Share News

‘నార్డిక్‌’ దేశాలు.. నయనానందకరం

ABN , Publish Date - Oct 06 , 2024 | 07:51 AM

ఉత్తర యూరోప్‌లోని సార్వభౌమ సమూహ దేశాలవి. ఎంత పురాతనమైనవో, అంత ఆధునికమైనవి కూడా. ‘నార్డిక్‌’ దేశాలుగా పిలిచే డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ వంటి స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లో పర్యటన తప్పకుండా వినూత్న అనుభవాన్నే అందిస్తుంది. ఆ విశేషాలే ఇవి...

‘నార్డిక్‌’ దేశాలు.. నయనానందకరం

ఉత్తర యూరోప్‌లోని సార్వభౌమ సమూహ దేశాలవి. ఎంత పురాతనమైనవో, అంత ఆధునికమైనవి కూడా. ‘నార్డిక్‌’ దేశాలుగా పిలిచే డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ వంటి స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లో పర్యటన తప్పకుండా వినూత్న అనుభవాన్నే అందిస్తుంది. ఆ విశేషాలే ఇవి...

జీవన శైలి, జీవన ప్రమాణాల సూచికల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే ‘నార్డిక్‌’ దేశాలైన నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్లాండ్‌లను చూడాలనే కోరిక ఇటీవల తీరింది. జూలై నెలలో కొందరు మిత్రులతో కలిసి ఉత్తర ఐరోపాను సందర్శించాను. ‘నార్డిక్‌’ అనే పదం నార్వేజియన్‌, డానిష్‌, స్వీడిష్‌ భాషలలో ‘నార్త్‌’ అనే పదం నుంచి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి ప్రజల ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనాన్ని ప్రత్యక్షంగా చూశాం. వారంతా కళాప్రియులు. క్రమశిక్షణ, దేశభక్తి, కష్టపడే తత్వం... జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో అక్కడివారికి బాగా తెలుసు. పిల్లలు, వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ వహిస్తాయి. విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారు. పర్యావరణానికి పెద్ద పీట వేస్తారు. వాహన సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎక్కువగా సైకిళ్లనే వినియోగించడం చెప్పుకోదగ్గ విషయం. ప్రతీ నగరంలోనూ సైకిళ్ల కోసం ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటుచేసుకోవడం గొప్ప సంగతి.


చిన్న అపార్ట్‌మెంట్‌లో ప్రధాని...

మేము మొదటగా ఢిల్లీ నుంచి ఫిన్లాండ్‌ దేశ రాజధాని ‘హెల్సింకి’ నగరానికి చేరుకున్నాం. ఇక్కడ ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషలు మాట్లాడతారు. కరెన్సీ యూరోలు. హెల్సింకి నగరం అనేక చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి. పురాతన కాథడ్రల్‌ చర్చ్‌, రాక్‌ చర్చ్‌, టెంపెలియకో చర్చ్‌, సిటీ మ్యూజియం, సెనేట్‌ స్క్వేర్‌తో పాటు ఒలింపిక్‌ స్టేడియం ఆకట్టుకున్నాయి. నార్డిక్‌ దేశాలన్నింటిలో నగర సందర్శనకు ‘హోప్‌ ఆన్‌ హాప్‌ఆఫ్‌’ పేరుతో అందంగా అలంకరించిన బస్సులు తిరుగుతుంటాయి. ఈ బస్సులో టికెట్‌ తీసుకుంటే రోజంతా నగరాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా చుట్టేయొచ్చు.


రెండు రోజులు హెల్సింకిలో గడిపిన తర్వాత ఒక రాత్రంతా క్రూయిజ్‌లో ప్రయాణించి స్వీడన్‌ దేశ రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్నాం. ఈ నగరాన్ని ‘వెనీస్‌ ఆఫ్‌ నార్త్‌’ అని కూడా అంటారు. కరెన్సీ స్వీడిష్‌ క్రోనాస్‌. ఇది పురాతన, ఆధునిక, కళాత్మక వాస్తు కట్టడాలకు ప్రసిద్ధి. అతి పురాతన రిడ్దర్‌ హాల్మమని చర్చ్‌తో పాటుగా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రాయల్‌ ప్యాలెస్‌ సందర్శనలో స్వీడన్‌ రాజుల చరిత్ర, జీవనశైలి గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. ఇక అక్కడి పార్లమెంట్‌ హౌస్‌ గురించి, పరిపాలన విధానాన్ని ప్రభుత్వ అధికారులే వివరించడం విశేషం. పార్లమెంట్‌ భవనానికి సమీపంలోనే దేశ ప్రధానమంత్రి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారని చెబితే విని ఆశ్చర్యపోయాం. మన దేశ నాయకులతో పోల్చితే వారి నిరాడంబర జీవనశైలిని మెచ్చుకోవాల్సిందే.


1628నాటి నౌక...

మరుసటి రోజు ఉదయం వాసా మ్యూజియానికి వెళ్లాం. అక్కడ కలపతో నిర్మించిన 1210 టన్నుల బరువైన ‘ది వాసా’ అనే యుద్ధనౌక ప్రదర్శనకు ఉంది. 1628లో అది సముద్రంలో మునిగిపోతే 1960లో వెలికితీసి ప్రదర్శనకు పెట్టినట్టు చెప్పారు. చాలాసేపు ఆ నౌకకు అలాగే చూస్తూ ఉండిపోయాం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... నౌకలో చనిపోయిన యుద్ధవీరుల అస్తిపంజరాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 1901 నుంచి నోబెల్‌ బహుమతుల ప్రదానోత్సవానికి వేదికైన సిటీహాల్‌లోకి ప్రవేశించాం. అక్కడి నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద అర్ధగోళ భవనం ‘స్టాక్‌హోమ్‌ గ్లోబ్‌ ఎరీనా’కు వెళ్లాం. అద్దాల పెట్టెలో గ్లోబ్‌పైకి చేరుకుని నగరం మొత్తాన్ని వీక్షించాం. ఇక్కడే నేలపైన, నీటి మీద కూడా తిరిగే ‘యాంఫిబియస్‌’ బస్సులో నగర సందర్శన మర్చిపోలేని జ్ఞాపకం. ఈ దేశంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వం విద్యకు ఇచ్చే ప్రాధాన్యత. ప్రపంచంలోని ఏ దేశం వారైనా తరగతికి ఒక్కరున్నా సరే వారి మాతృభాషలో బోధిస్తారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన స్టాక్‌హోమ్‌లో స్కానియా, ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌, వోల్వోలాంటి పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.

mag4.jpg


‘నోబెల్‌’ సిటీహాల్‌...

స్టాక్‌హోమ్‌ నుంచి విమానంలో నార్వే దేశంలోనే రెండవ పెద్ద నగరం ‘బెర్గెన్‌’కు చేరుకున్నాం. నార్డిక్‌ దేశాల్లో నార్వే ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడి కరెన్సీ క్రోనాస్‌. బెర్గెన్‌ ప్రముఖ రేవు నగరమే కాకుండా యూరోప్‌ దేశాలకు వాణిజ్య కేంద్రం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది. ఏడు పర్వతాల నడుమ ఉండటమే దీని ప్రత్యేకత. ఫ్లయాన్‌ పర్వతంపై కేబుల్‌ కారు ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. తర్వాతి రోజు బెర్గెన్‌ నుంచి అద్దాల రైలులో ప్రయాణించి పర్వతాల మధ్యనున్న ‘ఫ్లామ్‌’ అనే చిన్న పట్టణానికి చేరుకున్నాం. ఇక్కడ రెండు గంటలు గడిపి తిరిగి ఫిజోర్డ్‌లో చిన్న షిప్‌లో ప్రయాణించి బెర్గెన్‌కు చేరుకున్నాం. ఎత్తయిన పర్వతాల మధ్యలో లోతైన సన్నని యు ఆకారంలో ఏర్పడిన పాయనే ఫిజోర్డ్‌ అంటారు. ఇది హిమానీ నదాలు కరగడం ద్వారాగానీ, సముద్రపు పాయవల్ల గానీ ఏర్పడుతుంది. ఫిజోర్డ్‌లో ప్రకృతి ఒక చిత్రకారుడు అందంగా రంగుల కుంచెతో వేసినట్లుగా కనిపిస్తుంది.


mag4.3.jpg

బెర్గెన్‌ నుంచి నార్వే అందాలను చూస్తూ రైలులో ఆ దేశ రాజధాని ఓస్లో చేరుకున్నాం. ఇక్కడ విమానం కన్నా రైలు ప్రయాణం ఖరీదైనది. ఓస్లో అందమైన, ఆధునిక ఆర్కిటెక్ట్‌ కట్టడాలకు నిలయం. డిసెంబర్‌ 10న ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ వర్థంతి రోజున నోబెల్‌ శాంతి బహుమతిని ప్రదానం చేసే సిటీహాల్‌ చూసినప్పుడు ఒక రకమైన ఉద్వేగానికి గురయ్యాం. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ బహుమతి అందుకున్నారనే ఫీలింగ్‌ మాటల్లో వర్ణించలేనిది. ఓస్లో నుంచి డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హెగన్‌కు వెళ్లాలంటే క్రూయిజ్‌ ప్రయాణం బాగుంటుంది. ఇక్కడ క్రూయిజ్‌లలో ప్రయాణాలను బాగా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక్కడి కరెన్సీ డానిష్‌ క్రోనాస్‌. ఇక్కడి గాంధీపార్క్‌లోని మహాత్ముని విగ్రహాన్ని మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆవిష్కరించారు. రంగురంగుల అందమైన భవనాల మధ్యలో నిర్మించిన కెనాల్స్‌ మార్గంలో క్రూయిజ్‌లో తిరుగుతూ నగరాన్ని చూడటం జీవితకాలపు అనుభవం.


ఈ దేశాలలో ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉంటుంది. భారతీయ రెస్టారెంట్లు చాలాచోట్ల కనిపిస్తాయి కాబట్టి ఆహారానికి సంబంధించిన బెంగ ఏమీ ఉండదు. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ బుక్‌ చేసుకుంటే వంట కూడా చేసుకోవచ్చు. 12 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలను మూటగట్టుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాం.

- జి. రామకృష్ణ,

94408 47518

Updated Date - Oct 06 , 2024 | 07:57 AM