ఊరంతా ఇంజనీర్లే..!
ABN , Publish Date - Dec 08 , 2024 | 10:01 AM
‘‘టక్..టక్- టక్..టక్..’’ రాత్రిపగలన్న తేడాలేదు. ఊరంతా ఒకటే శబ్దం. ఒకవైపు మనుషులు, మరోవైపు మర మగ్గాలు పోటీపడి వస్త్రాలు తయారవుతున్నాయి. ఇళ్లల్లో ఎవరి పని వారిదే!. మాటల్లేవు.. పనొక్కటే మాట్లాడుతోంది. వీధులన్నీ రంగురంగుల దారాలతో నిండిపోయాయి.
ఐఐటీల్లో సీట్లు కొట్టాలంటే.. ఉన్న ఊరినీ, కన్న తల్లిదండ్రుల్నీ వదిలి.. ఏ పట్నమో, నగరమో చేరుకుని.. రాత్రింబవళ్లు కష్టపడితే కానీ ర్యాంకులు ఆశించలేరు. అలాంటిది ఉన్న చోటే ఉంటూ.. నగరాల్లోని కోచింగ్ సెంటర్లతో ఢీకొట్టి.. సై అంటే సై అంటున్న ఆ ఊరి పేరు.. బిహార్‌లోని ‘పట్వాటోలి’. ముప్పావుశాతం చేనేతవర్గానికి చెందిన కుటుంబాలున్న ఆ ఊర్లో ఇప్పుడు ఇంటికొక ఇంజనీరు.. ఐఐటీయన్లు ఉన్నారు..
‘‘టక్..టక్- టక్..టక్..’’ రాత్రిపగలన్న తేడాలేదు. ఊరంతా ఒకటే శబ్దం. ఒకవైపు మనుషులు, మరోవైపు మర మగ్గాలు పోటీపడి వస్త్రాలు తయారవుతున్నాయి. ఇళ్లల్లో ఎవరి పని వారిదే!. మాటల్లేవు.. పనొక్కటే మాట్లాడుతోంది. వీధులన్నీ రంగురంగుల దారాలతో నిండిపోయాయి. అద్దకం పనులతో గమ్మత్తయిన వాసన వస్తోంది. ఆ మరమగ్గాల చప్పుళ్లను వదిలించుకుని ఊరి నడుమకు వెళితే.. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. గంభీరమైన వాతావరణం. బుద్దగయలో బుద్ధుడు తపస్సు చేసినట్లు .. ధ్యానముద్రలో కూర్చున్నారంతా..! అదొక శిక్షణ కేంద్రం. అక్కడున్నది ఐఐటి జేఈఈ విద్యార్థులు.
మాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఒకదాని వెంట ఒకటి.. క్లాసులు పూర్తవుతున్నాయి. మరమగ్గాల సందడి మధ్య.. చదువుల యజ్ఞం చేస్తున్న ఆ వింత ఊరు.. బిహార్‌లోని ‘పట్వాటోలి’. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అత్యంత పవిత్ర చారిత్రక ప్రదేశం ‘బుద్ధగయ’కు కేవలం 5.2 కి.మీ... పట్నా నుంచి అయితే 98 కి.మీ. దూరాన ఉంటుందీ పల్లెటూరు. పట్వాటోలి ఏటా కొన్ని వేల వస్త్రాలను దేశానికి అందిస్తున్నట్లే.. కొన్ని వందల మంది ఐఐటీయన్లనూ తయారుచేస్తోంది. ఈ ఊరికి ‘ఐఐటీ ఫ్యాక్టరీ’ అన్న పేరొచ్చింది అందుకే!.
వృత్తి నైపుణ్యమే నేర్పింది..
‘పట్వాటోలి’ పెద్ద ఊరు కాదు.. చిన్నదే. జనాభా 1500. తొంభై శాతం కుంటుబాలన్నీ నేతన్నలవే!. ఊరంతా చేనేత కార్మికులన్న మాట. ‘పట్వా’ హిందీ పదం. ‘పట్’ అంటే పట్టు అని అర్థం. కాబట్టి పట్టు, పత్తి, దారం, అద్దకం, నేత పనులను చేసే నిపుణులను ‘పట్వా’ అంటారు. ఉత్తరభారతంలో పట్వాస్ అంటే నేత కార్మికులు. ఈ ఊరికే ‘మాన్‌పూర్’ అన్న మరొక పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజుల్లో అక్బర్ కొలువులోని రాజామాన్‌సింగ్ వస్త్రాల కొరతను తీర్చడానికి.. రాజస్థాన్‌లోని పట్వాలను బుద్ధగయ ప్రాంతానికి తీసుకొచ్చారట. వాళ్లందరూ అక్కడే స్థిరపడటంతో మాన్‌సింగ్ వల్ల ‘మాన్‌పూర్’ అన్నపేరొచ్చింది. కాలక్రమంలో అది పట్వాటోలిగా మారింది.
పురాణాల ప్రకారం.. పట్వాలు విష్ణువు హృదయం నుంచి ఉద్భవించిన వాళ్లన్నది ఒక విశ్వాసం. వీరు హిందు సంప్రదాయాలను, జాతకాలను బాగా అనుసరిస్తారు. భక్తిప్రవృత్తులు అధికం. మర్యాదస్తులు.. వివాదరహితులు. తరాల నుంచీ చేస్తున్న నేత పని వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత, వినయం, సహనం, ముందుచూపు.. వంటి సుగుణాలు సొంతమయ్యాయి. దారాలతో వస్త్రాలను నేయడం అత్యంత సూక్ష్మనైపుణ్యం. ప్రతీ పోగును మెల్లగా అల్లుతూ ఒక వస్త్రం తయారు చేయాలంటే కొండంత ఓర్పు అవసరం. పట్వాలు చేనేత వృత్తిలో ఉండటం వల్ల ముప్పావుశాతం మందిలో ఇవే సారూప్య లక్షణాలు కనిపిస్తాయి.
ప్రధానంగా పూర్వకాలంలో రాజస్థాన్‌లోని పట్వాలు దారాలు పూసలతో అల్లిన రంగురంగుల దండలు, కొయ్యబొమ్మలు, గోళ్ల రంగులు, చెవిపోగులు వంటివన్నీ ఊర్లు తిరిగి అమ్మేవారు. కాలక్రమంలో వెండి, బంగారు, జలతారు దారాలను సన్నటి తీగల్లా మార్చి.. ఆభరణాలను, పట్టు వస్త్రాలను చేశారు. బహుళ నైపుణ్యాలతో రాణించారు. దిల్లీలోని సదర్ మార్కెట్‌లోహోల్‌సేల్ వ్యాపారానికి కేంద్రం అయ్యింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పాటు దక్షిణ భారతంలో కూడా విస్తరించారు. కాలక్రమంలో లక్షల కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి.
మరమగ్గాలు దెబ్బతిని..
ప్రపంచీకరణ అన్ని వృత్తులను దెబ్బతీసినట్లే.. పట్వాలు నమ్ముకున్న నేత పనినీ దెబ్బతీసింది. పట్వాటోలిలో ఎక్కువ మంది దుప్పట్లు, తువ్వాళ్లు, వస్త్రాలు నేసేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పదిహేనువందల పవర్‌లూమ్స్ పనిచేసేవన్నారు గ్రామపెద్దలు. ఇప్పుడా పరిస్థితి లేదు. రోజుకు రెండు లక్షల తువ్వాళ్లు ఉత్పత్తి చేసిన ఘనత ఇక్కడి పల్లెలకుంది. డైయింగ్, బ్లీచింగ్, ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్లలో వీరు సిద్ధహస్తులు. గ్రామంలో తయారైన దుప్పట్లు ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు పంపేవారు. కరోనా సమయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి.. పట్వాటోలి గ్రామస్థులతో నూలు మాస్కులను నేయించింది.
ఇలా హ్యాండ్లూమ్ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగిందనే చెప్పవచ్చు. అందుకే ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే పేరొచ్చింది. చేనేత పరిశ్రమ ఎదుగుతున్నకొద్దీ కాలంతో పోటీపడలేకపోయింది. దేశమంతా ఇదే పరిస్థితి. మరమగ్గాల కరెంటు బిల్లులు తడిసి మోపెడయ్యాయి. అందులోనూ విద్యుత్ అంతరాయం పరిశ్రమను దెబ్బతీసింది. ముడిసరుకు కొనుగోళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. పెట్టుబడులకు సకాలంలో నిధులు సమకూరలేదు. మార్కెట్ పడిపోయింది. పోటీ చెప్పనక్కర్లేదు. కొత్తకొత్త సంస్థల పోటీకి నేత కార్మికులు తట్టుకోలేకపోయారు. ‘‘మా ఊర్లో ఒకప్పుడు వెయ్యికి పైగా మరమగ్గాలు సందడి చేసేవి. నిత్యం చేతినిండా చేసేంత పని ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
కొత్తతరం యువత ఈ వృత్తిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదు. దగ్గర్లోని ఏ పట్నమో వెళ్లి ఉద్యోగం చేస్తూ ప్రపంచాన్ని చూడాలనుకుంటోంది..’’ అన్నారు పట్వాటోలి గ్రామస్థుడు. ఊరి జనం ప్రధాన వృత్తి వస్త్రతయారీ కావడంతో.. అది కాస్త దెబ్బతిన్నాక.. చదువులపై దృష్టి సారించింది కొత్తతరం. ‘‘ఎలాగైనా కష్టపడి చదువుకోవాలి. ర్యాంకులు కొట్టాలి. సీట్లు సంపాదించాలి. ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం ఇదొక్కటే’’ అన్న భావన గ్రామ విద్యార్థుల్లో నాటుకుపోయింది. ఊర్లో ఒకే సామాజికవర్గం ఉండటంతో ఇంటింటికీ పోటీ ఏర్పడింది.. ఐకమత్యంతో అనుకున్నది సాధించాలన్న కసి అందరి కళ్లలో కనిపించించి.
ఒకే ఒక్కడితో ప్రారంభం..
అది 1991.. ‘పట్వాటోలి’ ఎన్నో సూర్యోదయాలను చూసింది.. కానీ ఆ రోజు ప్రత్యేకం. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందాని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారంతా!. ఉదయాన్నే యఽథావిధిగా మరమగ్గాల చప్పుళ్లు మొదలయ్యాయి. కాసేపయ్యాక.. ఆ శబ్దాలను బద్దలు కొట్టుకుని మరో శబ్దం.. ఊరంతా వ్యాపించింది. కుర్రాళ్లు ఒక్కటే అరుపులు.. ఈలలు.. అమ్మాయిలైతే చప్పట్లు.. ఉన్నట్లుండి పట్వాటోలి ఉలిక్కిపడింది. కారణం? ఆ ఊర్లో మొట్టమొదటిసారి ‘జితేందర్ ప్రసాద్ పట్వా’ అనే చేనేత బిడ్డ ఐఐటీలో ర్యాంకు కొట్టడం..!. ఆ రోజుల్లో ఒక గ్రామీణ విద్యార్థికి ఐఐటీలో సీటు రావడం ఊహలకందని గెలుపు. అతడి తల్లిదండ్రులిద్దరూ నిరుపేద చేనేత కార్మికులు.
జితేందర్ విజయం ఆయనొక్కనిదే కాదు.. ఊరంతటిదీ! ఆ మాటకొస్తే మరమగ్గాల చప్పుళ్లలో జీవితాలు కరిగిపోయిన చేనేతవర్గ శ్రామికులది..! దశాబ్దాల వృత్తిలో కొత్తతరం బతకలేమనుకున్నప్పుడు.. దారి మళ్లించే అద్భుత విజయం అది. అందుకే ఊరంతా తమ కొడుకే ర్యాంకు కొట్టాడన్నంత ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతని ఐఐటీ చదువు పూర్తవ్వగానే విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. పట్వాటోలి తొలి ప్రవాస భారతీయుడు జితేందరే!. ఊర్లోని విద్యార్థులందరికీ అప్పటి వరకు సినిమావాళ్లే ఆరాధ్యులు. ఇప్పుడు జితేందరే రోల్‌మోడల్. ‘‘ఒకప్పుడు మా ఊర్లో పదోతరగతి గట్టెక్కడమే గగనం. జితేందర్ ఐఐటీ సీటు సాధించాక .. తోటి పిల్లలు ‘మనం కూడా పెద్ద పెద్ద కలలు కనొచ్చు’ అన్న నమ్మకం కలిగింది. ఇలా పరోక్షంగా విద్యార్థుల మైండ్‌సెట్‌నే మార్చేశాడు జితేందర్. అదే మా ఊరి ఎదుగుదలకు నాంది పలికింది..’’ అన్నారు ఊరి పెద్దలు.
ఊరంతా పోటీనే..
జితేందర్ అమెరికాకు వెళ్లాక సొంతూరిని మరిచిపోలేదు. ఆయన ఎక్కడున్నా మరమగ్గాల చప్పుళ్లు.. ఊరోళ్ల కష్టాలు బుర్రలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి. ‘‘నేనొక్కన్నే బాగుపడితే చాలదు. సొంతూర్లోని విద్యార్థులను సైతం నాలాగే పైకి తీసుకురావాల...’’ ని తీర్మానించుకున్నాడు. చేనేతకు గిరాకీ తగ్గుతున్న సమయంలో చదువుతప్ప మరొక మార్గం లేదన్నది ఆయన అభిప్రాయం. అడపాదడపా ఊరికి వచ్చినప్పుడల్లా ... విద్యార్థులందర్నీ ఒక చోట కూర్చోబెట్టుకుని ‘ఇక మీరు చదువునే నమ్ముకోండి.. మరొక మార్గం లేదు..’ అంటూ లక్ష్యాన్ని నూరిపోశాడు. ‘‘మీరందరూ మాతృభాషలో చదువుకున్నా సరే.. ఆంగ్లం నేర్చుకోవాల్సిందే!.
మన ఊరిని దాటి ప్రపంచాన్ని చూడాలంటే ఆంగ్లం తప్పదు..’’ అన్నాడాయన. ఆయన ప్రేరణతో పట్వాటోలిలో ఐఐటి చదువుల యజ్ఞం రాజుకుంది. రాత్రిళ్లు జాగారం చేస్తూ పోటీపడి చదవసాగారు విద్యార్థులు. వారికి కావాల్సినవన్నీ సమకూర్చారు తల్లిదండ్రులు. ఇక ఆ ఊరికి జితేందరే మెంటర్. 1998లో ముగ్గురు విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లొచ్చాయి. మరుసటి ఏడాది అనూహ్య విజయం.. మరో ఏడుగుర్ని ఐఐటి వరించింది. ఇక, అప్పటి నుంచి పట్వాటోలిలో ఐఐటి హవా మొదలైంది. ఇతర గ్రాడ్యుయేట్లకు నగరాల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలొచ్చాయి.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి)లతో పాటు ప్రముఖ విద్యాసంస్థల్లోనూ సీట్లొచ్చాయి. గ్రామానికే చెందిన పీతాంబర్‌కుమార్ ఏకంగా సివిల్‌సర్వీస్ కొట్టాడు. ఇంకో వ్యక్తి సిఆర్‌పిఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్ అయ్యాడు. బ్యాంకు ఉద్యోగాలకైతే కొదవలేదు. ప్రతి ఇంటికీ ఒక ఇంజనీర్, ఒక ఉద్యోగి తయారయ్యారు. ‘‘మా అమ్మాయికి ఖరగ్‌పూర్ ఐఐటిలో సీటొచ్చింది..’’, ‘‘మా అబ్బాయి ఎన్‌ఐటి కొట్టాడు’’, ‘‘మా పిల్ల తొలిసారి పరీక్షల్లోనే ఎస్‌బిఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యింది..’’ ఊర్లోని రచ్చబండ దగ్గర కూర్చుంటే చాలు.. ఇలాంటి కబుర్లే వినిపించాయి. తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లేవు.
చదువులోనూ ఐకమత్యం..
గెలుపునకు ఆకలి ఎక్కువ. ఈ విజయం సరిపోదు. మరింతమందిని ఐఐటియన్లను తయారుచేయాలి... అన్న ఆలోచన వచ్చింది సీనియర్లకు. ర్యాంకులొచ్చి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన పట్వాటోలి స్థితిమంతులందరూ చేతులు కలిపారు. ‘‘మన ఊర్లో ఇప్పటికీ చాలామంది ఐఐటీ ప్రిపరేషన్‌కు ఖరీదైన కొచింగ్‌లు తీసుకోలేరు. అంత డబ్బులుపెట్టి పుస్తకాలను కొనుక్కోలేరు. మనమే ఏదైనా చేయాలి..’’ సమావేశంలో తీర్మానించారు. అందుకు వాళ్లు ఎంచుకున్న సులువైన మార్గం ‘గ్రూప్ స్టడీ’. అందర్నీ ఒక చోట కలిపి నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తే బావుంటుందని తలచారు. ‘‘మా ఊర్లోని నేతన్నలకు ఆర్థిక సౌలభ్యం లేదు. కానీ, కష్టపడి పైకి రావాలన్న తపన మాత్రం బాగుంది.
కంటికి కనిపించని చిన్న చిన్న నూలు పోగులతో వస్త్రాలను అల్లిన నేర్పు, ఓర్పు మాకున్నాయి. ఆ లక్షణాలే మా పిల్లలకు మేమిచ్చిన ఆస్తిపాస్తులు.. ఊరంతా కలిసి ఉమ్మడిగా ఏదైనా చేయాలనుకున్నాం. ఇప్పటికే ఉద్యోగాలొచ్చిన యువతీయువకుల సాయంతో ‘వృక్ష వేద చైన్’ అనే చిన్న సంస్థను నెలకొల్పాము. విద్యార్థులందరికీ పైసా ఖర్చు లేకుండా ఇక్కడ శిక్షణ లభిస్తుంది. ఏటా పలువురు ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్లు సాధిస్తున్నారు. ఇంకొందరు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు...’’ అన్నారు పట్వాటోలి గ్రామస్థులు. ఈ ఊరి నుంచి ఐఐటీలు చదివి ముంబయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో స్థిరపడిన వాళ్లు సైతం ఆన్‌లైన్‌లో గ్రామంలోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
ముఖ్యమైన పుస్తకాలు, మెటీరియల్ వంటివి అందజేస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పట్వాటోలి గ్రామ విద్యార్థులు వందల్లో చేరారు. కొన్నేళ్ల నుంచి కనీసం నాలుగు వందల మందికి వివిధ ఐఐటీల్లో సీట్లొచ్చాయి. ఉత్తర భారతంలోనే కాదు.. దేశంలోనే ఒక చిన్న గ్రామంలో ఇన్నేసి ఐఐటీ సీట్లొచ్చిన ఊరు మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఊర్లోని ప్రతి ఇంటికీ ఒక ఇంజనీర్ ఉన్నాడు. దాంతో కుటుంబాల రూపురేఖలే మారిపోయాయి. బుద్ధగయలో బస్సు దిగిన పర్యాటకులు పట్వాటోలికి వెళ్లొద్దామనేంత ప్రాచుర్యం పొందిందీ ఊరు.
- సండే డెస్క్
మా కోసం మా కోచింగ్..
‘‘ఎక్కడో ఎప్పుడో జరిగిన గెలుపు కథలు మనకు అంతగా స్ఫూర్తినివ్వవు. మన ఊర్లో,
మన పొరుగింట్లో, మనం కలిసిన తిరిగిన స్నేహితుల్లో, బంధువుల్లో ఒకరు.. విజయం సాధిస్తే.. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇన్నాళ్లూ మన మధ్య ఉన్నోడు సాధించగాలేంది.. నేనేందుకు సాధించకూడదు? అన్న ఆలోచన తరుముకుంటూ వస్తుంది. ఎక్కడలేని పట్టుదల మొదలవుతుంది. మా ఊరు పట్వాటోలిలో ఉన్నదంతా దాయాదులు, బంధువులు, ఒకే సామాజికవర్గ ప్రజలే! ఒకరు పైకొస్తే మరొకరు రావాల్సిందే!. ప్రతి ఇంట్లో ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఆరోగ్యకరపోటీగా మారింది. ఒకరిపట్ల మరొకరికి అసూయలు లేవు.
ఉన్నది ఆప్యాయతలే!. ఈ పోటీ చదువుతోనే ప్రారంభం అయ్యింది. ఎప్పుడైతే తొలిసారిగా జితేందర్ ప్రసాద్ పట్వా ఐఐటీ సాధించి.. అమెరికా వెళ్లిపోయాడో అప్పటి నుంచీ ఊరి పిల్లల ఆలోచనా ధోరణి పూర్తీగా మారిపోయింది. తాము కూడా అలా ర్యాంకులు కొట్టి ఉన్నత స్థానాల్లోకెళ్లి.. తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని చూడాలని కలగన్నారు విద్యార్థులు. అలాంటి వాళ్లను తీర్చిదిద్దేందుకు పుట్టిందే ‘వృక్ష వేద చైన్’. ఊర్లోని విద్యార్థులందరికీ ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తున్నాం. మా ఊరి నుంచి వెళ్లిన మాజీ ర్యాంకర్లు అందరూ ఆన్‌లైన్‌లో కూడా కోచింగ్ ఇస్తున్నారు. అంటే.. మాకు మేముగా తయారు చేసుకున్న కోచింగ్ సంస్థ ఇది. ఇరవై ఏళ్ల నుంచి మా ఊర్లోని వందల మంది పిల్లలు ఐఐటీయన్లుగా పట్టాలు అందుకున్నారు. ఇప్పుడు చాలామంది విభిన్న రంగాల్లో ఊహించనంత ఎత్తుకు ఎదిగారు.’’
- దూబేశ్వర్ ప్రసాద్,
వృక్షవేద చైన్, పట్వాటోలి, బిహార్