సరికొత్తగా ‘సాగు’తున్నారు!
ABN , Publish Date - Nov 03 , 2024 | 07:36 AM
ఎప్పుడూ ఒకే రకం పంటలు కాకుండా, సరికొత్త పంటలతో సాగులో వైవిధ్యం చూపుతున్నారు కొందరు రైతులు. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే కొన్ని అరుదైన పంటలను అభివృద్ధి చేసే దిశగా ఈ రైతులు అడుగులు వేస్తున్నారు. సాగుబడిలో కొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఆ విశేషాలే ఇవి...
ఎప్పుడూ ఒకే రకం పంటలు కాకుండా, సరికొత్త పంటలతో సాగులో వైవిధ్యం చూపుతున్నారు కొందరు రైతులు. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే కొన్ని అరుదైన పంటలను అభివృద్ధి చేసే దిశగా ఈ రైతులు అడుగులు వేస్తున్నారు. సాగుబడిలో కొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఆ విశేషాలే ఇవి...
ఇటీవల కాలంలో కొందరు ఔత్సాహిక రైతులు బియ్యం, పండ్ల సాగులో ప్రయోగాలు చేస్తున్నారు. భేష్ అనిపించుకుంటున్నారు. ఆయా పంటలను లాభదాయకంగా మార్చుకుంటున్నారు.
- గౌతమ బుద్ధ రైస్
‘బుద్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత కపిలవస్తుకు వెళుతుండగా ఒక గ్రామంలో స్థానికులు ఆయనను ఆపి, ఆశీర్వాదం కోరినప్పుడు... బుద్ధుడు తన భిక్షాపాత్రలో నుంచి పిడికెడు వడ్లను తీసి వారికి ఇచ్చాడు.
‘‘వీటిని విత్తండి. వీటికొక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఆ సువాసన ఎప్పుడూ నన్ను గుర్తుకు తెస్తుంది’’ అని గ్రామస్తులకు చెప్పారాయన. ఈ వరి బౌద్ధకాలం నుంచి సాగులో ఉందని చరిత్రకారులు చెబుతారు. ఆ ధాన్యమే నేడు యూపీలో సిద్ధార్థనగర్, గోండా, సంత్ కబీర్‌నగర్, గోరఖ్‌పూర్‌లో పండిస్తున్నారు. ‘‘వీటిని కొందరు ‘బుద్ధ రైస్’ అంటే మరి కొందరు ‘కాలానమక్ రైస్’ అని కూడా పిలుస్తారు’’ అని వివరించాడు యువ రైతు జక్కుల తిరుపతి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, లింగా పూర్‌లో తిరుపతి తన రెండెకరాల పొలంలో ‘బుద్ధ రైస్’ సాగు చేస్తున్నాడు.
ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ నుంచివిత్తనాలు తెప్పించి పొలంలో వేశాడు. ఆ పంట ఎదిగి కోతకు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి మాత్రమే తొలిసారి ఈ వరి వంగడాన్ని పండిస్తున్నాడు. ‘‘ఈ ధాన్యం నల్లని పొట్టుతో లోపలి గింజ సన్నగా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల రక్తహీనత, అల్జీమర్స్, మధుమేహం లాంటివి నియంత్రణలో ఉంటాయి’’ అని తిరుపతి అంటారు. ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి ‘స్పెషాలిటీ రైసెస్ ఆఫ్ ది వరల్డ్’ పుస్తకంలో ఈ వంగడం పేరు చోటుచేసుకుంది. బుద్ధ రైస్‌తోపాటు తిరుపతి కాలా బట్టి, చింతలూరు సన్నాలు, దశుమతి లాంటి అరుదైన వంగడాలను కూడా పండిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
- పోలవరం పండు
‘‘ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మా ప్రాంతానికి టూరిస్టుల రాక పెరుగుతుంది. పోలవరం నుంచి ఏం తెచ్చారని ఎవరైనా అడిగితే ‘గాక్ ఫ్రూట్’ని చూపించాలి. పోల వరం బ్రాండ్‌గా అందరూ చెప్పుకోవాలని ఈ పండ్లు ఇప్పటి నుంచే సాగు చేస్తున్నా’’ అని అంటాడు ఏలూరు జిల్లా, పోలవరంమండలం, మామిడిగొంది గ్రామవాసి బోరగం వెంకట్.
‘‘మా ప్రాంతం నుంచి ఒక కొత్త పంటను పరిచయం చేయాలనే తపనతో కేరళలో ఒక రైతు నుంచి గాక్ ఫ్రూట్ మొక్కలు తెప్పించి మా ఇంటి పెరటిలో ఇరవై సెంట్ల తోటలో నాటాను. వారానికి పది కిలోలు పండు తున్నాయి. ఈ కాయలతో కూర కూడా చేసుకోవచ్చు. పండ్లు కిలో రూ.500 ధర ఉంది’’ అని వివరించాడు.
పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్‌కి కొత్త పంటల మీద మక్కువ. ఇంటర్‌నెట్‌లో వెతికి కేరళలో గాక్ ఫ్రూట్ గురించి తెలుసుకున్నాడు. ఏడాది పాటు దిగుబడి ఇచ్చే తీగజాతి మొక్క ఇది. ప్రస్తుతం వందకు పైగా మొక్కల్ని తన పెరటిలో పెంచుతున్నాడు. రెండు ఆడమొక్కల పక్కన ఒక మొగ మొక్కను నాటాలి. ఒక్కసారి నాటితే చాలు. ఇరవై ఏండ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఆకాకర కాయల్లా ఉండి పండిన తరువాత ఎర్రగా ఉంటాయి. లోపల గుజ్జుతో పాటు గింజలుంటాయి. గింజలు తీసేసి గుజ్జును జ్యూస్‌గా చేసుకొని తాగొచ్చు. కాయలు ఆకుపచ్చగా ఉన్నపుడు కూర వండుకొని తింటే దోసకాయ మాదిరి రుచిగా ఉంటుంది. చీడపీడలు తక్కువే, సులువుగా సాగుచేసుకోవచ్చు. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడమే కాక, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయంటున్నారు.
- ఆదివాసీ బియ్యం
అరకులోయ, డుంబ్రిగుడ మండలంలోని చిన్న గ్రామం కరకవలస. ఇక్కడ తరతరాల వారసత్వంగా వస్తున్న పంటల్లో కొన్ని అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వాటిలో కొన్నింటినైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి రైతులు. కొన్ని దశాబ్దాల క్రితం ఎక్కువగా పండించిన ‘బుడమ’ వరి ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదు. ఆ పంటను వీరు కాపాడుకుంటూ వస్తున్నారు. కొండవాలులో మాత్రమే ఈ అరుదైన వరి వంగడం పెరుగుతుంది. ‘‘బుడమ ధాన్యం మూడేళ్లు నిలువ ఉంచిన తరువాత తింటాం. బిర్యానీ రైస్‌లా భలే ఉంటుంది.
ఈ ధాన్యాన్ని మూడేళ్ల తరువాత తినాలి’’ అని రైతు పాంగి రఘు అంటాడు. బుడమ ధాన్యంతో పాటు మరికొన్ని వంగడాలను కూడా వీరు సాగు చేస్తున్నారు. కరక వలసలో 40 మంది గిరిజన రైతులు ఈ పంటలు అంతరించిపోకుండా కాపాడుతున్నారు. విత్తనాలను వెదురు బుట్టల్లో దాచుకుంటారు.
చిన్న కమతాల్లో సాగు చేయడం వల్ల ఈ బియ్యం వారి కుటుంబ అవసరాలకుమాత్రమే సరిపోతున్నాయి. ఈ అరుదైన ఆదివాసీ వంగ డాలు అంతరించి పోకుండా, అందరికీ అందు బాటులోకి తేవడానికి ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీరికి సహకరించే ప్రయత్నం చేస్తున్నాయి.
- శ్యాంమోహన్, 94405 95858