Share News

వానల్లో ‘ఈవీ’ జాగ్రత్తలు!

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:16 AM

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు రోడ్డెక్కుతున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలపై ఉన్న ప్రాథమిక అనుమానాలను ఎప్పటికప్పుడు తీర్చుతూ, ఈవీలు ముందుకు దూసుకుపోతున్నాయి.

వానల్లో ‘ఈవీ’ జాగ్రత్తలు!

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు రోడ్డెక్కుతున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలపై ఉన్న ప్రాథమిక అనుమానాలను ఎప్పటికప్పుడు తీర్చుతూ, ఈవీలు ముందుకు దూసుకుపోతున్నాయి. అయితే ‘వర్షాకాలంలో వీటి నిర్వహణకు మరింత శ్రద్ధ పెట్టాల్సిందే’ అంటున్న నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలివి...

ఎలక్ర్టిక్‌ వాహనాలకు బ్యాటరీనే గుండెకాయ. నీళ్ల వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా పని చేయదు. వానాకాలంలో బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌ దగ్గర తుప్పు లేదా తేమ ఉండకుండా చూసుకోవాలి. బ్యాటరీ దగ్గర పగుళ్లు, బ్రేక్‌ అయినట్లు కనపడితే వెంటనే సర్వీసింగ్‌ సెంటర్‌ను సంప్రదించాలి.


వానాకాలంలో ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌ సరిగా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. వానపడుతుంటే ఛార్జింగ్‌ చేయకూడదు.

ఈవీ స్టేషన్‌లో వర్షం పడకుండా పైకప్పు ఉంటేనే ఛార్జ్‌ చేయాలి. వాహనానికి వచ్చిన కనెక్టర్లనే వాడాలి. ఎలాంటి ఎక్స్‌టెన్షన్లు వాడినా అతిగా వేడై పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

విద్యుత్‌ వాహనం ఆపే చోటు, ఛార్జింగ్‌ పెట్టుకునే చోట నీటి తడి ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. తేమ ఉంటే పొడి గుడ్డతో తుడవాలి. ముఖ్యంగా ఛార్జింగ్‌ ప్లగ్‌కు వాటర్‌ప్రూఫ్‌ కవర్‌ వేయటమూ మంచిదే.


mag6.2.jpg

ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌, ఫ్లాష్‌ లైట్‌, పోర్టబుల్‌ ఛార్జర్‌ లాంటివి వానాకాలంలో ప్రయాణం చేసేప్పుడు దగ్గరే ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయి.

బురదలో, నీళ్లలో ప్రయాణించినప్పుడు వాహనం కింద తుప్పు పట్టే అవకాశాలెక్కువ. అందుకే యాంటీ రస్ట్‌ కోటింగ్‌ వేయించుకోవాలి. తరచుగా వాహనాన్ని వాటర్‌ వాషింగ్‌ చేయించటం వల్ల ఎండిన బురద లాంటివి పోతాయి. తుప్పు పట్టదు.

నీళ్లు నిలిచిన తారు రోడ్లు లేదా బురదరోడ్ల మీద వేగంగా వెళితే టైర్లు స్కిడ్‌ అవుతాయి. అందుకే టైర్‌ మెయింటైన్స్‌ చూసుకోవాలి. గ్రిప్పింగ్‌ బాగా ఉండే టైర్లు వాడాలి.


ఎప్పుడైనా సరే బ్యాటరీని కాపాడితేనే వాహనం మొరాయించకుండా, సాఫీగా సేవలందిస్తుంది. ప్లగ్‌ కనెక్టర్ల దగ్గర జాగ్రత్తగా గమనిస్తుండాలి. ప్లగ్‌ను రఫ్‌గా ఒత్తిడిని పెంచి కనెక్ట్‌ చేయొద్దు. ఇకపోతే బ్యాటరీ ఛార్జింగ్‌ ఇరవై శాతం తగ్గకుండా, 80 శాతం కంటే ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. దీనివల్ల బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది.

కారు లోపల కార్పెట్లు తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడ తేమ కనపడినా ఫ్రెష్‌ కార్పెట్లు వేసుకోవాలి. తరచూ కారును ఉపయోగించకపోతే తుప్పులాగా ఫామ్‌ అవుతుంది. నీటి తుంపరలు పడి ఉబ్బినట్లు అయితే మెకానిక్‌కు చూపించాలి. ఇంటీరియర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే.

Updated Date - Sep 29 , 2024 | 10:16 AM