Share News

Plaque: రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి?

ABN , Publish Date - Jan 26 , 2024 | 05:48 PM

రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్స్ ఇవే

Plaque: రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి?

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవనశైలి కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. కంప్యూటర్ల ముందు గంటలు గంటలు గడిపేయడం, హానికారక కొవ్వులు ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ వంటివి తినడంతో జీవనశైలి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కొందరికి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతోంది. దీన్నే వైద్య పరిభాషలో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది చివరకు గుండె సంబంధిత సమస్యలకూ దారి తీస్తుంది. ఈ సమస్య రాకూడదనుకుంటే కొన్ని ఆహారపదార్థాలు రోజువారి భోజనంలో భాగం చేయాలని నిపుణులు చెబుతున్నారు (superfoods that prevent plaque formation in blood vessels).

పసుపు

పసుపులో కుకుర్మిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. దీనికి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే లక్షణం ఉంది. ఫలితంగా రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతో పాటూ కొవ్వు కూడా పేరుకోదు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే రసాయనం శరీరంలో కొలెస్టెరాల్ స్థాయిలను తగ్గించి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటుంది.

బెర్రీస్

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు లాంటి వాటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కణజాలంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఇన్‌ఫ్లమేషన్ రాకుండా చేస్తాయి. వీటితో రక్తపోటు కూడా తగ్గడంతో రక్తనాళాల పనితీరు మెరుగై వాటిల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.


ఫ్యాటీ ఫిష్

సాల్మన్, మాకరెల్, సార్డీన్స్ వంటి చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగయ్యేందుకు ఈ ఫ్యాటీ యాసిడ్ ఎంతో కీలకం. దీంతో, శరీరంలోని ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే సమస్య రాదు. గుండె కొట్టుకునే తీరుకూడా మెరుగపడి రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఆవకాడోస్

ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్‌ స్థాయిలను తగ్గించే మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఆవకాడోల్లో అధికంగా ఉంటాయి. వీటిల్లో ఫైబర్, పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీంతో, రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే ప్రమాదం తొలగిపోతుంది.

ఆకు కూరలు

పాలకూర, బ్రోకలీ లాంటి ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటితో రక్తపోటు తగ్గి రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్‌తో కొలెస్టెరాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

బాదంపప్పులు, వాల్నట్స్ వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిల్లో ఉండే ఎల్-ఆర్జినైన్ అనే అమైనోయాసిడ్.. రక్తనాళాల పనితీరు మెరుగుపడేందుకు కీలకం.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ యాంటీఆక్సిడెంట్స్ కారణంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం తగ్గిపోతుంది.

డార్క్ చాక్లెట్

కొకోవా శాతం ఎక్కువగా ఉండే ఫ్లేవనాయిడ్స్‌..చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి మంచి కొలెస్టెరాల్‌ను పెంచుతాయి. ఇవి రక్తనాళాల పనితీరు మెరుగుపడేందుకు కీలకం. అయితే, డార్క్ చాక్లెట్‌లో కెలోరీలు అధికంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.

గ్రీన్ టీ

కాటచిన్ అనే యాంటీఆక్సిడెంట్ గ్రీన్ టీలో అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.

Updated Date - Jan 26 , 2024 | 05:55 PM