Share News

Viral News: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. 6 ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన కంపెనీ

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:53 PM

మనం ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ చేసినప్పుడు.. అది ఇంటికి చేరడానికి రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల ఇంకొన్ని రోజుల..

Viral News: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. 6 ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన కంపెనీ
Flipkart Order

మనం ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ చేసినప్పుడు.. అది ఇంటికి చేరడానికి రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల ఇంకొన్ని రోజుల సమయం పట్టొచ్చు. అంతేగానీ.. సంవత్సరాల తరబడి ఆలస్యం అవ్వడాన్ని మీరెప్పుడైనా చూశారా? ఓ వ్యక్తికి మాత్రం ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. అతను ఓ జత చెప్పులను ఆర్డర్ చేస్తే.. దానిపై మాట్లాడేందుకు సంబంధిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆరేళ్ల తర్వాత ఫోన్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ముంబైకి చెందిన అహ్సాన్ ఖర్బాయి (Ahsan Kharbai) అనే వ్యక్తి 2018 మే 16వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) రూ.485 విలువ గల ఓ జత చెప్పులను ఆర్డర్ పెట్టాడు. మే 20వ తేదీ కల్లా ఆ చెప్పులు ఇంటికి చేరుతాయని ఆ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. అంతేకాదు.. మే 19వ తేదీన అవి షిప్పింగ్ చేయబడ్డాయని కూడా చూపించింది. ఇంకేముంది.. మరుసటి రోజే చెప్పులు ఇంటికి చేరుతాయని అహ్సాన్ నిరీక్షించాడు. కానీ.. అతని నిరీక్షణ ఇప్పటికీ తీరలేదు. ఎందుకంటే.. ఆరేళ్లు గడిచినా ఆ చెప్పులు అతనికి చేరలేదు. రోజులు గడిచినా ఆర్డర్ రాకపోవడంతో.. అతను వాటి గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇక ఆ చెప్పులు ఎప్పటికీ రావనుకొని, విషయాన్ని పక్కన పెట్టేశాడు. అయితే.. ఆరేళ్ల తర్వాత అతనికి ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.


రీసెంట్‌గా ఈ ఆర్డర్ గురించి మాట్లాడేందుకు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సర్వీస్ నుంచి అహ్సాన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఆరేళ్ల తర్వాత తనకు ఇలా కాల్ రావడంతో.. అహ్సాన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆర్డర్‌కు సంబంధించి తానేమైనా ఇబ్బందులు ఎదుర్కున్నానా? అని కస్టమర్ తనని అడిగి తెలుసుకున్నాడని అతను తెలిపాడు. క్యాష్ ఆన్ డెలివరీ మోడ్‌లో తాను ఆ చెప్పులు కొన్నానని, చాలా రోజులు వేచి చూసినా అవి రాకపోవడంతో తాను క్యాన్సిల్ చేయాలని అనుకున్నానని, కానీ ఆ ఆప్షన్ లేకపోవడంతో తానేం చేయలేకపోయానని అహ్సాన్ చెప్పుకొచ్చాడు. ఈ ఆర్డర్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని ఎక్స్ వేదికగా షేర్ చేశాడు.

Updated Date - Jun 28 , 2024 | 05:53 PM