యా వైద్యం కోసం రావడం మెడికల్‌ టూరిజం కిందికి వస్తుంది. మనదేశంతో పాటు థాయ్‌లాండ్‌, టర్కీ, మెక్సికో దేశాలకు కూడా వెళ్తుంటారు ఇలా.

వెల్‌నెస్‌ టూరిజం

ఇప్పుడు ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రపంచం ఇష్టపడుతోంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్సలు, థెరపీలు, మర్దనలను ఇష్టపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అందుకే స్పా సర్వీసులు, వెల్‌నెస్‌, డిటాక్స్‌ సెంటర్లు ఎక్కువవుతున్నాయి. వీటన్నిటికీ భారత్‌ పెట్టింది పేరు. బాలి, థాయ్‌లాండ్‌లలో కూడా ఈ తరహా టూరిజం అభివృద్ధి చెందింది.


హెరిటేజ్‌ టూరిజం

వివిధ దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, పెళ్లిళ్లు చూడటానికి ఈ టూరిస్టులు వస్తారు. ముఖ్యంగా పురాతన కట్టడాలు, ప్రాంతీయ హస్తకళలు చూడటం కూడా ఈ టూరిజంలో ముఖ్యమైన భాగం.

అడ్వెంచరస్‌ టూరిజం

పర్వతారోహణ, సాహసక్రీడలు ఉత్సాహపరుస్తాయి. ధనికులు, క్రీడాకారులు, సాహసవంతులకు ఇష్టమైనది అడ్వెంచర్‌ టూరిజం. హాట్‌బెలూన్లలో వెళ్లడం, హైకింగ్‌, స్కైవాక్‌, స్కూబాడైవింగ్‌, బంగీజంప్‌లు కొట్టడం... వంటివన్నీ ఈ పర్యాటకం కిందికే వస్తాయి. మన దేశంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఇలాంటి వెసులుబాటు ఉంది.

Updated Date - Dec 15 , 2024 | 08:33 AM