Share News

రికార్డు లాహిరి!

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:28 AM

పడవపై కుదురుగా కూర్చుని, తెడ్డేస్తూ నదిలో ఓ పది నిమిషాలు పాటు నడపడమే ఎంతో కష్టం. అలాంటిది గుమ్మడికాయను పడవగా చేసుకొని... దానిపై ఏకధాటిగా 26 గంటల పాటు ప్రయాణించి ‘ఔరా’ అనిపించాడో పెద్దాయన.

రికార్డు లాహిరి!

పడవపై కుదురుగా కూర్చుని, తెడ్డేస్తూ నదిలో ఓ పది నిమిషాలు పాటు నడపడమే ఎంతో కష్టం. అలాంటిది గుమ్మడికాయను పడవగా చేసుకొని... దానిపై ఏకధాటిగా 26 గంటల పాటు ప్రయాణించి ‘ఔరా’ అనిపించాడో పెద్దాయన.

అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్‌ 2011 నుంచి గుమ్మడికాయలు సాగు చేస్తున్నారు. అప్పుడప్పుడు భారీ గుమ్మడికాయలను పండించడం ఆయనకు సరదా. వాటితో నదుల్లో రెగెట్టా పోటీలు కూడా నిర్వహిస్తారని తెలుసుకున్నారు.


2013లో ఓ పేద్ద గుమ్మడికాయను పడవలా తయారుచేసి ‘వెస్ట్‌కోస్ట్‌ జెయింట్‌ పంప్‌కిన్‌ రెగెట్టా’ అనే స్థానిక పోటీలో పాల్గొని విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి భారీ గుమ్మడికాయలను పండించడం, వాటిలో ఒకదాన్ని పడవగా మలచడం అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు’పై కన్నేశారు. ఇటీవలే 555.2 కిలోల అత్యంత భారీ గుమ్మడికాయను పండించి, దాని లోపల గుజ్జును తీసేసి పడవలా తయారు చేశారు.


దాన్ని ఉత్తర బొన్నెవిల్లిలోని కొలంబియా నదీ తీరానికి చేర్చి, లైఫ్‌ జాకెట్‌ ధరించి... ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకుంటూ 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి వాంకోవర్‌ ఒడ్డుకు చేరుకున్నారు. దాంతో గుమ్మడికాయ బోటులో ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ‘ నది మధ్యలో భారీగా మొక్కలుండటంతో ప్రయాణం చాలా కష్టమైంది. అయినా సరే మొక్కవోని పట్టుదలతో, తీవ్రంగా శ్రమించి చివరికి లక్ష్యాన్ని చేరుకున్నా’ అని విజయగర్వంతో చెప్పుకొచ్చాడు గ్యారీ.

Updated Date - Nov 17 , 2024 | 11:28 AM