Tattoo: తొలిసారి టాటూ వేయించుకుంటున్నారా?ఈ విషయాల గురించి ఆలోచించారా?
ABN , Publish Date - Dec 02 , 2024 | 10:34 PM
శరీరంపై శాశ్వతంగా నిలిచుండే టాటూ వేయించుకునేందుకు పలు విషయాలు పరిగణలోకి తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య అనేక మంది టాటూలు వేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో టాటూలు వేసుకున్న కొందరు తమ నిర్ణయానికి చింతిస్తున్నారు. కాబట్టి, శరీరంపై శాశ్వతంగా నిలిచుండే టాటూ వేయించుకునేందుకు పలు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు (Viral).
అసలు జనాలు ఎందుకు టాటూ వైపు మళ్లుతున్నారనే దానిపై సైకాలజీ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొందరికి టాటూ సాంస్కృతిక పరమైన అంశం. మరికొందరికి ఇది భావోద్వేగానికి సంబంధించింది. ఇంకొందరికి ఇది కేవలం అభిరుచి మాత్రమే. ఇక కొందరు తమ వ్యక్తిత్వానికి, భావోద్వేగాలకు, సామాజిక బంధాలకు వ్యక్తికరణగా టాటూలను చూస్తారట. ఇక అప్పటికప్పుడు పుట్టిన ఆలోచనతో కొందరు టాటూలు వేయించుకుంటారు. మనసుకు తగిలిన గాయాల నుంచి కోలుకున్నందుకు, వ్యక్తిగత, ఆధ్యాత్మిక అభివృద్ధికి, జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు చిహ్నంగా టాటూలను భావించే వారూ ఉన్నారు. ఓ వ్యక్తి జీవన ప్రయాణం, అతడి జీవితానికి అర్థం, పరమార్ధానికి వ్యక్తీకరణే టాటూ అని అభివర్ణిస్తారు.
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చెడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
కారణాలు ఏమైనప్పటికీ టాటూలు ఏ ప్రదేశంలో వేయించుకోవాలనే దానిపై సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నొప్పి తక్కువగా ఉండే భాగాల్లో టాటూ వేయించుకోవడం సులభమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. చేయికి దిగువన మణికట్టు వైన, లేదా మణికట్టు భాగంలో టాటూ వేయించుకుంటే నొప్పి తక్కువగా ఉంటుందట. అయితే, ఇది వ్యక్తుల అభిరుచులను బట్టి కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక డిజైన్ల విషయంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. కొందరు సింపుల్‌గా కనిపించే డిజైన్లను ఎంచుకుంటే, కొందరు పూల ఆకారంలో ఉన్నవి, లేదా కొటేషన్లు, ఇతర డిజైన్లు ఎంచుకుంటారు. ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా వ్యక్తుల అభిరుచిపై ఆధారపడి ఉంటుందని టాటూ ఆర్టిస్టులు చెబుతున్నారు. అయితే, శరీరంపై అందరికీ కనిపించే భాగాల్లో టాటూలు వేసుకోవాలని కొందరు భావిస్తే మరికొందరు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. కొందరు తామూ కూడా నేరుగా చూడలేని భాగాలపై వేసుకుంటారని కూడా టాటూ ఆర్టిస్టులు చెబుతున్నారు.
Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..
అయితే, అకస్మాత్తుగా మనసుకు తోచిందని చెప్పి టాటూ వేయించుకోవడం అస్సలు సరికాదని నిపుణులు చెబుతున్నారు. కొందరు టీనేజర్లతో పాటు పెద్దల్లో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తుందని అన్నారు. తమ ఇష్ట సెలబ్రిటీలను అనుకరించాలనో లేదా మరోదే కారణంతో టాటూలు వేయించుకుంటే భవిష్యత్తులో విచారపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టాటూ డిజైన్, ఎక్కడ టాటూ వేయించుకోవాలి, ఆర్టిస్టు ఎవరు అనే విషయాలపై అన్ని కోణాల్లో చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలనేది నిపుణులు చెప్పేమాట. కాబట్టి, ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని చెబుతున్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమైన అంశాలు, మనసుకు దగ్గరైన అంశాలను టాటూల నేపథ్యంగా ఎంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. టాటూ సైజు కూడా మరీ చిన్నగా కాకుండా చూసుకోవాలట. లేకపోతే భవిష్యత్తులో డిజైన్ అలుక్కుపోయినట్టు కనిపిస్తుందని చెబుతున్నారు. కాబట్టి. ఈ విషయంలో ఓ నిర్ణయానికి కొన్ని నెలలు ఏళ్లు పట్టినా తప్పులేదని అనుభవజ్ఞులు చెబుతున్నారు.