కొండ మీద సంత
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:25 AM
కొండపై ఇంకా తెల్లారలేదు. చుట్టూ చీకటి. గుడిసె ముందు నులకమంచంలో నిద్రపోతున్న సుక్కాయి నిద్ర నుంచి గతుక్కుమని లేచేడు. వారం నుంచి ఇలాగే జరుగుతోంది. ఒకసారి లేచిన తర్వాత మరి నిద్రపోడు. నిశ్శబ్దంగా కూర్చుని సూర్యుడు వచ్చేవరకూ ఆలోచిస్తూనే వుంటాడు. సూర్యుడు మొదట అడుగుపెట్టేది ఆ కొండ వూరిలోకే. సూర్యుడు వచ్చే దిక్కు వైపు తీక్షణంగా చూస్తున్నాడు.
- బాలసుధాకర్
కొండపై ఇంకా తెల్లారలేదు. చుట్టూ చీకటి.
గుడిసె ముందు నులకమంచంలో నిద్రపోతున్న సుక్కాయి నిద్ర నుంచి గతుక్కుమని లేచేడు. వారం నుంచి ఇలాగే జరుగుతోంది. ఒకసారి లేచిన తర్వాత మరి నిద్రపోడు. నిశ్శబ్దంగా కూర్చుని సూర్యుడు వచ్చేవరకూ ఆలోచిస్తూనే వుంటాడు. సూర్యుడు మొదట అడుగుపెట్టేది ఆ కొండ వూరిలోకే. సూర్యుడు వచ్చే దిక్కు వైపు తీక్షణంగా చూస్తున్నాడు.
పల్లం వూరు వెళ్లినప్పుడు వారం కిందట ఒక సంఘటన జరిగింది. ఎప్పుడూ ఎరగని అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అయితే అందుకు కాదు సుక్కాయి ఆలోచిస్తున్నది. ఆ అవమానాలు అతనికి తెలియనివి కావు. ఆ ఆలోచన వెనుక కారణం వేరే వుంది.
ఇది ఇలాగుంటే సుక్కాయి పెళ్లం బూదికి ఇప్పుడు ఎనిమిదో నెల. ఏ క్షణాన ఎలాగ వుంటుందో తెలీదు. ఎప్పుడు డోలీలో వేసుకుని దిగువుకి తీసుకెళ్లాల్సివస్తుందో ఏమో అని రోజూ బెంగతో వుంటున్నాడు. కొండ మీద నుంచి డోలీలో కిందకి తీసుకుని వెళ్లడం ఎంత కష్టమో, ప్రాణాన్ని నిలబెట్టడం అంతే కష్టం. అక్కడ చేతిలో ఎంతోకొంత డబ్బు లేకపోతే ఇంకా కష్టం.
‘కొండంటే దుంపో కాయో యేదొకటి సేతిలో యెడుతాది. పల్లం వూరిలో ఇచ్చునోలు ఎవురున్నారు?’ ఇది సుక్కాయి ప్రశ్న. పోగా కాన్పుకి కొండ దిగిన తర్వాత మరొక వూరు దాటాలి. అక్కడకి ఆటో కట్టుకుని వెళ్లాలి. పల్లంలో ఈ అన్ని పనులు సజావుగా జరగాలంటే చేతిలో డబ్బులాడాలి.
-
వారం కిందట సుక్కాయి పల్లం వూరెళ్లేడు.
వెళ్లేముందు, ‘‘బూదీ.. కిందకు యెల్తన్నా.. కితం తూరి కొండ కాడి నించి తేనొట్టుకుపోయిన అన్న కాడికే యెల్తన్నా...’’ అని చెప్పి బయలుదేరేడు.
సుక్కాయి తాత, తండ్రి కూడా దిగువ వూర్లకు వెళ్లేవారు. దిగువ వూరి మనుషులు సుక్కాయి తాతతో తండ్రితో స్నేహం చేసేవారు. ఇప్పుడు సుక్కాయితో స్నేహం.
సుక్కాయికి పద్దెనిమిదో యేడు వచ్చినప్పుడు తాత చనిపోయేడు. తాతతో కిందకు వెళ్లే ప్రతిసారి.. వెంట సుక్కాయిని తీసుకుని వెళ్లేవాడు. దారిలో దిగువ వూర్ల సంగతులు చెబుతుండేవాడు. దిగువ వూర్ల గురించి చెబుతున్నప్పుడు తాత ముఖంలో వ్యాపిస్తున్న విషాదాన్ని గమనించేవాడు. తాత కొండ గురించీ చెబుతుండేవాడు. కొండ గురించి చెబుతున్నప్పుడు తాత ముఖం వెలిగిపోతుండటం చూసేవాడు.
కొండన్నా, కొండ మీద బతికే తన మనుషులన్నా తాతకి ఎంతిష్టమో!
సుక్కాయికి లోకం తీరుతెన్నులూ, పోకడలూ తెలియజేసింది తాతే. సుక్కాయి తండ్రి కురమడు.. సుక్కాయి తల్లి కురమమ్మతో పెళ్లై ఏడాది తిరగకుండానే కొండ మీదే విషపుపాము కరిచి చనిపోయేడు. అప్పటికే సుక్కాయి, కురమమ్మ కడుపులో ఉన్నాడు. ఆ రోజే గనుక సమయానికి దిగువకు తీసుకెళ్లుంటే సుక్కాయి తండ్రి బతికేవాడు. అప్పటికీ సుక్కాయి తాత కిందకి దించడానికి ప్రయత్నాలు చేసేడు. డోలీలో వేసుకుని కొంతదూరం వచ్చేరు. ఆ లోగే సుక్కాయి తండ్రి ప్రాణాలు వదిలేసేడు. అయినా తాతకి నమ్మకం పోక కొడుకుని కిందకి తీసుకెళ్లేడు. లాభం లేకపోయింది. కొడుకు దక్కలేదు.
-
దిగువ వూరొచ్చిన సుక్కాయి సరాసరి వూరిలో గల నరసక్కయ్య ఇంటికి వెళ్లేడు. నరసక్కయ్యే సుక్కాయి దగ్గర నుంచి తేనె తీసుకుని వచ్చేడు.
‘‘వొరే సుక్కాయిగా, కొండతేనె తింటే కీళ్లనొప్పులు సన్నగిల్లుతాయాట్రా.. మీ కొండోడే సెప్పేడు. యేదీ.. నీకాడ తేనె నిలవుందేట్రా... మల్ల కొండకొచ్చినప్పుడు డబ్బులు తెత్తాను. ఇత్తావేటి...’’ నాలుగు నెలల కిందట నరసక్కయ్య కొండ మీదకెళ్లినప్పుడు సుక్కాయిని అడిగేడు. అంతకు మునుపు నరసక్కయ్య సుక్కాయి దగ్గర నాలుగు కావుళ్లు చింతబొట్ట, సీతాఫలాలు, మూడు బస్తాల బొగ్గులూ తీసుకెళ్లేడు. ఇంకా వాటి డబ్బులే ఇవ్వలేదు. అయినా తాత నుంచి పల్లంతో వున్న పరిచయం వలన సుక్కాయి లేదనకుండా ఇచ్చేడు.
తేనె తీసుకెళ్లిన ఇరవై రోజులకు నరసక్కయ్య కొండకొచ్చేడు.
నరసక్కయ్య రావడం సుక్కాయి చూసేడు.
దగ్గరకు వెళ్లేడు.
‘‘అన్నా... తేని వొట్టుకుపోయవు గదా.. డబ్బులేవీ? సింతబొట్ట, బొగ్గులు, సీతాపలాల డబ్బులూ?’’ అని గొణిగేడు.
‘‘వొరే.. సుక్కాయిగా... నాల్రోజులాగు యిచ్చిత్తాను. నీది పైసా వుంచుకుంటే అలగడుగు. అదా.. మినపసేని అమ్మినాక వొచ్చిన డబ్బుల్నించి యిచ్చిత్తానులే...’’ ఆ రోజు నరసక్కయ్య అలా సర్ది చెప్పేడు సుక్కాయికి.
మళ్లీ నెలరోజులకు నరసక్కయ్య కొండకు వచ్చేడు. సుక్కాయి డబ్బులు అడిగేడు. నరసక్కయ్య మళ్లీ అదే జవాబు చెప్పేడు.
ఇలా రోజులు గడిచి గడిచి నాలుగు నెలలు అయిపోయేయి.
ఎప్పుడు దిగువకు వెళ్లినా నరసక్కయ్య కోసం వెతికేవాడు సుక్కాయి. నరసక్కయ్య మాత్రం కనిపించేవాడు కాదు. ఇలా కాదని తప్పని స్థితిలో నరసక్కయ్య ఇంటికే వెళ్దామని నిర్ణయించుకుని కిందకొచ్చేడు సుక్కాయి.
ఇపుడు నరసక్కయ్య ఇంటి ముందున్నాడు.
తేనె డబ్బులు చేతికందితే.. పెళ్లాం పురుడుకు ఉపయోగపడతాయని సుక్కాయి ఆశ.
నరసక్కయ్య ఇంటి ముందు నిల్చుని ‘‘అన్నా...’’ అని కేకేశాడు.
నరసక్కయ్య పెళ్లం బయటకు వచ్చి, ‘‘ఏమన్నో... యిలా వొచ్చినావు...’’ అడిగింది.
‘‘అప్పా.. అన్న వున్నాడేటి?’’
‘‘వూర్లోకే వొచ్చీసేడు..’’ కళ్లు ముడేస్తూ జవాబు చెప్పింది.
సుక్కాయి, నరసక్కయ్యని వెతుకుతూ వూర్లో తిరిగేడు. కోవెల దగ్గర నుంచి మొదలుపెట్టి కుమ్మరి వీధి, కంసాలి వీధి, మేదరి వీధి, రెల్లి వీధి, కాపు వీధి, మొండి వీధి, వెలమ వీధి తిరిగేడు. ఎక్కడా కనపడలేదు నరసక్కయ్య. తిరిగి తిరిగి నీరసపడిపోయేడు. ఇంక ఆశలు వదిలేసుకుని కొండకెలిపోదామని నిర్ణయించుకున్నాడు.
వూరిలో నడుస్తున్నాడు.
ఎక్కడ నుంచో నరసక్కయ్య గొంతులాగే వినిపించింది.
వూరు మధ్యలో రాంబజిని దగ్గర నరసక్కయ్య కనిపించేడు.
బాతాకాని కొడుతున్నాడు.
సుక్కాయి గబగబా నరసక్కయ్య దగ్గరకు వెళ్లి...
పీలగొంతుతో ‘‘అన్నా.. తేని డబ్బులు...’’ ఇస్తాడో ఇవ్వడో అన్న అనుమానం సుక్కాయి గొంతులో వినిపించింది. మిగిలినవాటి డబ్బులు వూసెత్తలేదు ఇంకా.
‘‘అవున్రొరేయ్ సుక్కాయిగా.. తేని డబ్బులు ఇయ్యాలి గదా..’’ అప్పుడే గుర్తుకు వచ్చినట్టు మాట్లాడేడు నరసక్కయ్య.
‘‘నాలురోజులాగురా ఇచ్చిత్తాను...’’ అన్నాడు.
‘‘అన్నా... రేపో మాపో ఆడది బిడ్డని కంటాది. దిగువకి వొట్టుకి రావాలి. సాలా కరుసుంతాదన్నా. యియ్యన్నా...’’ అన్నాడు.
నరసక్కాయి కిమ్మనకుండా అలా వున్నాడు.
సుక్కాయి నరసక్కయ్య వైపే ఆశగా చూస్తున్నాడు.
మళ్లీ సుక్కాయే ‘‘అన్నా... సింతబొట్ట, బొగ్గులు, సీతాపలాల డబ్బులూ...’’ అన్నాడు.
నరసక్కయ్య మాట్లాడలేదు.
సుక్కాయికి నరసక్కయ్య మీద ఆశ సన్నగిల్లుతోంది. డబ్బులు ఇవ్వడేమో అన్న అనుమానం. డబ్బులు కాకపోతే ఇంకేవైనా దక్కించుకోవాలని అనుకున్నాడు.
మాట్లాడేడు.
‘‘కొండన తిండాకి గింజనేక పస్తులుంతన్నము అన్నా.. డబ్బులు వొంతు బియ్యింగింజో, కిరసనాయిలో ఇయ్యు అన్నా...’’ ప్రాధేయపడ్డాడు. నరసక్కయ్యకు జవాబు చెప్పే దారి కనిపించలేదు. పైగా సుక్కాయి నలుగురిలో అలా అడిగేసరికి అవమానంగా అనిపించింది. సుక్కాయి మీద లెగిసిపోదామని లోపల నిర్ణయించుకున్నాడు.
అంతవరకూ పక్కకు తిరిగున్న తలని సుక్కాయి వైపు తిప్పి ...
‘‘వొరే.. మా దగ్గిటేటి బత్తాలు బత్తాలు బియ్యిం గాని నిలవున్నాయేట్రా... మామేటి కడుపు నిండా బుక్కిత్తన్నమేటి..’’ గట్టిగా బెదిరించినట్టు అన్నాడు.
నరసక్కయ్య గట్టిగా అలా అనేసరికి నిజంగానే బెదిరిపోయేడు సుక్కాయి.
‘‘అన్నా... వొస్తువు వొట్టుకొచ్చినవు గదా.... నాలుగు నెలలవుతంది. యేదొకటి సావుకారి నించేనా ఇప్పించు’’ దుఃఖంతో కన్నీళ్లు కార్చి మళ్లీ ప్రాధేయపడ్డాడు.
‘‘సెప్పితె యినపడనేదేట్రా.. కొండ నంజికొండకా.. యెల్లెల్లు.. యెవుల కాడ సెప్పుకుంతావో సెప్పుకో... నాను పైసా యియ్యను...’’ అని, దట్టి దులిపి పైన వేసుకుని కోపంగా అరిచేడు.
‘‘యియ్యన్నా.. యియ్యన్నా...’’ అని వెర్రిగా సుక్కాయి నరసక్కయ్య కాళ్ల మీద పడ్డాడు.
నరసక్కయ్య కాళ్లతో తోసేశాడు.
సుక్కాయి మళ్లీ కాళ్లు పట్టుకున్నాడు.
మళ్లీ తోసేసేలోపే నరసక్కయ్య పీక పట్టుకున్నాడు. తనేం చేస్తున్నాడో తనకే అర్థమవలేదు సుక్కాయికి.
‘‘యియ్యన్నా.. యియ్యన్నా... నా తేని నాకియ్యన్నా.. నా బొట్ట నాకియ్యన్నా.. నా బొగ్గులు నాకియ్యన్నా...’’ గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ నరసక్కయ్యని వూపేస్తున్నాడు. నరసక్కయ్యకి వూపిరాడట్లేదు. సుక్కాయి.. మనిషి అరిపి... దానికి తోడు దుఃఖం కలిసిన కోపంతో వూగిపోతున్నాడు.
నరసక్కయ్య నెమ్మదిగా ఎడమకాలు పైకెత్తి సుక్కాయి కడుపులో ఒక తాపు తన్నేడు.
సుక్కాయి ఒక్కసారిగా విరిగి దబ్బున కింద పడ్డాడు.
పైకి లెగుస్తున్న సుక్కాయిని లెగనీయకుండా చేతికొచ్చినట్టు మరో నాలుగుదెబ్బలు కొట్టేడు నరసక్కయ్య.
చుట్టూ వున్నవాళ్లు చోద్యం చూస్తున్నారే తప్ప ఎవరూ నరసక్కయ్యని అడ్డుకోలేదు.
సుక్కాయి కంకరరాళ్ల మీద పడడం వలన చర్మం గీరుకుపోయి రక్తం కారుతోంది. పొట్టలో కాలుతో తన్నడం వలన నొప్పితో విలవిల్లాడాడు. పెదాలు చిట్లి నోటి మూల రక్తం చిమ్మింది.
సుక్కాయిని కొట్టిన నరసక్కయ్య అక్కడనుంచి వెళ్లిపోయేడు.
సుక్కాయి ఏడ్చేడు.
ఒళ్లంతా మట్టి అంటుకుంది. ముఖమంతా చెమటలు పట్టేయి.
నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఒళ్లంతా నొప్పులు. పెదాల నుంచి కారుతున్న రక్తాన్ని చేతితో తుడుచుకున్నాడు.
నేల ఆసరాతో లేచి నిలబడ్డాడు. ఎంతసేపో నిలబడలేకపోయేడు. రాంబజిని కాలవగట్టుకి చేరబడ్డాడు. కొంతసేపు పోయేక ‘నడవగలను’ అని అనుకున్న తర్వాత లేచి నిలబడ్డాడు.
ఎటూ చూడకుండా మౌనంగా తలదించుకుని వెనక్కి తిరగకుండా కొండదారి పట్టేడు.
-
సుక్కాయి లేని సత్తువుని తెచ్చుకుని బలవంతంగా నడుస్తున్నాడు.
కొండకి చేరడానికి ఇంకాస్తా సమయం పడుతుంది.
దారిలో చింతచెట్ల నీడలో తాటికల్లు అమ్ముతోంది యాతోలావిడ. ఆ ఆడ మనిషి చుట్టూ కొందరు మగాళ్లు చేరి కల్లు తాగుతూ మత్తులో తూగుతున్నారు.
సుక్కాయి అక్కడకు వెళ్లి ‘‘అప్పా! సుక్క కల్లు పోత్తావేటి...’’ ముఖంపై కారుతున్న చెమటను తుడుచుకుంటూ అడిగేడు.
ఆ యాతోలావిడ సుక్కాయిని ఎరుగును.
ముంతడు కల్లు పోసింది. మరొక రెండు ముంతలు కావాలంటే పోసింది.
తాగి బయలుదేరేడు.
కొండకేళ్లే దారిలో ముళ్లడొంకలు, తుప్పలు దాటుకుని నడుస్తున్నాడు.
మత్తుగా జోగుతోంది సుక్కాయి వొళ్లు. కొండ గుర్తొస్తోంది. ఎంత త్వరగా కొండకి చేరుతానా అని గస పోతున్నాడు.
మూడుముంతల కల్లు తాగినా కొండ మీద రాజుకుంటున్న మంటలా సుక్కాయి వొళ్లు వెచ్చగా మారింది. తరతరాల నుంచి కొండల్లో సెగలు కక్కుతున్న మంట అది.
సుక్కాయి ఆలోచనలు గతంలోకి వెళ్లేయి.
గతంలో తాత బతికున్న రోజుల్లోకి వెళ్లేయి.
-
ఆ రోజు సంత.
తాతతో పాటూ చింతబొట్ల కావిడితో సంతకు వెళ్లేడు సుక్కాయి.
చింతబొట్లను బేరానికి పెట్టేడు తాత.
అరగంట గడిచిన తర్వాత ఎవరో ఆసామి వచ్చి ‘‘అన్నా.. ఎంతకిస్తావేటి?’’ అడిగేడు.
‘‘బుట్ట యెనబయ్యి..’’ చెప్పేడు తాత.
‘‘మరీ అంత పిరిమేటన్నా? తగ్గించరాదూ...’’
నిజానికి తాతకి రేటు ఎంత చెప్పాలో తెలీదు.
‘‘డబ్బయి...’’ చెప్పేడు తాత.
‘‘రెండూ కలిపి తొంభై రూపాయలు తీసుకో..’’ అంటూ డబ్బులు చేతిలో పెట్టి రెండు బుట్టల్ని బండిలో వేసేసుకున్నాడు ఆసామి.
తాత మారుమాట్లాడకుండా తొంభై తీసుకుని మొలకి దోపుకున్నాడు.
కొంత డబ్బుతో పప్పు, కారం కొని దట్టిలో మూటగట్టేడు.
తర్వాత సంతలో బట్టలు అమ్ముతున్న షావుకారి కొట్టుకెళ్లి ‘‘అన్నా.. ఈ బుసుకొట్టు ముక్కెలగ?’’ అడిగేడు తాత.
‘‘అన్నా.. ఇది అరవై రూపాయలు. చలికాలం, యేసీకాలం తొడుక్కోవొచ్చు. తీసుకో.. మనవడికి బాగుంటాది’’ అని చెప్పి షావుకారు తాత చేతిలో రంగు బుసుకట్టు పెట్టేడు. చేతిలోని డబ్బులు తీసుకున్నాడు.
ఇంకేమి మాట్లాడకుండా తాత బుసుకట్టుని సంచిలో పెట్టేడు. చిన్న చిన్న రంగుముక్కల అతుకులతో కుట్టిన బుసుకుట్టది.
సుక్కాయి ఆనాటి ఆలోచనల నుంచి బయటకొచ్చేడు.
కొండ దగ్గరపడుతోంది. నడకలో వేగం పెంచేడు. ఆ రోజు మొదలు దిగువున పల్లం వూర్లలో మోసపోయిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకురాసాగేయి సుక్కాయికి.
‘తాతల నుంచి నా వొరకూ కొండోడు మోసపోడమేనా! కొండోడంటే పరాయోడి సేతికి కొండమేకలా అమిరిపోడమేనా? కొండోడంటే అంత సిన్నసూపా? కొండకి యెవులొచ్చినా పేమగ ఆదరిస్తం గద..
అలాటి మమ్మల్ని మోసం సేత్తున్రేమీ? మామేరోజూ యెవుల్నీ మోసం సేసి ఎరుగమే!’ ప్రశ్నలు, సందేహాలు సుక్కాయి మెదడుని దొలిచేయి. ముళ్లదారి, తోట, గెడ్డ దాటుకుని సన్నటి కొండగాటీల నుంచి కొండ మీదకి తన వూరికి చేరేడు సుక్కాయి.
-
వారం గడిచింది.
కొండ ఇంకా తెల్లారని చీకట్లో నులకమంచం మీద లేచి కూర్చున్న సుక్కాయిలో వారం కిందట పల్లం వూరిలో జరిగిన అవమానం కన్నా ఇంకో ఆలోచన దొలుస్తోంది.
ఆనాడు ఆ సంఘటన తర్వాత నుంచి కొండ కింద దిగువ వూర్లలో సుక్కాయి కనిపించడం మానేసేడు.
సుక్కాయే కాదు.. సుక్కాయి వూరు, ఆ వూరికి చుట్టు పక్కల వూర్ల కొండ ప్రజలు కొండ కిందకు రావడం మానేసేరు.
‘‘కొండపైనున్న ఊర్లన్నిటినీ ఏకం సెయ్యాలి. ఒంటిగా ఎవులిమల్ల ఆలుంతె పల్లమోడు యిలగె ఎవులు సవగ్గ దొరికితె ఆలిని మోసం సేత్తాడు. ఇక అలగ జరగ్గూడదు. కొండంతటినీ ఏకం సెయ్యాలి’’ లోలోపల పథకం వేసేడు సుక్కాయి.
తెల్లారి ఎనిమిదయ్యింది.
ముందుగా కొండ మీద తన వూరివాళ్లతో మాట్లాడేడు.
‘‘అవును.. సుక్కాయి సెప్పింది నిజిం.. సుక్కాయి సెప్పినట్టుగ సేద్దుము...’’ అన్నారు వూరివాళ్లు.
పక్క పక్క కొండ వూర్లనూ కలిసేడు సుక్కాయి.
అందరూ సుక్కాయి పథకాన్ని, సుక్కాయిని అంగీకరించేరు.
‘‘సుక్కాయి ఎంత గొప్ప ఆలోసన సేసేడు..’’ అనుకున్నారు.
సుక్కాయి మాట్లాడుతున్నంతసేపూ అందరి కళ్లూ తడిబారేయి.
‘‘తాత వోటమే..’’ అనుకున్నారు. మురిసిపోయేరు.
దిగువుకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బూది చుక్కలాంటి కొడుకును కన్నాది. తాత పుట్టేడని సుక్కాయి మురిసిపోయేడు.
పల్లం వూరిలో తనకి జరిగిన అవమానం గురించి సుక్కాయి తనవాళ్లకి ముందుగా చెప్పలేదు. అందరూ ఏకాభిప్రాయానికి
వచ్చాకే జరిగిన అన్యాయాన్ని చెప్పేడు. అందరూ తమలో సుక్కాయిని
చూసుకున్నారు. తరతరాలుగా తాతలతండ్రుల నుంచి మోసపోతున్న కొండని చూసుకున్నారు. మరి మోసపోకూడదనుకున్నారు.
-
పథకం ప్రకారం కొండ మీదే సంత పెట్టేరు.
‘‘కొండోలు.. దిగువుకేమి రాలేదు...’’ అని అనుకున్నారు పల్లం వూరివాళ్లు.
ఆశ్చర్యపోయేరు.
కొండోలు కొండ మీద సంత పెట్టేరనే విషయం మొత్తానికి దిగువ వూరివాళ్లకి తెలిసింది.
కొన్ని రోజులు మాత్రం దిగువ
వూర్లువాళ్లు కొండకి రాలేదు. ఓపిక వహించారు కొండవూరివాళ్లు. తర్వాత నెమ్మదిగా కొండ మీద చింతపండు, బొగ్గులు, సిమిడి పళ్లు, సీతాఫలాలు, మూలికలు వంటి కొండ ఉత్పత్తులు కొనుక్కోవడానికి కొండ మీదకే రావడం మొదలుపెట్టేరు దిగువ వూరివాళ్లు.
ఇప్పుడు సుక్కాయి, సుక్కాయి వూరు, పక్కపక్క కొండవూరివాళ్లు అందరూ కొండ ఉత్పత్తులను వాళ్లు నిర్ణయించుకున్న రేటుకే కొండ మీదే అమ్ముతున్నారు.
ఇన్నాళ్లూ పడిన అవమానాలనూ, అవహేళనలనూ కడుపులో దాచుకుని ఏ చిన్న అన్యాయం ఎదురైనా గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు.
- 96764 93680