సాకర్... నదిలో సీరియస్‌గా...
ABN , Publish Date - Nov 10 , 2024 | 07:01 AM
మైదానంలో రేసుగుర్రాల్లా పరుగెడుతూ... ఎదుటి ఆటగాడికి చిక్క కుండా... ఒడుపుగా తప్పించు కుంటూ... బంతిని లాఘవంగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టగానే... ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కేరింతలతో ఊగిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగే సాకర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. యూకేలోని కాట్స్‌వోల్డ్స్ దగ్గర ఉన్న ‘బోర్టన్ ఆన్ ద వాటర్’ అనే గ్రామంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సైతం అంతే ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే మ్యాచ్ జరిగేది మైదానంలో కాదు... నదిలో....
మైదానంలో రేసుగుర్రాల్లా పరుగెడుతూ... ఎదుటి ఆటగాడికి చిక్క కుండా... ఒడుపుగా తప్పించు కుంటూ... బంతిని లాఘవంగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టగానే... ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కేరింతలతో ఊగిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగే సాకర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. యూకేలోని కాట్స్‌వోల్డ్స్ దగ్గర ఉన్న ‘బోర్టన్ ఆన్ ద వాటర్’ అనే గ్రామంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సైతం అంతే ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే మ్యాచ్ జరిగేది మైదానంలో కాదు... నదిలో....
పచ్చిక మైదానంలో ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు తెలుసు. ఇప్పటికి లెక్కలేనన్ని చూశాం. అయితే నదిలో ఆడే వెరైటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూడాలంటే మాత్రం యూకేలోని కాట్స్‌వోల్డ్స్ దగ్గర ఉన్న బోర్టన్ ఆన్ ద వాటర్ గ్రామానికి వెళ్లాలి. ఆ గ్రామం గుండా ‘విండ్‌రష్’ అనే నది ప్రవహిస్తుంది. విశేషమేమిటంటే గ్రామంలో ఒక చోట మాత్రం నది చాలా తక్కువ లోతు ఉంటుంది. భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ ప్రదేశంలో ప్రవాహం ఆరేడు అంగుళాలు ఉంటుంది. అంటే మన చీలమండ మాత్రమే మునుగుతుంది. సరిగ్గా ఇక్కడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి.
వందేళ్ల క్రితం మొదలయ్యింది...
నదిలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటం అనే సంప్రదాయం వందేళ్ల క్రితం మొదలైందని చెబుతారు స్థానికులు. ఈ సంప్రదాయం నిరంతరాయంగా నేటికీ కొనసాగుతోంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న విషయమేమిటంటే నది పక్కనే ‘కింగ్స్ బ్రిడ్జ్’ పేరుతో ఒక పబ్ ఉండేదట. అందులో బాగా తాగిన కొంతమంది బోర్‌గా ఫీలై నదిలో దిగి ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టారట. అప్పటి నుంచి ఈ ఆట కొనసాగుతూనే ఉంది. ‘‘వందేళ్ల నుంచి రివర్ ఫుట్‌బాల్ ఆట ఉంది. అది కాస్త ఈ ఊరి సంప్రదాయంగా కొనసాగుతోంది’’ అని మ్యాచ్ ఆర్గనైజర్ మ్యాట్ వింటర్ అంటారు. ఈ వెరైటీ ఫుల్‌బాల్ మ్యాచ్‌కు గంట సమయం కేటాయిస్తారు. ‘బోర్టన్ రోవర్ ఫుట్‌బాల్ క్లబ్’కు చెందిన రెండు జట్లు ఈ ఆటలో తలపడతాయి. సాధారణ ఫుట్‌బాల్ ఆటలో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అన్నీ ఇక్కడా ఉంటాయి. సాధారణంగా క్రీడాకారులు మైదానంలో ఆడితే ఇక్కడ మాత్రం నదిలో ఆడతారు. అదొక్కటే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.
కొవిడ్ సమయంలోనూ...
నదిలో రెండువైపులా గోల్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్ 50 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సైతం ఆటగాళ్లతో పాటు తడిసి ముద్దవుతారు. అందుకే వాటర్‌ప్రూఫ్ దుస్తులు వేసుకుని రమ్మని ప్రేక్షకులకు సూచిస్తుంటారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకులకు అపరిమితమైన ఆనందాన్ని పంచుతుంది. మ్యాచ్ చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో వస్తుంటారని స్థానికులు చెబుతారు. సాధారణ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఉన్నట్టుగానే పెనాల్టీలు, రెడ్‌కార్డు చూపించడం అన్నీ ఇక్కడ కూడా ఉంటాయి.
కొవిడ్ సమయంలోనూ ఈ పురాతన సంప్రదాయం మిస్సవ్వకూడదని మ్యాచ్ సమయాన్ని బాగా తగ్గించి, ఐదు నిమిషాల పాటు నిర్వహించారు. సాధారణంగా ఎక్కువ గోల్స్ చేసిన జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. ‘రివర్ ఫుట్‌బాల్’ ట్రోఫీని అందుకోవడం గౌరవంగా భావిస్తారు. మైదానంలో ఆట, నీటిలో ఆట చూడటానికి ఒకేలా ఉన్నా... పాల్గొనే క్రీడాకారులకు రెట్టింపు సత్తువ అవసరం. నీటిలో బంతిని కిక్ కొట్టాలంటే అంత సులువేం కాదు. అందుకు చాలా సత్తువ ఉండాలి. మ్యాచ్ సమయంలో ఒడ్డున ఉండి (చాలామంది ఉత్సాహంతో నీటిలోకి దిగుతారు) చూసే ప్రేక్షకుల కేరింతలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది.