తీపి ‘బంగారం’
ABN , Publish Date - Nov 17 , 2024 | 09:12 AM
క్వాలిటీ స్వీట్ అంటే మహా అయితే కిలో వెయ్యి, రెండు వేల రూపాయలకు లభిస్తుంది. జైపూర్‌లోని ‘త్యోహార్’ అనే మిఠాయి దుకాణం ఒక ప్రత్యేకమైన స్వీటును తయారుచేసి, కిలో ఏకంగా 70 వేల రూపాయలకు అమ్ముతోంది. పది గ్రాముల బంగారం ధరకు ఇంచుమించుగా ఉన్న ఈ ‘గోల్డ్ స్వీట్’ కథేంటీ...
క్వాలిటీ స్వీట్ అంటే మహా అయితే కిలో వెయ్యి, రెండు వేల రూపాయలకు లభిస్తుంది. జైపూర్‌లోని ‘త్యోహార్’ అనే మిఠాయి దుకాణం ఒక ప్రత్యేకమైన స్వీటును తయారుచేసి, కిలో ఏకంగా 70 వేల రూపాయలకు అమ్ముతోంది. పది గ్రాముల బంగారం ధరకు ఇంచుమించుగా ఉన్న ఈ ‘గోల్డ్ స్వీట్’ కథేంటీ...
చూడటానికి అచ్చంగా మైసూర్ పాక్‌లా కనిపిస్తుంది. పేరు ‘స్వర్ణ్ భస్మ్ పాక్’. ఇంతకీ దీని గొప్పతనం ఏంటీ అంటారా? ఈ స్వీట్‌ను నిజంగానే బంగారు భస్మంతో తయారుచేస్తారు. అందుకే అంత ఖరీదు.
‘ఈ స్వీట్ తయారీ కోసం మేలైన ఆఫ్ఘనిస్తాన్ ఆల్మండ్స్ ఉపయోగిస్తాం. వీటిని ఆరు గంటలపాటు నానబెట్టిన తర్వాత పొట్టు ఒలిచి... నెయ్యిలో వేగిస్తాం. తర్వాత చక్కెర, బంగారం పొడి వేస్తాం. వీటితో పాటూ ఖరీదైన కుంకుమ పువ్వునూ వాడతాం. అందుకే ఇంత ధర పెట్టాం’ అంటారు ‘త్యోహార్’ యజమాని కునాల్. పూర్వకాలంలో కొన్ని ఆహార పదార్థాల్లో బంగారం, వెండిని కూడా తగిన మోతాదులో వాడేవారు. ఆరోగ్యానికి ఈ లోహాలు కూడా ఎంతోకొంత మేలు చేస్తాయని పురాతన వైద్య గ్రంథాలు పేర్కొన్నాయి.
‘ఆయుర్వేదంలో కొన్నిరకాల వ్యాధుల చికిత్సకు స్వర్ణ్ భస్మ్‌ను ఉపయోగిస్తారు. మా దుకాణంలో ఈ స్వీట్ తీసుకుంటే తీపితో పాటు మెడిసిన్ కూడా అందుతుంది కాబట్టి ఆరోగ్యం బోనస్’ అంటున్నారు కునాల్ భార్య అంజలీ జైన్. సాధారణంగా మిఠాయిలను వెండిపొరతో అలంకరిస్తారు. అది అన్ని మిఠాయి దుకాణాలు చేస్తాయి. మిఠాయిలో బంగారం పొడి కలపాలనే ఆలోచన ఇంట్లో మాట్లాడుకునేప్పుడు వచ్చిందంటుందామె. ఈ దంపతులు స్వర్ణ భస్మ్ పాక్‌లాగే ‘చాంది భస్మ్ పాక్’నూ తయారు చేస్తున్నారు. అంటే స్వీట్‌లో వెండి పొడిని కలుపుతారు. ఒక్క పీస్ ధర 350 రూపాయలు.
నగల పెట్టెలాగే...
‘స్వర్ణ్ భస్మ్ పాక్’ స్వీట్ తయారయ్యాక బంగారుపూత పూస్తారు. పైన నెయ్యిలో వేయించిన జీడిపప్పు, పిస్తాతో గార్నిష్ చేస్తారు. మనదేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత ఖరీదైన మిఠాయి. ఒక కిలోకు 70 వేల రూపాయలు. అదే చిన్న ముక్క తీసుకుంటే 450 రూపాయలు ఉంటుంది. ఇంకాస్త పెద్ద ముక్కకు 1500 రూపాయలు. సాధారణంగా వీరి దుకాణానికి ధనికులే ఎక్కువగా వస్తుంటారు. వారి కోసమే లగ్జరీగా దీన్ని తయారుచేశారు. గోల్డ్ షాప్‌కు వెళ్లి చిన్న ఉంగరమో, ముక్కు పుడకో కొంటే... దాన్ని అందమైన బాక్సులో పెట్టి ఇస్తారు కదా. అలానే ఈ ‘గోల్డ్ స్వీట్’ను అలాంటి బాక్సులో ప్యాక్ చేసి ఇస్తారు. ఏదేమైనా మనదేశంలోనే ప్రస్తుతం అత్యంత ఖరీదైన స్వీట్ ఏదంటే ‘స్వర్ణ్ భస్మ్ పాక్’ అని బులియన్ మార్కెట్ సాక్షిగా చెప్పాల్సిందే మరి!