జీవితం మేడీజీ
ABN , Publish Date - Nov 17 , 2024 | 10:29 AM
నేను కథలు రాస్తానని మా బంధువుల్లో, స్నేహితుల్లో చాలామందికి తెలుసు. కొందరు అప్పడప్పుడు వాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి, దీన్ని నువ్వు చక్కని కథగా రాయవచ్చు అంటుంటారు.
నేను కథలు రాస్తానని మా బంధువుల్లో, స్నేహితుల్లో చాలామందికి తెలుసు. కొందరు అప్పడప్పుడు వాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి, దీన్ని నువ్వు చక్కని కథగా రాయవచ్చు అంటుంటారు.
మా పెద్దనాన్నయితే చనువుగా ‘ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు నా అనుభవాలు చెబుతాను, నీవే వాటిని రాసి పత్రికలకు పంపాలి’ అంటుంటాడు.
నేను నవ్వి ఊరుకుంటాను.
మనకు అలా ఒకరు చెబితే కథ రాయాలనిపించదు కదా!
ఫలానా వాళ్ళ గురించే కథ రాయాలని ఎందుకనిపిస్తుందీ అంటే సమాధానం చెప్పలేం! వాళ్ళ జీవితంలో మనల్ని చలింపచేసే కొన్ని సంఘటనలో, నివ్వెర పరచే ఆలోచనలో, ఉత్తేజపరిచే సందర్భాలో ఎదురైనప్పుడు కథగా రాద్దామనిపిస్తుంది. అది కూడా అన్నివేళలా నిజం కాకపోవచ్చు. మనకు వీళ్ళ గురించి చెప్పాలి, రాయాలి అని ఎందుకనిపిస్తుందో ఇదమిద్ధంగా చెప్పడం కష్టం.
ఎందుకోగానీ నాకు రాజ్యలక్ష్మమ్మ గారి గురించి కథ రాయాలని చాలా ఏళ్లనుండి అనిపించేది. ఎప్పుడో పదేళ్ళ నుండి అనుకుంటుంటే ఈ మధ్యన ఇంక వాయిదాలు వేయకూడదనీ, తప్పకుండా రాయాలనీ నిర్ణయించుకున్నాను.
ఆమె నన్ను చిన్నప్పుడు మురిపెంగా పెంచిందన్న అభిమానంతో రాయాలనిపిస్తుందో, లేక ఐదుమంది ఆడపిల్లలతో సంసారాన్ని ఎదురీది విజేతగా నిలిచినందుకు రాయాలనిపిస్తుందో లేక ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతూ ఏ సమస్యనయినా ఎదుర్కొనే పోరాటపటిమ పట్ల ఆరాధనో, లేక ఎప్పుడూ వర్తమానంలో జీవించే పరిణితి సాధించినందుకో ...
నాకు తెలియదు .. ఆమె కథ రాద్దామని చాలా ఏళ్లనుండి అనుకుంటున్నా.
ఆమెకు నేను యాభై ఏళ్లుగా తెలుసు.. నాకు పరిచయమై నలభై ఐదేళ్లు.
‘‘నేను నీ డెలివరీకని అమ్మమ్మోళ్ళ ఊరికెళ్ళి వచ్చే లోపల మీ నాన్న ఇల్లు మారారు. అక్కడ పక్క పోర్షన్‌లో ఉండేవారు రాజ్యలక్ష్మివాళ్ళు. అక్కయ్యని స్కూలుకి దింపి తీసుకుని వచ్చే వేళల్లో నిన్ను వాళ్ళ ఇంట్లోనే వదిలేదాన్ని. వాళ్ళకు అబ్బాయిలు లేనందుకు, అందులో వాళ్ళకి ఐదుమంది పిల్లలున్నందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఆడిస్తూవుండేవారు. అసలు మన ఇంట్లో కంటే ఎక్కువసేపు వాళ్ళింట్లోనే వుండేవాడివి. వాళ్ళ చిన్నమ్మాయి జ్యోతి కూడా నీకంటే రెండేళ్ళు పెద్దది’’ అంటూ పెద్దయ్యాక అమ్మ చెబుతుంటే నేను విస్మయంతో, ఆనందంతో నా బాల్యాన్ని ఊహించుకుని పరవశించేవాడిని.
అయితే ఆ మాత్రానికే ఆమె గురించి కథ రాయాలా? కాకపోవచ్చు.
మొన్న మా బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లి చాలా ఘనంగా, ఆడంబరంగా చేశారు. అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా చేస్తోంది. అబ్బాయి ఐటీ కంపెనీలో మంచి ప్యాకేజీతో పనిచేస్తున్నాడు. ఇద్దరి పేరెంట్స్ తరపున కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి వుంది. ఇంటిపనికి మనిషి ఉంది. వంటపనికి మనిషి ఉంది. రెండు కార్లకూ డ్రైవర్లు ఉన్నారు. ఇద్దరికీ ఒక మాటంటే పడని ఆత్మగౌరవం ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అని కీచులాడుకునే ఈగో ఉంది. మనుషులకు విశ్రాంతి లేదు. ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేదు. పెళ్ళయి కనీసం మూడేళ్లు కాలేదు - ఒకరోజు ఇద్దరికీ మాటా మాటా పెరిగి విడిపోవాలనుకున్నారు. ఎవరికీ చెప్పకుండా, అందరికీ తెలిసేలా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
అదిగో, అలాంటి సంఘటనలు విన్నప్పుడే నాకు రాజ్యలక్ష్మి గారి కథ చెప్పాలనిపిస్తుంది.
రాజ్యలక్ష్మి గారి భర్త వైద్యనాథన్. తమిళదేశం నుండి ఇక్కడకు ఎప్పుడు వలస వచ్చారో తెలియదట కానీ, పుట్టింది, పెరిగింది అంతా వాళ్ళ అక్క గారింట బాపట్లలో. అక్కడనుండి ఉద్యోగార్థిగా గుంటూరు వచ్చారట. అక్కడే హోటల్లో సప్లయిర్‌గా చేరి, రెండేళ్లలోనే యజమాని మెప్పు, విశ్వాసం చూరగొని అక్కడే మేనేజర్‌గా కొనసాగాడట. ఆ హోటల్ యజమానికి ఈయన మీద ఎంత నమ్మకమంటే, హోటల్ బాధ్యత అంతా ఈయనకే అప్పగించి వెళ్ళేవారట.
రాజ్యలక్ష్మి గారు ఉదయం పదిగంటలకల్లా పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపించి ఇక అప్పుడు తన కుట్టు పని ప్రారంభించేదట. భోజనానికి ముందు వరకూ కత్తిరింపులు, భోజనానంతరం ఒక అరగంట విశ్రాంతి, ఆ తరువాత రాత్రి వరకూ అవిశ్రాంతంగా మిషన్ తొక్కీ తొక్కీ కాళ్లు నొప్పులయ్యేవట.
హోటల్ కట్టేశాక వైద్యనాథన్ గారు ఏ పదిగంటలకో ఇంటికొస్తే భార్యాభర్తలిద్దరూ కలిసి భోంచేసేవారట. ఆ తరువాత ఆమె పడుకుంటే ఆయన ‘ఎంత అలిసిపోయుంటావో కదా, రాజ్యం’ అని కాళ్ళు పట్టేవాడట. ఒక్కోసారి కొబ్బరినూనెతో మర్ధన చేసేవాడట.
మా నాన్న ప్రభుత్వ ఉద్యోగైనా, ఇంకా చుట్టుపక్కల ఇళ్ళలో టీచర్లో, బ్యాంకు ఉద్యోగస్థులో ఉన్నా ఆమె ఏరోజూ తన భర్తని వాళ్ళతో పోల్చలేదు, ఆయన సంపాదనను, ఉద్యోగాన్ని కించపరచలేదు. పైపెచ్చు తను ఏమైనా చేయగలిగితే ఆయనకు సహాయం చేయాలని కుట్టుపని నేర్చుకుంది. ఒక్కో సీజన్లో ఆయన కంటే ఎక్కువే సంపాదించేది. అయినా ఏ రోజూ నేను నీకంటే ఎక్కువ అని అనలేదు. ఆయన కూడా నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా అనే డొల్ల మాటలు మాట్లాడకుండా ఆమెనూ, ఆమె పనినీ గౌరవించేవాడు.
ఆయన తెల్లవారు ఝామునే లేచి ఏడుకల్లా హోటల్లో ఉండేవారట. అయితే ఆ లోపల తానే ముందు లేచి ఇద్దరికీ కాఫీ కలిపేవారట.
ఇవన్నీ మా అమ్మ అబ్బురంగా చెబుతుంటే ఆసక్తిగా విన్న నా చిన్నప్పటి జ్ఞాపకాలు.
ఆర్థిక స్వాతంత్య్రం అమ్మాయికి అవసరమనీ దానితో పాటూ సంసార బంధాన్ని కలిపి ఉంచాలనుకుంటే వదులుకోవాల్సినవీ కొన్ని వుంటాయనీ, ఇది అమ్మాయికైనా, అబ్బాయికైనా సమానంగా వర్తిస్తుందనీ జీవితాంతం ఆచరించి చూపారు రాజ్యలక్ష్మిగారు.
అయితే అంత మాత్రానికే, ఆ ఒక్క చిన్న కారణానికే ఆవిడ కథ రాయాల్సిన అవసరంలేదు కదా!
మొన్నా మధ్యన నేను పనిచేసిన పాత కంపెనీలో నాతో పాటే పనిచేసిన కొలీగ్ కలిశాడు. ఆ ముచ్చట ఈ ముచ్చట అయిపోయాక పాత మిత్రులనందరినీ తలచుకుంటుంటే ఒక విషాద వార్త చెప్పాడు.
సురేంద్ర అనే కొత్తగా చేరిన ఇంజనీర్ కొన్నేళ్ళ అనుభవం సంపాదించి నాలాగే వేరే కంపెనీ మారాడట. అక్కడ రెండేళ్ళు పనిచేశాక మేనేజ్మెంట్ మారటమూ, సురేంద్రకి గాడ్‌ఫాదర్ ఎవరూ లేకపోవడమూ.. ఇలాంటి కారణాల వల్ల కంపెనీ ప్రక్షాళన చర్యలలో భాగంగా అతనికి ఉద్వాసన పలికారట. అప్పటికే ఇంటి లోనూ, కార్ లోనూ ఈఎమ్మై రూపంలో భయపెడుతున్నాయట. ఇద్దరు ఆడపిల్లలున్నారు, అప్పులున్నాయని విచారించి ఆరోగ్యం పాడుచేసుకున్నాడట. ఏదో ఒక పనిలే అనుకోక ఇంతకంటే మంచిదే కావాలని భీష్మించుకుని కూర్చున్నాడట. చివరకి భార్య కూడా సూటిపోటి మాటలనేపాటికి ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే మనసంతా వ్యాకులమైపోయింది. దుఃఖం కలిగింది. కళ్ళు చెమర్చాయి. ఆ అమ్మాయి తండ్రి వచ్చి కూతురిని, పిల్లల్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి పోయాడట.
ఇదిగో, సరిగ్గా ఇలాంటివి విన్నప్పుడే ఆవిడ గురించి చెప్పాలని, రాయాలని అనిపిస్తుంది.
వైద్యనాథన్ గారు పనిచేసే హోటల్ ఓనర్ బాగా పెద్దవాడు. అనారోగ్య కారణాల వల్ల హోటల్ మూసేసి బాంబేలో ఉన్న కొడుకు దగ్గరికి పోతున్నట్టు చెప్పాడు. అందరికీ ఒక నెల జీతం, వైద్యనాథన్ గారికి మూడు నెలల జీతం ఇచ్చారు. అమ్మాయిల పెళ్ళిళ్ళప్పుడు ముందే చెప్పండి, ఏదైనా సహాయం చేస్తాం అని హామీ కూడా ఇచ్చారు.
ముప్ఫై ఏళ్ల నుండి చేసిన పని ఇప్పుడు లేదు. ఇప్పుడు యాభై ఏళ్ల వయసులో కొత్తగా తాను ఏ పని నేర్చుకోగలడు? దానికి తోడు రాజ్యలక్ష్మి గారికి మోకాలి చిప్పలు అరిగిపోయి మిషన్ కుట్టడం కూడా తగ్గించారు. అప్పటికి ముగ్గురు కూతుళ్లకి మాత్రమే పెళ్ళయింది. సొంతిల్లు లేదు. అయినా ఆమె కుంగిపోలేదు. ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంటి అద్దె చెల్లిపోతుంది.
వాళ్ళ బంధువుల్లో ఒకావిడ పెళ్ళిళ్ళకి వంటలు చేస్తుంటుంది. ఆమె దగ్గర సహాయకులుగా కుదురుకున్నారు. సరిగ్గా అది పెళ్ళిళ్ళ సీజన్. చేతినిండా పని దొరికింది. అందులో ఆనుపానులు తెలిశాయి. పైగా వైద్యనాథన్ గారి హోటల్ నిర్వహణ సామర్థ్యాలు అక్కడ బాగా పనిచేశాయి. అది బంధువులామెకు నచ్చలేదు. వీళ్ళని పిలవడం మానేసింది. అప్పుడు వాళ్ళే సొంతంగా వంటలు చేయడం మొదలుపెట్టారు. ఒకరిద్దరు హోటల్ కుర్రోళ్లను సహాయానికి తీసుకుని పెళ్ళిళ్ళ వంటలు విజయవంతంగా చేయడం ప్రారంభించారు. కష్టపడటం ఇద్దరికీ అలవాటే. పెళ్ళిళ్ళు లేనప్పుడు స్వీట్ షాపులకు సప్లయ్ చేయడం మొదలుపెట్టారు.
ఎప్పుడో ఇరవై ఏళ్ల తరువాత వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తే అప్పడు తెలిసిన విషయాలివి.
వంటలు చేస్తున్నారని తెలిసి మా అమ్మ బాధపడితే ఆమె నవ్వుతూ ‘మీరు ఏ లోకంలో ఉన్నారో, ఇప్పుడది బ్రహ్మాండమైన వ్యాపారం’ అంటూ తను ఆ మధ్య కాలంలో లక్ష రూపాయలు పెట్టి చేయించుకున్న చైన్, గాజులు చూపించింది.
కష్టాల్లో ఉన్నప్పుడు చాకచక్యంతో వాటిని అధిగమించి విజయకేతనం ఎగరేసిన వాళ్ళ కథలు బోలెడున్నాయి. మళ్ళీ ఈ రాజ్యలక్ష్మి గారి కథ ఎందుకు అంటారేమో .. అంత మాత్రమే అయితే మీ మాట నిజమే!
మా ఆఫీసులో కొత్తగా పెళ్ళయిన ఇంజనీర్ ఒకమ్మాయి వాళ్ళ కాపురం గురించి వాళ్ళ అమ్మకు ఫోన్లో చెప్పిన విషయాలు విన్నాక నాకాశ్చర్యం అనిపించింది. బస్సులో ముందూ వెనుక, పక్కలో కోలీగ్స్ ఉంటారనే స్పృహ లేకుండా వాళ్ళ అత్త గయ్యాళి తనం గురించి, వాళ్ళాయన చేతగాని తనం అని ఈమె అనుకుంటున్న దాని గురించి విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆయన తనను సమర్థించకుండా వాళ్ళ అమ్మను వెనకేసుకొస్తారని పితూరీలు చెబుతోంది. ‘నేనూ అదే అనుకుంటున్నాను.. ‘నా సంపాదన నాకుంది. విడిగా పీజీ తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు’ అంటుంటే వాళ్ళమ్మ ఈ పిల్ల నిర్ణయాన్ని సమర్థించినట్టు సంభాషణ సాగుతోంది.
అప్పటికే మా లాయర్ ఫ్రెండ్ ఒకడు చెప్పాడు.. ఈ మధ్యన తన దగ్గరికొస్తున్న కేసులలో డైవోర్సు కేసులు ఎక్కువవుతున్నాయని. సర్దిచెప్పాల్సిన తల్లిదండ్రులు, సంధి చేయాల్సిన తోబుట్టువులు ఇంకా దంపతుల మధ్య అంతరాన్ని పెంచుతున్నారని చెప్పాడు. అది నిజమే అని నమ్మడానికి అనేక దృష్టాంతాలు ఈ మధ్య అనుభవంలోకి వచ్చాయి.
ఎప్పుడో మేము శ్రీశైలంలో ఉంటున్నప్పుడు రాజ్యలక్ష్మి గారు దేవుడి దర్శనానికి వచ్చి మా ఇంట్లో రెండ్రోజులున్నారు. ముచ్చట్ల మధ్యలో మా అమ్మ వాళ్ళ పిల్లల కుశలాలు వాకబు చేస్తూ అప్పుడే పెళ్ళయిన మూడో అమ్మాయి వివాహ జీవితం గురించి అడిగింది.
అప్పుడు ఆమెకూ మా అమ్మకు జరిగిన సంభాషణల సారాంశం చెబుతాను.
కరుణ (వాళ్ళ మూడో కూతురు) వాళ్ళాయన మంచివాడే. చిన్నప్పటినుండీ తండ్రిలేక పోవడం వల్ల తల్లే పెంచింది. అప్పటికే ఆమె ఇద్దరు కూతుళ్ల పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. కరుణ వాళ్ళాయన చదువుకుని ప్రయోజకుడయ్యేసరికి వాళ్ళకి పిల్లలు కూడా. కరుణ, వాళ్ళాయనా ఇద్దరూ బ్యాంకు ఉద్యోగస్తులు. వీళ్ళు ఆర్థికంగా బాగున్నారు. అది వాళ్ళ అత్తగారికి కొంచెం కంటగింపు. కొడుకు, కోడలు బాగున్నారనే సంతృప్తితో పాటూ, కూతుళ్ల జీవితాలలోని వెలితి ఆమెని అసంతృప్తికి గురి చేస్తుంది. అందుకే సూటిపోటి మాటలు, ఎత్తిపొడుపులు, ఉత్తుత్తి అఘాయిత్యాలు.
ఒకసారి కరుణ ఇంటికి వచ్చి ‘అమ్మా, నేనింక వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నీకు నాన్నకు ఆసరా కూడా అవుతుంది’ అని భీష్మించుకు కూర్చుంటే రాజ్యలక్ష్మి గారు ఒకటే ప్రశ్న వేశారట - మీ ఆయన పట్ల నీ అభిప్రాయమేమిటి? అని.
దానికి కరుణ ‘అతను మంచివాడే, కానీ అమ్మ మాట వింటాడు’ అన్నదట.
దానికామె ‘మీ ఆయన ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే మీ అత్తగారే కారణం కదా, మరి ఆమె మాట వింటే తప్పేముంది? ఒక ఆడదాని కష్టాన్ని గౌరవిస్తున్నాడంటే రేపు నీ కష్టాన్ని కూడా గుర్తిస్తాడనేగా. మీరు ఎక్కడ ఇంటిని పట్టించుకోరనో, ఆడబిడ్డల్ని వదిలేస్తారనో ఆమెకు ఒక అభద్రతాభావం, భయం. దానిని పోగొట్టే ప్రయత్నం చెయ్యి. మీ ఆడబిడ్డల పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోండి. ఆమెకు సంతోషం కలుగుతుంది. అది మీకూ సంతృప్తిని మిగులుస్తుంది. మీ సంపాదనలో ఆ మాత్రం చేయలేరా ఏంటి? అని అడిగి మరికొన్ని మాటలు చెప్పి చివరిగా ‘ఒక్క ఆరు నెలలు ఓపిక పట్టి చూడు, లేకపోతే మా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కన్నబిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకోమా?’ అన్నదట.
కరుణ తిరిగి అత్తగారింటికి వెళ్ళిందట. అప్పుడప్పుడూ ఏవో చిన్నా, చితకా మాటలు చెబుతుంటుంది కానీ ఆ రోజులా నేనింక పోను అని మాట్లాడలేదట.
అప్పుడు, అంటే ఏడో, ఎనిమిదో తరగతిలో నేను విన్న మాటల సారాంశం అందులో ఆమె వ్యూహం అప్పుడు అర్థం కాలేదు కానీ, ఇప్పుడు అవే మాటలని మేనేజ్‌మెంట్ గురువులు ‘రూట్ కాజ్ అనాలిసిస్’; ‘లాంగ్ బ్రీత్ టెక్నిక్’ అని అవే టెక్నిక్స్ చెబుతుంటే ఆమె తార్కిక దృష్టి, సమస్యని పరిష్కరించే చాకచక్యం ఆమె కథ రాసితీరాల్సిందే అనిపించేలా చేశాయి.
వైద్యనాథన్ గారి చిన్న మేనల్లుడు బాపట్లలో ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ గుంటూర్లో చేరాడు. ఆ కాలేజీకి హాస్టల్ లేనందున నాలుగేళ్ళు రాజ్యలక్ష్మిగారి ఇంట్లో వుండే డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగం నిమిత్తం బెంగుళూరు చేరాడు. ఆ అబ్బాయి వీళ్ళ రెండో అమ్మాయికంటే రెండేళ్ళు పెద్ద. రెండో అమ్మాయికోసం సంబంధాలు వస్తుంటే వైద్యనాథన్ గారు ‘మా ఇంట్లో అబ్బాయే ఉన్నాడు’ అని చెప్పేవారట. అలాంటిది ఒకరోజు ఉన్నట్టుండి మేనల్లుడు బెంగుళూరు నుండి ఒక ఉత్తరం రాశాడుట.
‘మామయ్యా నేను ఇక్కడ మా కొలీగ్‌ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు అమ్మా, ఒకసారి వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాల’ని వైద్యనాథన్ గారు చాలా హర్టయ్యారట.
వాళ్ళ అక్క ఆయన ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. ఆమె కొడుకును హెచ్చరించింది - మామయ్య కూతురిని చేసుకోవాలి అని.
‘మేము ఒకే ఇంట్లో నాలుగేళ్ళు కలిసి అత్తయ్య చేతి ముద్దలు కలిపి పెడితే తిని పెరిగాం. నాకు అలాంటి ఉద్దేశ్యం ఎప్పుడూ కలుగలేదు. నన్ను క్షమించండి’ అనేశాడు.
ఇంకోరింకోరయితే భర్తని నానా
శాపనార్థాలు పెట్టేవారు. ఆ అబ్బాయిని ఓటిమల్లన్న అనేవారు - ఆడపడచుని నంగనాచి అనేవారు. అవన్నీ ఎక్కడ తొందరపడి వైద్యనాథన్ గారు అనేస్తారేమోనని ఆమె చాలా జాగ్రత్తగా ఆయనను ముందే వారించిందట. ‘మన ఇంట్లో ఉండి .. మన తిండి తిని ..’ అనేంత వరకూ రాగూడదని ఆయనతో ఒట్టేయించుకుందట. మనం ప్రతిఫలం ఆశిస్తే చేసిన మంచికి ఫలితమేముంటుందని బుద్ధుడిలా ఆయనకు బోధ చేసిందట.
చిన్నప్పటి నుండీ ఎంతో ప్రేమగా పెంచాం, ఈరోజు పెళ్లి కాగానే మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు అనో, మావాడు అమెరికా వెళ్ళి మూడేళ్లయింది ఇంతవరకూ రాలేదనో, తమని పట్టించుకోవడంలేదని ఏ తల్లిదండ్రులయినా పిల్లలపైన ఇలాంటి ఆరోపణలు చేస్తే నాకు రాజ్యలక్ష్మిగారు మా అమ్మకు చెప్పిన పై విషయాలన్నీ స్ఫురణకు వస్తాయి.
ఐదుగురు పిల్లలకూ పెళ్ళిళ్ళు జరిగి వాళ్ళందరూ పిల్లా పాపలతో ఉన్నప్పటికీ వాళ్ళ రెండో అమ్మాయి వాళ్ళకి మిగతా వారితో పోలిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు తక్కువ. ఇద్దరివీ ప్రైవేట్ ఉద్యోగాలే. ఇద్దరూ ఆడపిల్లలే. అందుకే రాజ్యలక్ష్మిగారు, వైద్యనాథన్ గారు వంటలు చేయడం మానేశాక గుంటూర్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు.
ఉదయం లేచినప్పటినుండీ ఏదో ఒక పని చేయకపోతే భార్యాభర్తలకు తోచదు. పిల్లల్లో హైదరాబాద్‌లో ఇద్దరు, గుంటూర్లో ఒకరు, విజయవాడలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు సెటిలయ్యారు. ఓపిక ఉన్నన్నాళ్లూ అక్కడ కొన్ని రోజులూ, ఇక్కడ కొన్ని రోజులూ.. అలా తిరిగినా ఆయనకు ఒంట్లో బాగుండడంలేదని తెలిసినప్పటినుండీ గుంటూరుకే పరిమితమైపోయారు.
పిల్లలంతా ఎప్పుడైనా గుంటూర్లో కలిస్తే అమ్మమ్మ, అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూనే ఉంటారు. ఆమె నోటినుండి ఏదైనా మాట రావడం ఆలస్యం పిల్లలు పోటీలు పడి అమ్మమ్మ చెప్పిన పని పూర్తి చేస్తారు. ఎప్పుడో యాభై ఏళ్ల కిందట నన్ను వాళ్ళ ఇంట్లో ఎలా పెంచారో, ఇప్పటికీ అదే ఉత్సాహంతో, అదే వాత్సల్యంతో ఆమె పిల్లలని ఆదరించడం చూడటానికి భలే ముచ్చటగా ఉండేది.
మూడేళ్ళ క్రితం ఉదయాన్నే ఒక వాట్సప్ మెసేజీలో వైద్యనాథన్ గారు పోయారని తెలియపరచారు.
నేను అప్పుడు వెళ్లలేకపోయినా కొద్దిరోజుల తరువాత ఆమెను కలిసి సంతాపం వ్యక్తం చేస్తుంటే ఆమె విచారంగానే అయినా చాలా నిబ్బరంగా మాట్లాడింది.
అరవై ఏళ్ల స్నేహం కదా మాది. కొద్దిగా బాధగానే వుంటుంది. అయితే చివరి రోజులలో ఆయన క్యాన్సర్‌తో విలవిలలాడుతుంటే ‘నా స్వార్థం కోసం ఆయన బాధ పడటం దేనికి, త్వరగా తీసుకు పొమ్మని నేనే కోరుకున్నాను. ఎలాగూ ఇక్కడ ఎవ్వరమూ పర్మనెంట్‌గా ఉండబోవడం లేదుకదా, అయినా మనిషంటే నిజంగా శరీరమే అంటావా? ఆయన జ్ఞాపకాలతో ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటారు’ అంది.
యోగిని లాంటి ఆమె మాటలు విన్నాక విషాదంగా ఇంటికి తిరిగొచ్చి ఈసారి కలిసేలోగా ఆమెకథ రాయాలని తీర్మానించుకున్నాను.
మా పెళ్లయ్యాక ఒకసారి మా ఆవిడని పరిచయం చేస్తే సొంతం తన కూతురిలాగే ట్రీట్ చేసిందని’ ఆమెని మెచ్చుకుంటూ మా ఆవిడ కూడా ఆవిడ అభిమాని అయిపోయింది.
మొన్నామధ్యన రాజ్యలక్ష్మిగారు హైదరాబాద్‌లో ఉన్న ఐదోకూతురు ఇంటికి వచ్చిందని ఫోన్ చేసి చెబితే నేనూ, మా ఆవిడ చూడ్డానికి వెళ్ళాం. కబుర్లన్నీ ముగించుకుని తిరిగి వస్తుంటే నా భార్య నా మనసులో మాట ఆమె ముందు బయటపెట్టింది.
‘‘ఇదిగోండి ఆంటీ, ఈయన మీ గురించి కథ రాస్తారట’’ అని.
దానికామె సహజమైన చిరునవ్వుతో ‘కథగా రాసేంత గొప్పదనమేముంది నాన్నా నాలో’ అని ముక్తాయించింది.
ఆ ఒక్కమాట చాలదా ఆమె కథ రాయడానికి!
98498 02521