Share News

ఛాయాచిత్ర ‘గీతిక’

ABN , Publish Date - Sep 01 , 2024 | 09:53 AM

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ యువతి కూడా ఒక కీలకపాత్ర పోషించింది. అతిపెద్ద క్రీడా పండగను... అంతే అద్భుతంగా మన కళ్ల ముందుం చిన ఫొటో జర్నలిస్టుల్లో అసోమ్‌కు చెందిన గీతికా తాలుక్‌దార్‌ ఒకరు.

ఛాయాచిత్ర ‘గీతిక’

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ యువతి కూడా ఒక కీలకపాత్ర పోషించింది. అతిపెద్ద క్రీడా పండగను... అంతే అద్భుతంగా మన కళ్ల ముందుం చిన ఫొటో జర్నలిస్టుల్లో అసోమ్‌కు చెందిన గీతికా తాలుక్‌దార్‌ ఒకరు. మనదేశం నుంచి ఒలింపిక్స్‌ను కవర్‌ చేసిన ఏకైక మహిళా ఫొటోగ్రాఫర్‌. ‘అమ్మాయిలు అన్నీ చేయలేరు’ అనే భావనను చెరిపేసి... సాధించాలన్న తపన, కఠోర శ్రమ ఉంటే ఏ రంగంలోనైనా సునాయాసంగా రాణించగలరని నిరూపించిన గీతిక మనోభావాలివి...

‘స్పోర్ట్స్‌ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచు కోవడానికి మహిళలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే ఇది పూర్తిగా పురుషాధిపత్య రంగం. ఇక్కడ అనేక అడ్డంకులు, సవాళ్లు ఉంటాయి. వాటన్నింటిని అధిగమించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్‌ ఫొటోగ్రాఫర్స్‌లో నేను ఒకరిగా మారాను. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నుంచి అధికారికంగా గుర్తింపు పొందిన ఏకైక భారత మహిళా ఫొటోగ్రాఫర్‌ని కూడా నేనే.


మాది ఈశాన్య రాష్ట్రమైన అసోమ్‌లోని డూమ్‌డుమా అనే చిన్న పట్టణం. స్థానికంగా కేంద్రీయ విద్యాలయంలో చదివి, ఆ తర్వాత పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశా. గువాహటిలోని ఐఎమ్‌సీఎమ్‌ మీడియాట్రస్ట్‌లో మాస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ మీడియాలో పీజీ చేసిన తర్వాత దక్షిణ కొరియా స్పోర్ట్స్‌ మినిస్ట్రీ వారి స్కాలర్‌షిప్‌ వచ్చింది. ప్రసిద్ధ సియోల్‌ నేషనల్‌ యూనివర్శిటీ నుంచి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశా.

తాతయ్య నుంచే...

మా తాతయ్య చంద్ర తాలుక్‌దార్‌ ఫిలింమేకర్‌. చిన్నప్పుడు వేసవి సెలవులకు ఆయన దగ్గరకి వెళ్తుండేదాన్ని. ఆయన కెమెరా పనితనం చూశాకే నాకూ ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. అలా చిన్న వయసులోనే కెమెరా పట్టి, క్రీడలపై ఉన్న ఇష్టంతో స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారాను. 2006 నుంచి ఇప్పటిదాకా దేశ, విదేశాల్లోని ప్రముఖ మీడియా సంస్థలు, పబ్లికేషన్లలో పనిచేశా. డీఎన్‌ఏ, ది టెలిగ్రాఫ్‌, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ, ఏఎఫ్‌పీ వంటి ప్రముఖ సంస్థల్లో సేవలందించా. కొలంబోలోని డైలీ ఫైనాన్షియల్‌ టైమ్స్‌లోనూ నా కెమెరా పని తనం ఏంటో చూపించా. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా నాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో ఆపై ఫ్రీలాన్సర్‌గా మారాను.


కొవిడ్‌ సమయంలోనూ..

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న రోజులవి. ఆ సమయంలో గడపదాటి బయటకు రావడానికి కూడా ఎవరు సాహసించలేదు. అప్పుడే టోక్యో ఒలింపిక్స్‌ మొదలయ్యాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలే వెనకడుగు వేస్తున్నా వేళ... భుజానికి కెమెరా తగిలించుకుని టోక్యోకు పయనమయ్యాను. నాకు అక్రిడేషన్‌ లేకున్నా సరే క్రీడల మీద అభిమానమే నన్ను అక్కడి వరకు నడిపించింది. నిజానికి స్టేడియంలో ప్రేక్షకులు ఉంటేనే మాకు ఫుల్‌ కిక్కు ఉంటుంది. వారి స్పందనను క్యాప్చర్‌ చేయడం థ్రిల్‌నిస్తుంది. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా టోక్యో ఒలింపిక్స్‌లో ఆ ఛాన్సే లేకుండా పోయింది. అప్పట్లో బెస్ట్‌ మూమెంట్‌ అంటే.. బాక్సర్‌ లోవ్లినా బోర్గోహైన్‌ను కవర్‌ చేయడం నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే మేమిద్దం అస్సామీ అమ్మాయిలమే. టోక్యో తరువాత ఇటీవల జరిగిన ప్యారిస్‌ ఒలింపిక్స్‌ను కవర్‌ చేశా. ఇది నా రెండో ఒలింపిక్స్‌. అక్కడ వరుస మ్యాచ్‌ల వల్ల అస్సలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక దొరకలేదు.


అంత సులువేమీ కాదు...

‘ఓస్‌.. ఫొటోలు ఎవరైనా తీయగలరు’ అనుకుంటారు చాలామంది. నిజానికి ఈ రంగం అనుకున్నంత సులువేమీ కాదు. నాకు బాగా గుర్తు.. అది ఫ్రాన్స్‌, క్రొయేషియా మధ్య జరిగిన ‘ఫిఫా వరల్డ్‌ కప్‌’ ఫైనల్‌ మ్యాచ్‌. ఆట పూర్తయిన తర్వాత ఫ్రాన్స్‌ జట్టు విజయో త్సాహంలో ఉండగా, ఫొటోగ్రాఫర్స్‌ అందరం గ్రౌండ్‌లో చేరి ఆ క్షణాలను కెమెరాలో బంధిస్తున్నాం. అదే సమయంలో ఒక్క సారిగా భారీ వర్షం కురవడం మొదలైంది. అయినాసరే, వర్షంలో తడుస్తూనే ఆ మధుర క్షణాలను క్యాప్చర్‌ చేశాం. అంతేకాదు క్రీడను బట్టి షట్టర్‌ వేగాన్ని పెంచడం, తగ్గించడం అంత ఆషామాషీ కాదు.

mag4.2.jpg


ఎందరో సెలబ్రిటీలు... ఎన్నో సిరీస్‌లు...

నా ఈ ప్రయాణంలో ఎందరో సెలబ్రిటీలను కలిశాను. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ప్రత్యేకం. నేను మొదటిసారి ఆయన్ను కలిసింది కొలంబోలోని తన క్రికెట్‌ ఫౌండేషన్‌లో. అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సింగక్కర, ఎమ్మెస్‌ ధోని, మేరీకోమ్‌ వంటి వారిని ఇంటర్వ్యూ చేయడం మధురానుభూతిని కలిగించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన ‘విమెన్స్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ 2023’, ఖతార్‌లో జరిగిన ‘ఫిఫా ప్రపంచకప్‌ 2022’, లండన్‌లో ‘ఫిఫా ప్రపంచకప్‌ 2018’, ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఫిఫా విమెన్స్‌ వరల్డ్‌ కప్‌ 2019’ లాంటి ఈవెంట్లను నా కెమెరాలో బంధించా. నేషనల్‌ గేమ్స్‌ 2007, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2010, ఐపీఎల్‌ సీరీస్‌, ఇండియన్‌ సూపర్‌ లీగ్స్‌, సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌ వంటివెన్నో నా ఖాతాలో ఉన్నాయి. 19 ఏళ్ల పాటు ఈ రంగంలో నేను చేసిన కృషిని గుర్తించి ‘ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ’(ఐఓసీ) ఇటీవల నాకు అధికారికంగా అక్రిడేషన్‌ అందించింది.


బాలికల కోసం...

నాకు ఈ రంగంలో స్ఫూర్తి అంటే... మన దేశపు మొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్‌ అయినా హోమై వ్యారవల్లా. క్రీడలు యువత జీవితాన్ని మార్చగలవని నేను నమ్ముతాను. అందుకే బాలికల కోసం అసోమ్‌లో స్పోర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించాను. అది త్వరలో ప్రారంభం కానుంది. ఏకాగ్రత, సంకల్ప బలం ఉంటే మహిళలు సైతం ఈ రంగంలో రాణించొచ్చు.

పాటలు, డ్యాన్స్‌ ఇరగదీస్తా...

‘‘నాకు ఫొటోలు తీయడమే కాదు... వంట చేయడమన్నా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా వంటగదిలో దూరి గరిటె తిప్పుతుంటా. పాటలు ఎంత బాగా పాడుతానో, దానికి తగ్గ స్టెప్పులతో ఇరగదీస్తాను కూడా. ఒత్తిడిలో ఉంటే నచ్చిన సినిమాలు పెట్టుకుని చూస్తుంటా.’’

Updated Date - Sep 01 , 2024 | 09:53 AM