Share News

Viral News: తెలంగాణ యాసలో పెళ్లి కార్డు.. నెటిజన్లు ఫిదా

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:43 PM

వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని ఆరాటపడుతున్నాయి కొన్ని జంటలు. ఆ వినూత్నత వివాహ వేడుకల్లోనైనా ఉంటోంది లేదా వెడ్డింగ్ కార్డుల్లోనైనా ఉంటోంది. తాజాగా కరీంనగర్‌కి చెందిన ఓ యువకుడు తన పెళ్లి వెడ్డింగ్ కార్డుని వినూత్నంగా డిజైన్ చేయించాడు.

Viral News: తెలంగాణ యాసలో పెళ్లి కార్డు.. నెటిజన్లు ఫిదా

కరీంనగర్: వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని ఆరాటపడుతున్నాయి కొన్ని జంటలు. ఆ వినూత్నత వివాహ వేడుకల్లోనైనా ఉంటోంది లేదా వెడ్డింగ్ కార్డుల్లోనైనా ఉంటోంది. తాజాగా కరీంనగర్‌కి చెందిన ఓ యువకుడు తన పెళ్లి వెడ్డింగ్ కార్డుని వినూత్నంగా డిజైన్ చేయించాడు. అది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా ఎక్కువగా సంస్కృత పదాలు వాడే పెళ్లి పత్రికలో కొన్ని పదాలు మనకు అర్థం కావడం కష్టం. ఈ సమస్య లేకుండా అచ్చమైన తెలంగాణ యాసలో కార్డును అచ్చు వేయించాడు యువకుడు.

ఆ వివాహ జంట సాధారణ కార్డు మాదిరిగా కాకుండా కొంత భిన్నంగా తయారు చేయించుకుంది. సాధారణంగా కార్డులో పెళ్లి జరిగే తేదీ, చిరునామా, నవ వధూవరులు, బంధువుల పేర్లు, విందు లాంటి వివరాలు ఉంటాయి. తెలంగాణలోని కరీనంగర్‌ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం వినూత్నతను చాటాలని తెలంగాణ యాసతో కూడిన కార్డుని ప్రింట్ చేయించింది. ఆ కార్డులో వివరాలేంటో చూద్దాం..


పోకలోల్ల లగ్గం పిలుపు...

‘స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ – తాత పోకల నర్సమ్మ – నర్సయ్య, పెద్దబాపు పోకల వెంకట రాములు, మానెత్తలు-మామలు ఉప్పు వెంకవ్వ-మల్లయ్య, గొంటి మల్లవ్వ – మల్లయ్య, అమ్మమ్మ తాత జోగుల లక్ష్మిదేవి-లస్మయ్య నిండు నిండు దీవెనార్తెలతో.. శ్రవణ నక్షత్రయుక్త తుల లగ్నము పుష్కరాంశ సుముహర్తమున.. మా ఒక్కగానొక్క పిల్లగాడు చి. మధు, లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు. అందురూ జెర యాది మరిచిపోకుర్రి.అసలే వానలు ఉన్నాయని రాకుండా ఉండేరు.... జెర యాల్లపొద్దుగాల్ల వచ్చి మాపిల్లపిల్లగానికి మీ దీవెనలిచ్చి మా లగ్గం సంబురం చూసిపోతే మా మనస్సు నిమ్మలమైతది. ఇట్లు లగ్గానికి పిలిసేటోళ్లు.. అరుసుకునేటోళ్లు’ ఇది లగ్గం పిలుపు సారాంశం. అచ్చ తెలంగాణ యాసను పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Updated Date - Aug 17 , 2024 | 08:43 PM