Share News

సలీం... సలామ్‌!

ABN , Publish Date - Sep 01 , 2024 | 10:57 AM

మహ్మద్‌ సలీం... మామూలోడు కాదు. నిన్నమొన్నటి దాకా ఒక సాధారణ ఉద్యోగి. కానీ ఆయన చేసిన పని మాత్రం అసామాన్యమైనది. శవాన్ని చూస్తేనే మనం ఆమడ దూరం పారిపోతాం... అలాంటిది హైదరాబాద్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిలో 27 ఏళ్లపాటు ‘ఫోరెన్సిక్‌ విభాగం (పోస్ట్‌మార్టమ్‌)లో పనిచేసిన ఆయన తన సర్వీసులో ఎన్ని శవాలకు పంచనామా చేశారో తెలుసా? 60 వేలు ... ఈ మధ్యనే టెక్నీషియన్‌’గా ఉద్యోగ విరమణ చేసిన సలీం అనుభవాలు ఆయన మాటల్లోనే ...

సలీం... సలామ్‌!

మహ్మద్‌ సలీం... మామూలోడు కాదు. నిన్నమొన్నటి దాకా ఒక సాధారణ ఉద్యోగి. కానీ ఆయన చేసిన పని మాత్రం అసామాన్యమైనది. శవాన్ని చూస్తేనే మనం ఆమడ దూరం పారిపోతాం... అలాంటిది హైదరాబాద్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిలో 27 ఏళ్లపాటు ‘ఫోరెన్సిక్‌ విభాగం (పోస్ట్‌మార్టమ్‌)లో పనిచేసిన ఆయన తన సర్వీసులో ఎన్ని శవాలకు పంచనామా చేశారో తెలుసా? 60 వేలు ... ఈ మధ్యనే టెక్నీషియన్‌’గా ఉద్యోగ విరమణ చేసిన సలీం అనుభవాలు ఆయన మాటల్లోనే ...

‘‘బతకాలంటే పనో, ఉద్యోగమో చేయాలి కదా. నా అదృష్టం, దేవుడి దయవల్ల గాంధీ ఆస్పత్రిలో 36 ఏళ్ల క్రితం అసిస్టెంట్‌ ఉద్యోగం దొరికింది. ఈ ఏడాది జూన్‌ నెలాఖరున టెక్నీషియన్‌గా ఉద్యోగ విరమణ చేశాను. తొలుత శిక్షణలో భాగంగా అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ పనిచేశా. అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, ఫ్యామిలీ ప్లానింగ్‌, ఆపరేషన్‌ థియేటర్‌... ఇలా పలు విభాగాల్లో సేవలందించా. 1988లో ఓ రోజు పోస్ట్‌మార్టమ్‌ చేసేందుకు సహాయకులెవరూ అందుబాటులో లేకపోవడంతో సీనియర్‌ క్లర్క్‌ ఎజాజొద్దీన్‌ నన్ను పిలిచిండు. తప్పని పరిస్థితుల్లో నేను ఈ విభాగంలోకి రావాల్సి వచ్చింది.


నా తొలి అనుభవం...

పోస్ట్‌మార్టమ్‌ విభాగంలో పని అనగానే నాకు భయమేసింది. ‘శవాలను కోయడమంటే నా వల్ల కాదు సార్‌’ అన్నా... అయితే అప్పటి హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ రాజగోపాల్‌రెడ్డి, పట్నాయక్‌ సార్లు నాకు నచ్చజెప్పిండ్రు. ఆప్రాన్‌ తొడిగించిండ్రు. నెత్తిమీద టోపీ, రెండు చేతులకు గ్లవ్స్‌ వేయించిండ్రు. నా ముందు టేబుల్‌, నా వెనుకే డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌, డాక్టర్లు, మెడికోలు, పోలీసులూ ఉన్నారు. బల్లపైకి డెడ్‌బాడీని తెచ్చినం. ఒంటిపై బట్టలను తొలగించి శుభ్రంగా కడిగిన. దేహంపై ఏమేం గాయాలున్నాయో ముందూ వెనుకా పరిశీలించిండ్రు. సర్జికల్‌ బ్లేడ్‌ చేతికిచ్చిండ్రు. ‘ఓపెన్‌ ద కేస్‌’

అనగానే నాలో వణుకు మొదలైంది. మర్డర్‌ చేస్తున్నట్టు భయం. డాక్టర్లు వీపు మీద చెయ్యేసి ‘మేమున్నం భయపడకు’ అన్నరు.


mag6.2.jpg

‘అల్లా... నన్ను క్షమించు. నేను నా బతుకు దెరువు కోసమే ఈ పని చేస్తున్నా. వీళ్లంతా నాతో బలవంతంగా చేయిస్తున్నరు. నా ప్రమేయమేమీ లేదు’ అని మనసులో అను కున్న. డాక్టర్లు చెప్పినట్టు గదువ (చిన్‌) నుంచి మొదలుకొని పొట్టవరకు అవయవాలను బయటకు తీసి చూసేందుకు వీలుగా దేహాన్ని కోశాను. రెండు చెవుల పక్కన మేకుతో కొడితే తల రెండుగా విడిపోయింది. చావుకు కారణాన్ని నా వెనుక ప్రొఫెసర్‌ చెబుతున్నరు. జూనియర్‌ డాక్టర్లు నోట్‌ చేసుకుంటున్నరు. ఫొటోలు కూడా తీసిండ్రు. కానీ, అందరూ నన్నే గమనిస్తున్నరు. నాలో ఎలాంటి భయం లేదప్పుడు. రక్తపు మరకల్ని కడిగించి, దారంతో కుట్లు వేయించి, కొత్త తెల్లగుడ్డలో శవాన్ని ప్యాక్‌ చేయించిండ్రు. వాసన రాకుండా సెంట్‌ స్ర్పే చేయించిండ్రు. మృతుడి తాలూకు వివరాలున్న కాగితాలను బాడీకి అటాచ్‌ చేయించారు. డెడ్‌బాడీని తీసుకువచ్చి బయట స్ట్రెచర్‌పై వేశా. అదే నేను చేసిన మొదటి పోస్ట్‌మార్టమ్‌. గంటన్నర సమయం పట్టింది. నేను పర్‌ఫెక్ట్‌గానే చేశానని ప్రొఫెసర్‌ మెచ్చుకున్నరు. అలా... ఆ ఒక్కరోజే ఆరు శవాలకు పంచనామా జరిగింది. నా కెరీర్‌లో ఒకేరోజు 22 పోస్ట్‌మార్టమ్‌లు చేసిన సందర్భాలు బోలెడున్నాయి.


ఆమె వల్లే సాధ్యమయ్యింది...

ఇంటికి వచ్చాక నేను ఏమేం చేశానో నా భార్యకు చెప్పిన. దానికామె భయపడింది కానీ అర్థం చేసుకుని ‘‘పిల్లలకు ఏం చేస్తున్నవో చెప్పొద్దు. బయట కూడా ఎక్కడా డిస్కస్‌ చేయొద్దు. డ్యూటీని ఇంటికి తీసుకురావద్దు. ఇంటికి ఫ్రెష్‌గా రావాలి’’ అని హితబోధ చేసింది. ఓ ఆరు నెలలు గడిచాక, నా భార్య చెప్పినట్టు ‘వేరే డిపార్ట్‌మెంట్‌కు మారతానని అడిగా.. సరేనన్నరు. కానీ డాక్టర్లు నన్ను అక్కడే ఉండాలన్నారు.

నేను నా జీవితంలో మొదలు కృతజ్ఞత చెప్పాలంటే అది కచ్చితంగా నా భార్యకే. ఎందుకంటే నేను మార్చురీలో నా పనిలో బిజీగా ఉండేవాడిని. నాతో పాటు ఇల్లు, పిల్లల బాధ్యతలన్నీ ఆమెనే చూసుకునేది.


వాళ్లకు నేనే హీరో...

పోస్ట్‌మార్టమ్‌ చూసేందుకు, ప్రాక్టికల్‌గా నేర్చుకునేందుకు గాంధీ మెడికోలతో పాటు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల విద్యార్థులు, నర్సింగ్‌, హోమియోపతి విద్యార్థులొస్తరు. వాళ్లందరికీ ప్రొఫెసర్‌ సారథ్యంలో పోస్ట్‌మార్టమ్‌ను చాలాసార్లు లైవ్‌గా చూపించిన. వాళ్లందరూ నా ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. పోస్ట్‌మార్టమ్‌ చూడటానికి జడ్జీలు కూడా చాలామందే వచ్చేటోళ్లు. హైకోర్టు జడ్జీలు నన్ను మెచ్చుకోవడం మరిచిపోలేను.

ఇక ఆధ్యాత్మిక ప్రయాణమే...

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. బిడ్డ పెళ్లి చేశాను. ఇద్దరు కుమారుల్లో ఒకరు లాబ్‌ టెక్నీషియన్‌ కాగా, మరొకరు మెకానికల్‌ ఇంజనీర్‌. రిటైర్మెంట్‌ అయ్యాను కాబట్టి రోజుకు ఐదుసార్లు నమాజ్‌ చేయాలె. ఖురాన్‌ చదవాలె. ఉమ్రా చేయాలె, మక్కా వెళ్లాలె. పదిమందికి చేతనైనంత సాయం చేయాలె.. ఇదే నా ముందున్న కర్తవ్యం.

- కందుకూరి సాగర్‌బాబు

Updated Date - Sep 01 , 2024 | 10:57 AM